హద్దులు మీరుతున్న చైనాకు ముకుతాడు వేయాల్సిందే! : మల్లంపల్లి ధూర్జటి

హద్దులు మీరుతున్న చైనాకు ముకుతాడు వేయాల్సిందే! : మల్లంపల్లి ధూర్జటి

మాకు ఉత్తరాన, పశ్చిమాన సోవియట్ యూనియన్, దక్షిణాన భారతదేశం, తూర్పున జపాన్ ఉన్నాయి. మా శత్రు దేశాలన్నీ ఏకమై నాలుగు దిక్కుల నుంచి మాపై దాడికి దిగితే, మేం ఏం చేయగలం చెప్పండి?” అని మావో జిడాంగ్ తన జీవిత చరిత్రకారుల్లో ఒకరితో అన్నారు. సోవియట్ యూనియన్ తో సరిహద్దు వివాదాన్ని చైనా పరిష్కరించుకోగలిగింది. జపాన్ తో విభేదాలు కొనసాగుతున్నాయి.  ఇండియాతో ఉన్న సరిహద్దులు మాత్రం నిర్ణయం కాకపోవడం వల్ల భారత్- చైనా సరిహద్దులో గస్తీ తిరుగుతున్న రెండు దేశాల సైనిక దళాల మధ్య అడపాదడపా ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.  ఒకరి భూభాగంలోకి ఒకరు వచ్చారనే నిందారోపణలు కొనసాగుతున్నాయి. 

భారత్ తనకు సమ ఉజ్జీ కాదని, పైగా, సైద్ధాంతికంగా(ప్రజాస్వామిక దేశంగా) పాశ్చాత్య దేశాలకు భారత్ దగ్గరని, కాబట్టి నమ్మదగింది కాదని కమ్యూనిస్టు చైనా అభిప్రాయం. సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్న దేశంగా భారత్ ను చైనా గుర్తించకపోవడమే అసలు సమస్య. అగ్ర రాజ్యాల్లో ఏదో ఒక దానికి మనం దగ్గరవుతున్నామని భావించినపుడు మాత్రమే అది చర్చల పల్లవి అందుకుంటుంది లేదా సరిహద్దులో ఆక్రమణలకు దిగుతుంది. భారత్ పట్ల దాని ఎత్తుగడలు అలానే రూపుదిద్దుకుంటూ వస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధానికి ముందు, తర్వాత ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడినపుడు భారత్ పట్ల చైనా అనుసరించిన విధానంలో మనం దాన్ని గమనించవచ్చు. వ్యూహాత్మకంగా తనపై ఒత్తిడి లేకుండా చేసుకోవడం చైనా ప్రధాన లక్ష్యం. కానీ, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియాలు ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడిన తర్వాత కూడా చైనా అభిప్రాయంలో మార్పు రాలేదు. 

తటస్థ వైఖరి కోసం తాపత్రయం

అమెరికా శిబిర అనుయాయిగా మారకుండా భారత్ ను నిరోధించడం చైనా లక్ష్యం. అలాగే, చైనాకు ఆందోళన కలిగించగల ముఖ్యమైన అంశాలపై భారత్ తటస్థంగా వ్యవహరించేటట్లు చూసుకోవడం దాని ఆశయం. ఆసియాలోని దేశాల మధ్య సంఘీభావాన్ని పెంపొందించేందుకు వర్థమాన ప్రపంచంలో భారతదేశానికున్న స్థాయిని, పలుకుబడిని ఉపయోగించుకుని ఆసియాలోకి అమెరికా ప్రాభవం మరింత చొచ్చుకుపోకుండా నిరోధించడం దాని వ్యూహం. అమెరికా తనను కట్టడి చేయడానికి లేకుండా ఇరుగు పొరుగు దేశాలు తటస్థంగా వ్యవహరించేటట్లు చూసుకోవడం చైనా మరో ఆశయం. భారత ప్రతినిధి బృందం ఒకటి1982 అక్టోబర్ లో కలిసినపుడు భారత్, -చైనాలు ఒకదానికొకటి ముప్పు కావని, రెండింటి మధ్యనున్న సమస్యలు కూడా తీవ్రమైనవి కావని చైనా అగ్ర నేత డెంగ్ జియావో పింగ్ చెప్పారు.  సోవియట్ యూనియన్ నుంచి ముప్పు గరిష్ట స్థాయిలో ఉన్నపుడు  చైనా నుంచి అటువంటి సయోధ్యపూర్వక వ్యాఖ్యలు వెలువడ్డాయి. చైనా1979 నుంచి1984 మధ్యకాలంలో సోవియట్ యూనియన్ నుంచి భారత్ ను దూరం చేసే వ్యూహానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలను ఒక త్రికోణంగా భావించి వాటి మధ్య అధికార సమీకరణల ఆధారంగా భారత్ పట్ల తన వైఖరిని నిర్ణయించుకుంటూ రావడం చైనాకు రివాజు.  అమెరికా, రష్యాల్లో భారత్  దేనికి దగ్గరైనా చైనాకు కంటగింపే. రష్యాతో తనకున్న సరిహద్దు వివాదాన్ని ఢిల్లీ, వాషింగ్టన్ లు తమకు అనువుగా ఉపయోగించుకుంటాయేమోనని చైనా1969లో  ఆందోళన చెందింది. మావో 1970లో భారత్ కు స్నేహ హస్తం చాచడాన్ని ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాలి. రష్యా నుంచి తన జాతీయ భద్రతకు ముప్పు ఉందని తలవడం వల్ల మనం రష్యా వైపు మొగ్గకుండా మైత్రి సంకేతాన్ని పంపిందన్నమాట. 

ఒప్పించే ధోరణి లేదా ఒత్తిడి

చైనా, రష్యా, అమెరికాల మధ్య సమతూకంలో ప్రతికూల ప్రభావం పొడసూపినప్పుడల్లా చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఒప్పించే ధోరణిని ప్రదర్శించడం లేదా అతిక్రమణల వంటి ఒత్తిడులకు దిగడం చైనాకు పరిపాటిగా మారింది. మామూలు పరిస్థితుల్లో భారత్ పట్ల పూర్తి ఉపేక్షను ప్రదర్శిస్తుంది. కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు, ఆ వివాదంలో ఐక్యరాజ్య సమితి పాత్రకు సంబంధించి తన ప్రాథమిక వైఖరిని మార్చుకునేందుకు చైనా ఎన్నడూ సుముఖంగా లేదు. సిక్కింపై భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించడానికి చైనా ఇప్పటికీ తిరస్కరిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత స్థానం లభించకుండా అడ్డంపడుతోంది. ఒకప్పుడు భద్రతా మండలిలో చైనాకు స్థానం కల్పించాలని పోరాడింది మనమే. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పాకిస్తాన్ మన నుంచి ఆక్రమించుకున్న కశ్మీర్ లో కొంత భాగాన్ని చైనాకు ధారాదత్తం చేసింది. భారత్ అధికారికంగా అమెరికాకు మిత్రపక్షంగా మారదని చైనాకు ఓ నమ్మకం. భారత్, -చైనా వివాదంలో అమెరికా నేరుగా తలదూర్చదని, ఒకవేళ జోక్యం చేసుకుంటే అది అమెరికాకు మోయలేని భారంగా పరిణమిస్తుందని చైనా అభిప్రాయం.  భారత్ ఏ అగ్ర రాజ్యానికీ సామంత దేశంగా మారదని, ఏనాటి నుంచో అది స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరిస్తూ వస్తోందని కూడా  చైనా నిశ్చితాభిప్రాయం.

మారిన భారత్ వైఖరి

చైనాను ఒక భాగస్వామిగా చూడాలా లేక శత్రు దేశంగా చూడాలా అనే విషయంలో గతంలో భారత్ కు ఉన్న అస్పష్టత ఇప్పుడు తొలగిపోయింది.  చైనా వ్యవహార శైలి శత్రువులా ఉందని ఒక సామాన్య అభిప్రాయం భారతీయుల్లో ఏర్పడింది. దానికి సంశయ లాభం ఇచ్చేందుకు చాలా కొద్ది మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. గాల్వన్ ఘటన చైనా పట్ల భారతీయుల అభిప్రాయాన్ని మార్చివేసింది. వివిధ సమాచార సాధనాలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణల్లో ఇది వ్యక్తమైంది. భారత్ సైన్యం 2022 ఆగస్టులో  స్నో లెపర్డ్ పేరిట రిజాంగ్ లా/రిచిన్ లలో నిర్వహించిన కౌంటర్- ఆపరేషన్ భారత్ వ్యూహాత్మక సంయమన వైఖరిలోనూ మార్పు వచ్చిందని సూచించింది. కేంద్ర నాయకుల్లో పెరిగిన తెగువను వెల్లడించింది. ఇది చైనా ఊహించనిది. వాస్తవాధీన రేఖ వెంబడి తాము తక్కువ స్థాయిలో కవ్వింపులకు దిగితే భారత్ మునుపటిలా చూస్తూ ఊరుకుంటుందని చైనా అనుకుంటే పొరపాటు. భారతదేశపు ప్రస్తుత సామర్థ్యాలను బట్టి దాని భవిష్యత్ స్పందనలను కూడా అంచనా వేయడం తప్పు అవుతుంది. చైనాకు బుద్ధి చెప్పడానికి భారత్ కేవలం అమెరికా పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. హిందూ మహా సముద్రంలో ఉన్న భౌగోళిక వ్యూహాత్మక ప్రాంతాన్ని భారత్ వినియోగించుకోగలదు. మిగిలిన చిన్న చితక దేశాల సాయంతో అది చైనాను చికాకుపరచగలదు. వాస్తవాధీన రేఖ పొడవునా మాత్రమే కాక ఇండో -పసిఫిక్ ప్రాంతంలోనూ మనం చైనా ఆశలకు గండికొట్టగల స్థితిలో ఉన్నాం. తన దిగుమతులు భారత్ కు ఎంతో అవసరమని, అది తన దిగుమతులపై ఆధారపడడం తగ్గదని చైనా ధీమా.  కాబట్టి భారత్ గట్టిగా ఎదురు తిరగలేదని చైనా భావన. భారతదేశ ఆర్థిక వృద్ధి తమ దేశపు వృద్ధి రేటుకన్నా మందగతిన కొనసాగుతుందని చైనా అపోహపడుతోంది. కానీ, అది మితిమీరిన ఆత్మవిశ్వాసం కిందకు వస్తుంది. చైనా కన్నా అధిక వృద్ధి రేటును భారత్ కొనసాగించగలదని వివిధ అంశాలు సూచిస్తున్నాయి. వాణిజ్యపరంగా చైనాను దూరంపెట్టే విధానాన్ని ప్రభుత్వం చేపడితే చైనా అంచనాలు తలకిందులవుతాయి. ప్రపంచపు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా స్థానాన్ని తాను ఆక్రమించాలని కోరుకుంటున్న చైనాకు ఇండియా మార్కెట్ అవసరం ఎంతో ఉంది. భారతదేశం 2008 నుంచి క్వాడ్ తో సహా వివిధ దేశాలతో స్నేహపూర్వకంగా మెలగుతూ తగిన సన్నాహాలు చేసుకుంటూ వస్తోంది. అది చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అభివర్ణించినట్లుగా ‘సముద్రపు నురగ’ ఏమీ కాదు.

కిం కర్తవ్యం?

చైనాలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు. అక్కడ కమ్యూనిస్టు పార్టీపైన, ప్రభుత్వం పైన షీ జిన్ పింగ్ పట్టు కొనసాగుతోంది. పార్టీ-రాజ్య వ్యవస్థ మిళితమైపోయి ఉన్నాయి. తనను తాను ఒక అగ్రరాజ్యంగా సంభావించుకుంటున్న చైనాకు ఇండియా శాంతి కాముకత పట్ల ఎందుకనో అపనమ్మకాలున్నాయి. కాబట్టి చైనా వ్యూహాత్మక పోటీని కొనసాగిస్తుందని మనం గుర్తెరగాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయిలకు చేరినపుడు బల సమీకరణలు మారతాయి. దౌత్య నీతిని కూడా బహుముఖంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. సైనిక, సాంకేతిక విజ్ఞాన సామర్థ్యాలను భారత్ ఎంతో పెంచుకోవాల్సి ఉంది. రానున్న ఏండ్లలో చైనా నుంచి మరిన్ని గడబిడలు ఉంటాయి. ఈ సవాళ్లను జాగ్రత్తగా ఎదుర్కొంటూ భారత్ ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సరిహద్దు సమస్యల పట్ల చైనా అర్థవంతంగా వ్యవహరిస్తే తప్పించి సయోధ్య సాధ్యం కాదని భారత్  తేటతెల్లం చేయాలి. స్థిరమైన వైఖరిని కొనసాగించాలి. సరిహద్దులో సైన్యాన్ని మోహరించడంతోనే  సరిపెట్టుకోకూడదు. దౌత్య, సైనిక, ఆర్థికపరమైన సాధనాలను ఆలంబనగా చేసుకుని సమన్వయంతో భారత్ ముందడుగు వేయాలి. రెండు దేశాల మధ్య 2019 నవంబర్ నుంచి నిలిచిపోయిన రాజకీయ చర్చలను వీలైనంత త్వరగా పునః ప్రారంభించాలి.

పరిష్కార ప్రతిపాదన

మావో తదనంతరం అధికారానికి వచ్చిన చౌ కూడా 1976లో మరణించిన తర్వాత సరిహద్దు సమస్య పరిష్కారానికి డెంగ్ జియావోపింగ్  ఒక “గుంపుగుత్త  ఒప్పందాన్ని” ప్రతిపాదించారు. తూర్పు రంగంలో చైనా రాజీపడుతుందని, మిగిలినవాటిలో భారత్ రాజీకి రావాలని అప్పటి భారత విదేశాంగ మంత్రి అటల్ బిహారి వాజ్ పేయికి జియావోపింగ్ సూచించారు. తూర్పు రంగంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే పశ్చిమ రంగంలో క్లైములను పూర్తిగా వదులుకోవడం లేదని అప్పటి చైనా విదేశాంగ మంత్రి హువాంగ్ హువా పేర్కొన్నారు. దాంతో ఆ ప్రతిపాదన ఫలించలేదు. రష్యా నుంచి చైనాకు ఉన్న ముప్పు1980ల మధ్యనాటికి బాగా తగ్గిపోయింది. భారత్ పట్ల చైనా విధానాన్ని రష్యా, చైనా, అమెరికాల మధ్య బల సమీకరణలు ప్రభావితం చేయడంలో మాత్రం మార్పు రాలేదు. 

పాకిస్తాన్​కు వత్తాసు

దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు చైనా వ్యూహాత్మక మిత్రదేశంగా పాకిస్తాన్ ను దువ్వడం కొనసాగించింది. చైనా1963లో ప్రారంభించిన ఆ విధానం నేటికీ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమానికి చైనా పూర్తి చేయూతనందించింది. ఒంటరిగా మన నుంచి ఎలాంటి ముప్పు లేదని, అమెరికా లేదా రష్యా పంచన చేరితేనే భారత్ బలం పెరుగుతుందని చైనా నిశ్చితాభిప్రాయం. ఇండియాకు అమెరికా వత్తాసు పలుకుతుందని భయపడినప్పుడల్లా చైనా నాయకులు ‘ఏషియన్ సెంచరీ’ గురించి మాట్లాడుతుంటారు. సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం కన్నా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతల ఏర్పాటుకు తగిన కట్టుబాటుకు వస్తే చాలుననే ధోరణిని చైనా ప్రదర్శిస్తున్నది. ఇరు దేశాల 1993 నాటి సరిహద్దు శాంతి, ప్రశాంతత ఒప్పందం, 1996 నాటి విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యల ఒప్పందం అలాంటివే. ఒకపక్క చైనా భూభాగాలపై క్లైమును పూర్తిగా పరిరక్షించుకుంటోంది.  మరోపక్క  తన వ్యతిరేక శిబిరంలో భారత్ చేరగల నష్ట ప్రమాదాన్ని చైనా తగ్గించుకుంటోంది.

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్