‘శనిగరం ప్రాజెక్టు’ బ్యాక్​ వాటర్​ ముంపు బాధితుల ఆవేదన

‘శనిగరం ప్రాజెక్టు’ బ్యాక్​ వాటర్​ ముంపు బాధితుల ఆవేదన

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శనిగరం వద్ద దాదాపు వందేండ్ల కింద ఒక టీఎంసీ సామర్థ్యంతో  మధ్య తరహా ప్రాజెక్టును నిర్మించారు. మొదట బ్యాక్​ వాటర్​సమస్య లేకున్నా దశాబ్ద కాలంగా భారీగా కురుస్తున్న వార్షాల కారణంగా వస్తున్న వరదతోపాటు చర్ల అంకిరెడ్డిపల్లికి సమీపంలో నిర్మించిన హెచ్ఎండీఏ వాటర్ పంప్ హౌజ్ లోని వేస్టేజ్ వాటర్ చెరువులోకి భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్యతో చిన్నకోడూరు మండలం అనంతసాగర్  లో 50 ఎకరాలు, చర్ల అంకిరెడ్డిపల్లిలో దాదాపు 200 ఎకరాలు, కోహెడ మండలం గుండారెడ్డి పల్లిలో 50 ఎకరాల వ్యవసాయ భూములలో ఏటా వానాకాలం సీజన్ లో పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. చర్ల అంకిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో దాదాపు 25 కుటుంబాలు నివసిస్తుండగా వానాకాలం సీజన్ వచ్చిందంటే ఇండ్లు వదలాల్సిన పరిస్థితి నెలకొంటుంది. 

పరిహారంపై స్పష్టత కరవు

శనిగరం బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న భూములకు ప్రత్నామ్నాయ మార్గాలు కానీ, పరిహారం చెల్లింపుపై కానీ ఎలాంటీ స్పష్టత లేదు. గతంలో నష్టపోయిన రైతులు కొందరికి ఎకరానికి రూ.3 వేల చొప్పున అందించారు. రెండు, మూడు సంవత్సరాలపాటు ఈ పరిహారం ఇచ్చినా 2014 తర్వాత ఇవ్వడం లేదు. గతేడాది ఈ సమస్య తీవ్రంగా మారండంతో అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బ్యాక్ వాటర్ సమస్యను ఎదుర్కొంటున్న చర్ల అంకిరెడ్డిపల్లిలోని ఎస్సీ కాలనీ ఇతర ప్రాంతానికి తరలిస్తామని చెప్పినా ఆ దిశగా ఎలాంటీ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి  గ్రామంలోని 216 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోఎస్సీ కాలనీకి చెందిన 25 కుటుంబాలకు స్థలాలు కేటాయించాలని, మునుగుతున్న పంటలకు పరిహారం కానీ, ప్రత్యామ్నాయ మార్గాలు కానీ చూపాలని బాధితులు కోరుతున్నారు.

వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి

నాకు మూడెకరాల భూమి ఉంది. శనిగరం బ్యాక్ వాటర్ కారణంగా వానాకాలం సీజన్ లో నా భూమి అంతా మునిగిపోతోంది. వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. 

- సుద్దాల బాలయ్య,  బాధితుడు, చర్ల అంకిరెడ్డిపల్లి

పరిష్కారం చూపాలి 

శనిగరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి.  గతంలో పరిహారం ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడం సరికాదు. ఇప్పటికైనా పరిహారం ఇవ్వడమో... ప్రత్యామ్నాయ మార్గాలు చూపడమో చేయాలి.  

- అజ్జు యాదవ్, చర్ల అంకిరెడ్డిపల్లి