
- ఫైటర్ జెట్లు, రాకెట్లు, ఫిరంగులతో దాడులు
- ఇరు దేశాల్లో 11 మంది మృతి
- ముందు దాడి చేసింది మీరే అంటూ.. పరస్పరం ఆరోపణలు
బ్యాంకాక్: సరిహద్దు వివాదం కారణంగా థాయ్ లాండ్, కంబోడియా దేశాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వద్ద పలు గ్రామాల్లో గురువారం ఇరు దేశాల సైనికులు.. ఫైటర్ జెట్లు, రాకెట్లు, ఫిరంగులతో దాడులకు దిగారు. ఈ అటాక్ లో ఇరువైపులా 11 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
థాయ్ లాండ్ లోని సురిన్ ప్రావిన్స్, కంబోడియాలోని ఒడ్డర్ మీంచే ప్రావిన్స్ సరిహద్దుల వద్ద ‘ఎమరాల్డ్ ట్రయాంగిల్’ ఏరియా విషయంలో ఇరు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. లావోస్ తో పాటు ఇరు దేశాల సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. ప్రాచీన దేవాలయాలకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. 15 ఏండ్ల కిందట ఇరు దేశాలు ఈ ప్రాంతం కోసం గొడవపడ్డాయి.
ఈ ఏడాది మే నెలలో కూడా జరిగిన గొడవలో కంబోడియన్ సైనికుడు చనిపోయాడు. తాజాగా గురువారం మళ్లీ రెండు దేశాలు దాడి చేసుకున్నాయి. అయితే.. ముందుగా దాడి చేసింది మీరంటే మీరే అంటూ రెండు దేశాలు ఆరోపణలు చేసుకున్నాయి. థాయ్ లాండ్ పై రాకెట్లు, ఫిరంగులతో కంబోడియా దాడి చేయగా.. థాయ్ లాండ్ కూడా ఎఫ్16 ఫైటర్ జెట్లతో దాడులు చేసింది.
మా సరిహద్దులను థాయ్ ఉల్లంఘించింది..
తమ ప్రాదేశిక సమగ్రతను థాయ్ లాండ్ ఆర్మీ ఉల్లంఘించిందని కంబోడియా రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘‘కంబోడియన్ సరిహద్దులను కాపలా కాస్తున్న బలగాలపై ముందుగా థాయ్ లాండ్ ఆర్మీ అటాక్ చేసింది. దీంతో మా దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే దాడి చేశాం. ఆత్మరక్షణ కోసం మాకు ఉన్న న్యాయబద్ధమైన హక్కును వాడుకున్నాం” అని కంబోడియా రక్షణ శాఖ తెలిపింది.
కాగా.. ముందుగా దాడి చేసింది కంబోడియా సైనికులే అని థాయ్ లాండ్ ఆర్మీ ఆరోపించింది. ‘‘కంబోడియా సైనికులు ముందుగా మాపై కాల్పులు జరిపారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. రెండు బీఎం21 రాకెట్లు కూడా ప్రయోగించారు. కాసేపటికి థాయ్ బేస్ కు 200 మీటర్ల దూరంలో ఈస్టర్న్ టెంపుల్ వైపు కాల్పులు జరిపారు” అని థాయ్ లాండ్ ఆర్మీ పేర్కొంది. మరోవైపు ఇరు దేశాలు కూడా వారి దౌత్యవేత్తలను ఆయా దేశాల నుంచి వెనక్కి పిలిపించుకున్నాయి.