డోర్లు మూశాకే బస్సులు కదలాలి..డోర్లు లేని బస్సులకు వెంటనే ఏర్పాటు చేయాలి..ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు

డోర్లు మూశాకే బస్సులు కదలాలి..డోర్లు లేని బస్సులకు వెంటనే ఏర్పాటు చేయాలి..ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు
  • కండక్టర్ ప్రవళిక మృతి నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ)  ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సంస్థ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సులకు విధిగా డోర్లు ఏర్పాటు చేయాలని, డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే బస్సును ముందుకు కదిలేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం బుధవారం  ఉత్తర్వులు జారీ చేసింది.

సిటీ సర్వీసులు, పల్లె వెలుగుతో సహా ప్రయాణికులను తీసుకెళ్లే ఏ బస్సయినా డోర్లు మూశాకే బయలుదేరేలా చూడాలని డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం డోర్లు లేని బస్సులను గుర్తించి, వాటికి యుద్ధప్రాతిపదికన డోర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని డిపో మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.

కండక్టర్ మృతి నేపథ్యంలోనే చర్యలు

ఇటీవల మణుగూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్‌‌‌‌ను బస్సులో నుంచి ఓ ప్రయాణికురాలు బయటకు తోసేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు కండక్టర్, హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటనతో తక్షణమే స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కండక్టర్లు, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకుంది.