
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. అమాయకుల ప్రాణాలు తీస్తో్న్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాక్‌తో పూర్తిగా దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకున్న భారత్.. ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థిక దెబ్బ తీసేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే పీకల్లోతూ ఆర్థిక కష్టాలతో కొట్టామిట్టాడుతోన్న దాయాది దేశాన్ని మరింత అణగదొక్కేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగానే నిర్మలా సీతారామన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) అధ్యక్షుడు మసాటో కందాను కలిసి పాకిస్తాన్‌కు నిధులను తగ్గించాలని డిమాండ్ చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్ ఉగ్రవాద నిధులకు మద్దతు ఇస్తోందని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అలాగే.. ఇటాలియన్ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టిని కూడా కలిసిన నిర్మలమ్మ.. పాక్‌కు విదేశీ నిధులు ఇవ్వొద్దని కోరినట్లు తెలిసింది.
ALSO READ | భారత రక్షణ వెబ్‌సైట్లపై పాక్ సైబర్ అటాక్..సెన్సిటివ్ సమాచారం చోరీకి యత్నం
వీటితో పాటు.. పాకిస్తాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీపై కూడా భారత్ ఆందోళన లేవనెత్తనున్నట్లు టాక్. పాకిస్తాన్‌ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే.. ఇప్పుటికే ఆర్థిక కష్టాలతో అతలాకూతలం అవుతోన్న పాక్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక రంగాన్ని మరింత దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. పరోక్షంగా దాడికి కారణమైన పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లో తిరిగి చేర్చాలని, ఇస్లామాబాద్‌కు అంతర్జాతీయ నిధులను తగ్గించాలని కోరుతూ యూరోపియన్ దేశాలతో కూడా భారతదేశం చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక చేయూత అందిస్తోన్న పాక్‌కు నిధులు కేటాయించవద్దని న్యూఢిల్లీ తమ వాదన వినిపిస్తోంది.
ఏడీబీ, ఐఎంఎఫ్ సాయం:
ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ఏర్పాటైందే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ). 1966లో ఫిలిప్పీన్స్ లో ఈ బ్యాంక్ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంది. జపాన్ సారథ్యంలో ఏడీబీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ ఐఎంఎఫ్‌తో పాటు ఏడీబీ నుంచి వచ్చే నిధులపై ఎక్కువగా ఆధారపడుతుంది. పహల్గాం ఉగ్రదాడితో పాక్‌పై గుర్రుగా ఉన్న భారత్.. ఐఎంఎఫ్, ఏడీబీ నిధులు ఆపి పాక్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని చూస్తోంది. భారత చర్యలు పాక్‌కు భారీ ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.