పారదర్శకంగానే సెంటర్ల కేటాయింపు..గ్రూప్‌‌‌‌‌‌‌‌-1పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు

పారదర్శకంగానే సెంటర్ల కేటాయింపు..గ్రూప్‌‌‌‌‌‌‌‌-1పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 పరీక్ష కేంద్రాల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ (టీజీపీఎస్సీ) గురువారం హైకోర్టుకు తెలిపింది. దివ్యాంగుల సౌకర్యం కోసం సెంటర్ల మార్పు జరిగిందని, దీనిపై అనుమానాలతో ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని వివరించింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్‌‌‌‌‌‌‌‌లపై హైకోర్టు జడ్జి జస్టిస్‌‌‌‌‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు.

టీజీపీఎస్సీ తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది ఎస్‌‌‌‌‌‌‌‌.నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పరీక్ష కేంద్రాలను భౌతికంగా పరిశీలించి, అక్కడి వసతుల ఆధారంగా అభ్యర్థుల కేటాయింపు జరిగిందని తెలిపారు. పిటిషనర్లు ఆరోపిస్తున్న కోఠి మహిళా కాలేజీలో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ ఎత్తుగా ఉండటం వల్ల దివ్యాంగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అందుకే ఇతర కాలేజీలకు మార్చినట్లు వివరించారు. హాల్‌‌‌‌‌‌‌‌టికెట్‌‌‌‌‌‌‌‌ నంబర్ల మార్పు కారణంగా కేంద్రాల కేటాయింపు జరగలేదన్నారు.

45 పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కోసం పోలీసులకు లేఖ రాసినట్లు తెలిపారు. అయితే, వికలాంగులను సర్దుబాటు చేయాల్సి రావడంతో కేంద్రాల సంఖ్య 46కు పెరిగిందని వెల్లడించారు. అలాగే, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన వారిలో 12 శాతం మంది ఎంపికయ్యారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. మూల్యాంకనం కోసం ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో పనిచేసే వారినే ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, మూల్యాంకనం కోసం ఎంపికకు ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ చరిత్రకు సంబంధించి మూల్యాంకనం ఎలా చేస్తారని అడిగారు. దీనిపై పూర్తి వివరాలను సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌లో సమర్పిస్తామని చెప్పడంతో న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.