రూల్స్ కి విరుద్ధంగా బైక్ టాక్సీలు నడుపుతున్నారు: TGPWU

రూల్స్ కి విరుద్ధంగా బైక్ టాక్సీలు నడుపుతున్నారు: TGPWU

ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీలు అందించే బైక్ టాక్సీ సర్వీస్ ను తెలంగాణలో నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దీనికి కారణం  బైక్ టాక్సీల వల్ల ఆటో రిక్షా, క్యాబ్ డ్రైవర్లలకు తక్కువ రైడ్లు వస్తున్నాయని, దీనినే ఉపాధిగా చేసుకున్నవాళ్లు నష్టపోయే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. 

ప్రైవేట్ లైసెన్స్ ఉన్న వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడానికి అనుమతి లేకున్నా, బైక్ టాక్సీ పేరుతో ఈ సేవలను అందించడం చట్టవిరుద్దమని అని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా గుర్తు చేసింది. మోటారు వాహనాల చట్టం (MV చట్టం, 1989 యొక్క రూల్ 50, 51) ప్రకారం టూ వీలర్ వెహికల్స్ కి తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉండాలని, వాణిజ్య వాహనాలకు పసుపు రంగు నెంబర్ ప్లేట్ ఉండాలనే రూల్ ఉంది. అయితే, బైక్ లను వాణిజ్య పరంగా టాక్సీలుగా ఎలా అనుమతిస్తున్నారని ఆరోపించారు. 

ఉబెర్, ఓలా, ర్యాపిడో కంపెనీలు మొదట క్యాబ్ సర్వీస్లని మొదలుపెట్టి నెమ్మదిగా ఆటో, బైక్ టాక్సీలను ప్రవేశపెట్టాయి. తర్వాత ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకొని ఛార్జీల బాదుడు మొదలుపెట్టినా, ఉన్న లొకేషన్ నుంచే పికప్, డ్రాప్ ఫెసిలిటీ ఉండేసరికి ప్రయాణికులంతా వీటికే మొగ్గు చూపిస్తున్నారు.