ముప్పు తెచ్చిన మూడు లక్షలు

ముప్పు తెచ్చిన మూడు లక్షలు
  • ముప్పు తెచ్చిన మూడు లక్షలు
  • ప్రతిపక్షాలకు అస్త్రంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
  • దళితబంధు, డబుల్ బెడ్రూంలో కరప్షన్
  • పత్రికల్లో కథనాలే ఆయుధంగా పోరాటం
  • ఏసీబీ, ఈడీ, డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలు బీజేపీకి అస్త్రంగా మారాయి. దళితబంధు పథకం అమలులో అవినీతి జరుగుతోందని, ఎమ్మెల్యేలు, అనుచరులు ఒక్కో లబ్ధిదారు నుంచి మూడేసి లక్షలు వసూలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తామన్న కేసీఆర్.. ఎమ్మెల్యేల అవినీతిని స్వయంగా ఒప్పుకొన్నారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

పథకంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఏసీబీకి లేఖ రాశారు. డీజీపీకి, ఈడీకి ఫిర్యాదు చేశారు. అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్వయంగా ముఖ్యమంత్రే అవినీతిని ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. రూ.10 లక్షల సాయం అందించే ఈ పథకంలో రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరులోనూ అవినీతి జరుగుతోందని తెలిపారు. 

రూ.వేల కోట్ల ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఈ పథకాలపై విచారణ జరిపించి.. బాధ్యుతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేల జాబితా తన వద్ద ఉందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని, సీఎం నుంచి జాబితా తీసుకుని విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదులో కోరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడుతున్నారని సీఎం స్వయంగా చెప్పారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు.