Ajith-Vijay: అజిత్-విజయ్ ఫోటోపై ఆటోగ్రాఫ్..- వైరం పుకార్లకు దళపతి చెక్!

Ajith-Vijay:  అజిత్-విజయ్ ఫోటోపై ఆటోగ్రాఫ్..- వైరం పుకార్లకు దళపతి చెక్!

తమిళనాడులో కొత్త రాజకీయ శక్తిగా అవతరించారు స్టార్ హీరో విజయ్. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.  రాజకీయ పర్యటనలో బిజీగా ఉన్న విజయ్ శనివారం ( సెప్టెంబర్ 27న ) నమక్కల్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అజిత్-విజయ్ ఫోటోపై దళపతి ఆటోగ్రాఫ్

ఈ ర్యాలీలో అభిమానులు విజయ్ , మరో అగ్ర నటుడు అజిత్ కుమార్ కలిసి ఉన్న ప్రత్యేక పోర్ట్రెయిట్‌పై ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ పోస్టర్‌ను తీసుకున్న దళపతి విజయ్, చిరునవ్వుతో దానిపై సంతకం చేసి అభిమానికి తిరిగి ఇచ్చారు. ఈ మొత్తం సంఘటన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోర్ట్రెయిట్‌పై సంతకం చేసే సమయంలో విజయ్ ముఖంలో కనిపించిన చిన్న నవ్వు కనిపించింది. ఈ చర్య ద్వారా అజిత్ అభిమానులు కూడా విజయ్‌కు మద్దతు తెలుపుతున్నారని స్పష్టమవుతోందని నెటిజన్లు , అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  సినీ పరిశ్రమలో అజిత్, -విజయ్‌ల మధ్య వైరం ఉందనే ఊహాగానాలకు ఈ సంఘటన చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం చెక్కుచెదరలేదని రుజువు చేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

ఆ బంధం ఎప్పుడూ చెక్కుచెదరదు..

అజిత్-విజయ్‌ల మధ్య స్నేహంపై గతంలోనూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో, అజిత్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించినప్పుడు, విజయ్ ఆయనను అభినందించలేదనే పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ ఆరోపణలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర గట్టిగా ఖండించారు. ఈ వాదనల్లో నిజం లేదు. అజిత్ రేసింగ్‌లో గెలిచినప్పుడు శుభాకాంక్షలు చెప్పిన తొలి వ్యక్తి విజయ్ అని తెలిపారు. అదేవిధంగా, పద్మ భూషణ్ ప్రకటించినప్పుడు కూడా విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య నిజమైన, హృదయపూర్వక స్నేహం ఉంది. కాబట్టి, విజయ్  శుభాకాంక్షలు చెప్పలేదనే వాదనలు అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయాలకు ముందు చివరి చిత్రం

మరోవైపు, విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించడానికి ముందు నటించే చివరి చిత్రం 'జన నాయగన్' . ఈ మూవీ షూటింగ్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. అజిత్‌తో గతంలో 'నెర్కొండ పార్వై', 'వాలిమై', 'తునివు' వంటి హిట్ చిత్రాలను తీసిన హెచ్. వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే,  బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి వంటి ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. 'జన నాయగన్' చిత్రం విడుదల తర్వాత విజయ్ పూర్తి సమయం రాజకీయాలపై దృష్టి సారించనున్నారు.