టీమిండియాకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ..!

టీమిండియాకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ..!

ఆసియాకప్ టోర్నీకి సర్వం సిద్దమైంది. ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 6 జట్లు పాల్గొంటాయి. శ్రీలంక, బంగ్లాదేశ్,  భారత్, పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా.. 6వ జట్టు  క్వాలిఫయర్ రౌండ్లో గెలిచి అర్హత సాధించాలి. ఇక క్వాలిఫయర్ రౌండ్‌లో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు పోటీపడతాయి. ఇందులో  టాప్ లో నిలిచిన జట్టు  6వ టీంగా ఆసియాకప్ లో పాల్గొంటుంది. క్వాలిఫయర్ రౌండ్ మ్యాచ్‌లు ఆగస్టు 20- 26 మధ్య నిర్వహిస్తారు. 

టోర్నీ ఫార్మాట్..
ఆసియా కప్ లో పాల్గొనే ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో  పాకిస్థాన్, భారత్ తో పాటు క్వాలిఫయర్ జట్టు ఉంటాయి. అటు  గ్రూప్ -Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. రెండు గ్రూపుల్లో టాప్ రెడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ ఫోర్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.  సూపర్ 4లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఆసియాకప్ ఫైనల్‌కు వెళ్తాయి. ఫైనల్లో గెలిచిన జట్టు  టైటిల్ ను దక్కించుకుంది. 

భారత్, పాక్ జట్లు.
ఆసియాకప్ కోసం ఇప్పటి వరకు భారత్, పాక్ మాత్రమే తమ జట్లను ప్రకటించాయి. టీమిండియాను  రోహిత్ శర్మ నడిపించనుండగా... పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ ఎంపికయ్యాడు. 

ఆసియా కప్ కోసం భారత జట్టు:  రోహిత్ శర్మ ( కెప్టెన్ ), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా,  సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.
స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.

ఆసియా కప్ కోసం పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజం (కెప్టెన్), ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ,  హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షానవాజ్ దహానీ ఖదీర్.

ఫేవరెట్ భారత్..
ఆసియాకప్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గతంలో ఈ టోర్నీలో ఏడు సార్లు భారతే విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి టీమిండియానే ఫేవరెట్ గా ఆడబోతుంది. ఇక ఆసియాకప్ గెలిచే అవకాశాలు భారత్ కే ఎక్కువగా ఉన్నాయని ఓ క్రికెట్ సైట్ వెల్లడించింది. భారత్ 42శాతం, పాకిస్థాన్ 34, శ్రీలంక 12, బంగ్లాదేశ్ 6, ఆఫ్ఘనిస్థాన్ 4, యూఏఈ 2 శాతం విజయవకాశాలున్నాయని పేర్కొంది.