
- చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- అట్టహాసంగా జరిగిన ఓపెనింగ్ సెర్మనీ
చెన్నై: అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన 44వ చెస్ ఒలింపియాడ్ అట్టహాసంగా ప్రారంభమైంది. అద్భుతమైన లైటింగ్‌తో వెలిగిపోయిన జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టోర్నీని ప్రారంభించారు. ఈ మెగా ఈవెంట్‌కు తొలిసారి చెన్నై (ఇండియా) ఆతిథ్యమిస్తుండటంతో.. రాష్ట్రం మొత్తం చెస్ జోష్‌లో మునిగిపోయింది. తమిళ సంస్కృతి ఉట్టిపడేలా మోడీ కూడా పంచెకట్టుతో పాటు భుజంపై కండువా ధరించారు. ఘనంగా జరిగిన ప్రోగ్రామ్‌లో తమిళ సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తమిళ సంప్రదాయ దుస్తులు ధరించిన ఒలింపియాడ్ మస్కట్ ‘తంబి’ కటౌట్స్ నగరమంతటా కనిపించాయి. పోటీలు జరిగే మామల్లపురంలో చెస్ ప్రమోషన్ తారాస్థాయికి చేరుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, సీఎం ఎంకే స్టాలిన్, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ మేయనాథన్, సినీ హీరో రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్, ఉదయనిధి స్టాలిన్, , ఫిడే అధికారులు ఇందులో పాల్గొన్నారు. 75 నగరాలను చుట్టి వచ్చిన ఒలింపియాడ్ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. స్టేజ్‌పై స్టాలిన్‌కు అందజేశాడు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసేందుకు ప్రజ్ఞానంద్, లోకేశ్, విజయలక్ష్మికి టార్చ్‌ను అందించారు. ఆ తర్వాత ఇండియా విమెన్స్–ఎ టీమ్‌కు సంబంధించిన డ్రాను ప్రధాని తీశారు. తొలి రౌండ్‌లో ఇండియా విమెన్ టీమ్ నల్లపావులతో ఆడనుంది.
ఎనిమిది రకాల నృత్యాలతో..
ప్రధాని మోడీని స్వాగతించేందుకు కొంత మంది పిల్లలు చేసిన భరత నాట్యం అదరహో అనిపించింది. కథక్, ఒడిస్సీ, కూచిపూడి, కథాకళి, మోహినియట్టం, మణిపూరి, సత్రియా, భరతనాట్యంతో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలు.. చెన్నైకి చెందిన సంగీతకారుడు లిడియన్ నాదస్వరానికి ముగ్దులయ్యారు. తమిళ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలకు చెందిన వివిధ రకాల క్రీడలను ఇందులో పెర్ఫామ్ చేశారు. అర్కెస్ట్రాతో వీనులవిందైన సంగీతాన్ని ప్రేక్షకులకు అందించారు. జపాన్, చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, సౌతాఫ్రికా, ఆస్ట్రియా, ఆల్బేనియా, అల్జీరియా, అంగోలా, అర్జెంటీనా, బార్బడోస్ ప్లేయర్లు చప్పట్లతో స్వాగతించారు. వందేమాతరం వినిపించినప్పుడు స్టేడియం మొత్తం ‘జయహో’ అంటూ హోరెత్తింది.
భవిష్యత్ విజేతలే..
చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్లేయర్లను ప్రధాని ఘనంగా స్వాగతించారు. క్రీడల్లో ఓడిపోయినవారు ఉండరని, విజేతలు, భవిష్యత్ విజేతలు మాత్రమే ఉంటారని కొనియాడారు. ‘మీ అందరికి నేను స్వాగతం పలుకుతున్నా. చదరంగం మాతృభూమికి వచ్చింది. మూడు దశాబ్దాల కాలంలో ఆసియాకు రావడం ఇదే తొలిసారి. క్రీడలు ఎప్పుడూ అద్భుతమైనవే. తమిళనాడులో ఆలయాలను పరిశీలిస్తే చెస్ ఆడిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అందుకే తమిళనాడు చెస్ పవర్‌హౌజ్ అయ్యింది. ఇండియన్ స్పోర్ట్స్‌కు ఇంతకంటే మంచి సమయం ఎన్నడూ లేదు. మేం గతంలో గెలవని ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో గెలిచాం. ఇప్పుడు చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహిస్తున్నాం. కామన్వెల్త్‌లోనూ సత్తా చాటుతాం’ అని మోడీ వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ దూరం..
పాకిస్తాన్ చెస్ టీమ్ ఈ పోటీల నుంచి తప్పుకుంది. టీమ్ ఇండియాకు చేరుకున్న తర్వాత ఆఖరి క్షణాల్లో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్లేయర్లు స్వదేశానికి తిరిగి వెళ్లిపోనున్నారు.