
న్యూఢిల్లీ: సీజేఐజస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించిన సుప్రీంకోర్టు అడ్వకేట్ రాకేశ్ కిశోర్(71) మంగళవారం (అక్టోబర్ 07) మీడియాతో మాట్లాడారు. తాను ఓ సామాన్య, నిజాయితీపరుడైన వ్యక్తినని, హింసను వ్యతిరేకిస్తానని చెప్పుకొచ్చారు.
సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన ఘటనలో తాను నిమిత్తమాత్రుడినని చెప్పారు. ఆ దేవుడే తనతో ఆ పనిచేయించాడని పేర్కొన్నారు. ‘‘సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించింది నిజమే. అయితే అందులో నా పాత్ర ఏమీ లేదు. అంతా ఆ దైవానిదే. దేవుడే నాతో ఆ పని చేయించాడు. వాస్తవానికి నేను అలాంటి పనులు చేయను. సీజేఐపై షూ విసరాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే. జరిగిందేదో జరిగింది” అని రాకేశ్ కిశోర్ పేర్కొన్నారు. కాగా, గత నెల 16న ఓ కేసు విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని ఎగతాళి చేస్తూ సీజేఐ మాట్లాడారని రాకేశ్ చెప్పారు.
‘‘ఖజురహో ఆలయ కాంప్లెక్స్ లో విష్ణుమూర్తి విగ్రహ పునరుద్ధరణ కోసం దాఖలైన పిల్ ను సీజేఐ విచారించారు. ఆ సందర్భంలో దేవుడి గురించి సీజేఐ అవమానకరంగా మాట్లాడారు. దేవుడి మీద జోక్ వేశారు” అని రాకేశ్ కిశోర్ ఆరోపించారు.
దాడులు కరెక్ట్ కాదు: సీజేఐ తల్లి
తన కుమారుడిపై జరిగిన దాడి యత్నంపై సీజేఐ గవాయ్ తల్లి డాక్టర్ కమల్ గవాయ్ స్పందించారు. దాడిని ఖండించారు. అలాంటి ఘటనలు దేశాన్ని
అస్థిరపరుస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.