రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక రూమ్.. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్

 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక రూమ్.. ఇంటి నుంచి భోజనం, మెడిసిన్స్

టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‍పై ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక రూమ్ కేటాయించాలని జైలు అధికారులను ఆదేశించింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు కావాల్సిన మెడిసిన్స్, వైద్య చికిత్స అందించాలని ఆదేశించింది. అంతేకాదు.. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. 

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు. రోడ్డు మార్గంలోనే భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్తున్నారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. అక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌ రాజమహేంద్రవరం చేరుకునే అవకాశం ఉంది. విజయవాడలో జోరు వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరిస్తున్నారు.

చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా సోమవారం (సెప్టెంబర్ 11) ఏపీ  బంద్ కు  టీడీపీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలంటూ  అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.  అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని హెచ్చరించారు.