ఆ సంస్థపై నిషేధం పొడిగింపు ముమ్మాటికీ సరైనదే: కేంద్రం

ఆ సంస్థపై నిషేధం పొడిగింపు ముమ్మాటికీ సరైనదే: కేంద్రం

న్యూఢిల్లీ: ఇండియాలో ఇస్లామిక్​ పాలనను తీసుకురావాలనే స్టూడెంట్​ఇస్లామిక్​ మూవ్​మెంట్​ ఆఫ్ ఇండియా(సిమి) కలలను నెరవేరనివ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత లౌకిక సమాజంలో అటువంటి సంస్థలు వేళ్లూనుకునే పరిస్థితులు లేకుండా చేస్తామని తేల్చి చెప్పింది. అది చట్ట వ్యతిరేక విద్యార్థి సంఘమని.. యూఏపీఏ చట్టం కింద మరో ఐదేళ్లపాటు దానిపై  నిషేధాన్ని పొడిగిస్తూ 2019లో ఆదేశాలు జారీకావడం ముమ్మాటికీ సబబేనని పేర్కొంది. ఈ ఆదేశాలను సవాల్​ చేస్తూ సిమి మాజీ సభ్యుడు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దానిపై స్పందించిన కేంద్రం బుధవారం కౌంటర్​ అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​నేతృత్వంలోని బెంచ్​విచారించింది. సిమిపై నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. అయితే, కేంద్రం కౌంటర్​అఫిడవిట్​పై రీజాయిండర్​ దాఖలు చేసుకునేందుకు సమయం కావాలని పిటిషనర్​ తరపు న్యాయవాది కోరారు. దీంతో ఈ పిటిషన్​పై విచారణను వచ్చే నెలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సిమీకి 3 డజన్ల సంస్థల సహకారం 

‘‘2001 సెప్టెంబరు 27న సిమిపై నిషేధం అమల్లోకి వచ్చింది. కొంతకాలం పాటు ఆ సంస్థ సభ్యులు స్తబ్దుగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో మూడు డజన్లకుపైగా సంస్థలను ఏర్పాటుచేసుకొని కార్యకలాపాలను ప్రారంభించారు. విరాళాల సేకరణ, సాహిత్య వ్యాప్తి, క్యాడర్​ బలోపేతంకోసం ఆ మూడు డజన్ల సంస్థలు సిమికి సహకరిస్తున్నాయి. అందుకే సిమిపై బ్యాన్​ ను మరో ఐదేళ్లు పొడిగిస్తూ 2019లో యూఏపీఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది” అని సుప్రీంకోర్టుకు సమర్పించిన కౌంటర్​ అఫిడవిట్​లో కేంద్రం తెలిపింది.