యూపీ ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూసింది

యూపీ ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూసింది

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మరోసారి భారీ విజయం అందించిన ప్రజలకు ఆయన ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ గెలుపు కోసం కృషి చేసిన అగ్రనేతలు మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సహా సాధారణ కార్యకర్త వరకూ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. జాతీయ నేతల సహాకారంతోనే రెండోసారి అధికారంలోకి రాగలిగామని యోగి చెప్పారు. యూపీ ఎన్నికల్లో ఫలితాలపై ఆయన లక్నోలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలు చేసిన ఆరోపణలకు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పారని యోగి అన్నారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మోడీ సర్కారు పథకాల ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రజలకు అందడంతోనే యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధ్యమైందని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని యోగి అన్నారు. ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన విజయమని అన్నారు.