సాయుధ పోరాటం పల్లె పల్లెను కదిలించింది

సాయుధ పోరాటం పల్లె పల్లెను కదిలించింది

దాదాపు 250 ఏండ్లు నిజాం పాలన సాగింది. సహజంగా పాలకులకు నిరంకుశత్వం, దోపిడీ విధానం అనివార్యంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకులకు ఇన్​కమ్ ​కావాలంటే అభివృద్ధి తప్పనిసరి. అందుకే నిజాం సాగర్‌‌ను నిర్మించారు. దానితో పంటలు పండుతాయి. ప్రజల వద్ద పంటలుంటేనే కదా..  నిర్బంధంగా వసూలు చేసుకునేది. గోల్కొండ, పురాతన భవనాల, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి వందేండ్ల క్రితమే నిజాం పాలనలోనే జరిగాయి. ప్రస్తుత హైకోర్టు, సెక్రటేరియెట్​ నిజాం కాలంలో నిర్మించారు.

మొట్టమొదటి భూ పోరాట యోధుడు బందగీ

రాష్ట్రంలో మొట్టమొదటి భూపోరాట యోధుడు బందగీ. తన కున్న కొద్దిపాటి భూమిని విసునూరు దేశ్​ముఖ్​అనుచరుడు అక్రమించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బందగీ కోర్టుకెళ్లి గెలిచాడు. దీన్ని ఓర్వలేని విసునూరు దేశముఖ్..1940 జులై 27న బందగీని హత్య చేయించాడు. అప్పట్లో దేశ్​ముఖ్​అరాచకం అలా సాగింది.

పల్లెపల్లెనా సాయుధ పోరాటం

బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం మాత్రం తన పాలనా పరిధిని స్వతంత్ర దేశంగా పరిగణించాలని పట్టుబట్టడంతోపాటు జాతీయ జెండాను కూడా ఎగరనివ్వలేదు. చివరికి మోహినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది. గ్రామాల విముక్తి కోసం ప్రజలు తిరగబడ్డారు. పాలన పరిధిలో పోరాటాలతోపాటు కేంద్రం సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు పూనుకోవడంతో ఏడో  నిజాం లొంగిపోయారు. ఆ నాడు ఎందుకోసం అభివృద్ధి జరిగిందో తెలియని కొందరు.. బ్రిటిష్ పాలనే బాగుందని, నిజాం పాలన అద్భుతమని అంటుంటారు. అంతెందుకు సీఎం కేసీఆర్​ కూడా నిజాంను పొగుడుతున్నారు.

సైన్యం జోక్యం  తర్వాతా సాయుధ పోరాటం..

నిజాంకు ఊడిగం చేసే దేశ్​ముఖ్​లదే గ్రామాల్లో పెత్తనమంతా. ప్రజలను పీడించి, సంపద దోచుకుని నిజాంకు సమర్పించేవాళ్లు. వాళ్ల అండతో జనాన్ని బానిసలుగా చేసుకునేవాళ్లు. ఆకలే ప్రజల్ని తిరుగుబాటుకు ఉసిగొల్పింది. ప్రజల తరఫున పోరాడిన మొదటి విప్లవవీరుడు దొడ్డి కొమురయ్య. కానీ ఆయన కూడా నిజాం ప్రైవేట్ సైన్యం చేతిలో బలయ్యాడు. అయితే సర్దార్ వల్లబాయ్ పటేల్ కారణంగా నిజాం లొంగిపోయాడనే వాదన ఉంది. నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం జరగకపోతే నిజాం లొంగేవాడా? అయితే రావి నారాయణ రెడ్డి మాటల్లో చెప్పాలంటే.. భారత సైన్యం జోక్యం చేసుకున్న తరువాత సాయుధ పోరాటం ఆపాల్సివుంది. ఆ పని జరగలేదు. దాని వల్ల నష్టం జరిగిన మాట వాస్తవం. దానిపై వామపక్ష పార్టీల్లో విభేదాలున్నాయి. ఇంకా కూడా ఆ విధానం కొనసాగాలనే వాదన ఉంది. భారత సైన్యం జోక్యం చేసుకున్నా కూడా సాయుధ పోరాటం ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందంటే దానికి కూడా బలమైన వాదన ఉంది. నిజాం వ్యతిరేక పోరాటం సందర్భంగా నిజాం దేశ్ ముఖ్​లంతా గ్రామాలొదిలి హైదరాబాద్​ చేరుకున్నారు. సైన్యం జోక్యం తర్వాత  కుచ్చి టోపిలు, శేర్వాణిలు మార్చేసి ఖద్దరు టోపి, ఖద్దరు డ్రస్సులతో మరల ఊళ్లలో ప్రత్యక్షమై పేదలకు పంచిన భూములన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. పేదలకు ఇచ్చిన భూములను కాపాడుకునేందుకు అనివార్యంగా సాయుధ పోరాటం సాగించాల్సివచ్చింది.

ఖాసీం రజ్వీ నాటిన విషపు విత్తనమే ఎంఐఎం

నిజాం నిరంకుశ పాలనలో సైన్యాధిపతిగా ఉన్న ఖాసీం రజ్వీ పోతూపోతూ ఎంఐఎం పేరుతో ముస్లిం లీగ్ ను రాజకీయ పార్టీగా నిర్మించి పోయాడు. ఆ విషపు విత్తనమే నేటి ఎంఐఎం పార్టీగా ఆవిర్భవించి పాతబస్తీని నిరంకుశంగా ఏలుతున్నది. ఎవరు ముఖ్యమంత్రి అయిన ఓటు బ్యాంకు అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆడిస్తున్నది. వారి భయంతో ఏ ముఖ్యమంత్రి అధికార పూర్వక ఉత్సవాలను నిర్వహించడానికి ముందుకు రాలేదు.

ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నరు

కేసీఆర్ పాలనలో దోపిడీదారులని కాళోజీ మాటలో చెప్పాలంటే “ప్రాంతీయేతరులు దోపిడీ చేస్తే పొలిమేర కావల తన్ని తరుముతాం. ప్రాంతం వాళ్లే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర పెడుతాం”. కాళోజీ బతికుంటే కాళోజీ కలమే కేసీఆర్ గుండెల్లో గునపం అవ్వదా?. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిస్తామన్న వాగ్దానం అటకెక్కినట్లే కదా. ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు 1500 మంది ఆత్మబలిదానంతో కదా తెలంగాణ సాధించింది. ఉస్మానియా స్టూడెంట్ల విరోచిత పోరాటమే కదా ఖమ్మంలో కేసీఆర్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడనీయకుండా ఉద్యమానికి ఊపిరి పోసింది. మరి అలాంటి ఉస్మానియా యూనివర్శిటీకి ముఖ్యమంత్రి స్థాయిలో అడుగుపెట్టగలుగుతున్నారా? వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి భవనాలు, చారిత్రక కట్టడాలు కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించాల్సిన తరుణమా ఇది. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. చివరికి ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ద్వారాలు తెరిచారు. అందులో రిజర్వేషన్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ లేవు. ఫీజులను నియంత్రించే శక్తి ప్రభుత్వానికి లేదు. మరి వారికి భూములు మాత్రం కారుచౌకగా కేటాయిస్తారు. ఇదా తెలంగాణ సాధనలో సాధించింది. ఏ ప్రజాస్వామ్య విధానాలను ఉపయోగించుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ‘‘పాము పిల్లల్ని పెట్టి తినేసినట్లు’’ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థనే ధ్వంసం చేస్తున్నారు. నిజాం వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి నాలుగున్నర వేల మంది పోగట్టుకున్నది ఇలాంటి పాలనకా? 1,500 యువకుల బలిదానం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇలాంటి పరిపాలనకా? ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు పాటుపడింది ఇలాంటి సంప్రదాయాలకా? ముమ్మాటికీ కాదు.

కేసీఆర్ది అవకాశవాదం

ఉద్యమ సందర్భంలో కేసీఆర్.. ‘నేను అధికారంలోకి వస్తే సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపిస్తా’నని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా నిజాంను పొగుడుతున్నారంటే ఇంతకంటే అవకాశవాదం ఉందా? మనల్ని మనమే పాలించుకోవాలి, ఆంధ్ర నాయకత్వాన్ని పారద్రోలాలన్న కేసీఆర్ కేబినెట్​లో తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించిన వాళ్లే ఉన్నారు. పంచేందుకు భూములే లేవని అసెంబ్లీలోనే కుండబద్దలు కొట్టిన కేసీఆర్.. ఏ భూమి కోసమైతే సాయుధ పోరాటాలు సాగాయో ఆ ప్రాంతంలోనే సమగ్ర భూ సర్వే చేసి మిగులు భూములు, భూదానోద్యమ భూములు, ప్రభుత్వ బంజరు, దేవాదాయ భూములు, వక్ఫ్​ భూములు రాజకీయ పలుకుబడి కలిగినవారంతా ఆక్రమించుకున్నారు.

డాక్టర్ కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి