ఏలేటి ధిక్కార స్వరం

ఏలేటి ధిక్కార స్వరం

నిర్మల్​లో అగ్ర నేతలను టార్గెట్ చేస్తున్న మహేశ్వర్ రెడ్డి

మొన్న రేవంత్.. ఇప్పుడు ఠాక్రే.. 

అంతుపట్టని ఆయన అంతరంగం 

ఉమ్మడి జిల్లాలో భట్టి పాదయాత్రకు దూరం

నిర్మల్, వెలుగు : నిర్మల్​ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా  సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీలోని ఒకరిద్దరు అగ్ర నేతలను టార్గెట్ చేసుకొని మాట్లాడుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదట ఆయన పర్యటనను నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు పోరుయాత్ర పేరిట పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి​మొట్టమొదట నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో మహేశ్వర్ రెడ్డి ముందు నిలిచారు. అయితే కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పటినుంచి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శలు మొదలుపెట్టారు. అలాగే పార్టీ హైకమాండ్​కు సైతం ఫిర్యాదులు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మాత్రం దూరంగా ఉంటున్నారు. 

పోటీ పాదయాత్ర

రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భైంసాలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోదండ రెడ్డిలాంటి రాష్ట్రస్థాయి నేతలంతా హాజరయ్యారు. భైంసా నుంచి నిర్మల్ వరకు పాదయాత్ర చేపట్టిన మహేశ్వర్ రెడ్డి మామడ కార్యక్రమం తర్వాత నిలిపివేశారు. నిర్మల్ లో నిర్వహించిన పాదయాత్ర కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ ఠాక్రే, ఉత్తమ్​కుమార్ రెడ్డి తదితర సీనియర్ నేతలు హాజరై ప్రసంగించారు. మహేశ్వర్ రెడ్డి పాదయాత్రకు హాజరైన మాణిక్ ఠాక్రే ఆదేశాల  మేరకే ఆయన పాదయాత్ర నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనుకావడమే కాకుండా పాదయాత్ర నిలుపుదల విషయంలో మాణిక్ ఠాక్రే కు లెటర్​కూడా రాశారు. లెటర్​రాసిన విషయాన్ని మహేశ్వర్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల కారణంగా  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలతో మహేశ్వర్ రెడ్డి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలిస్తున్నారంటున్నారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. భట్టి విక్రమార్కతో సత్సంబంధాలు ఉన్నట్లుగా చెప్పుకుంటున్న మహేశ్వర్ రెడ్డి ఆయన పాదయాత్రలో పాల్గొనకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొదటి రోజే కాకుండా రెండో రోజు కూడా భట్టి విక్రమార్క పాదయాత్రకు మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేశ్వర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడితోపాటు మరికొంతమంది సీనియర్ నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ పరిణామాలన్నీ వెల్లడిస్తున్నాయంటున్నారు.

ఏం చేయాలనుకుంటున్నరు?

కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో విభేదిస్తూ గాంధీభవన్ ను కేంద్రంగా చేసుకొని ఘాటుగా విమర్శలు చేస్తున్న మహేశ్వర్ రెడ్డి మరికొందరు సీనియర్ నేతలతో కలిసి ప్రత్యేక  రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన అవసరమైతే హైకమాండ్​తో తాడోపేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటున్నారు. కొద్ది నెలల క్రితం ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఢిల్లీలో  కలిసినట్లు ప్రచారం జరిగింది. దీంతో పార్టీలో కలకలం కూడా రేగింది. అయితే ఈ ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి స్వయంగా ఖండించారు. అయితే ఆయన పార్టీ నేతలతో అనుసరిస్తున్న విధానం, వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గట్టి పట్టున్న మహేశ్వర్ రెడ్డి కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో  తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా హైకమాండ్​ గుర్తించడం లేదనే ఆగ్రహంతో ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా పార్టీ ప్రయోజనాల కోసమే రేవంత్​వర్గాన్ని  మహేశ్వర్​రెడ్డి ఖాతరు చేయట్లేదనే వార్తలు వస్తున్నాయి.  ఉత్తమ్​ వర్గానికి దగ్గరవడం ఇందులో భాగమేనని అంటున్నారు. కానీ భట్టి పాదయాత్రలో కూడా  లేకపోవడం ఇప్పుడు హాట్​టాపిక్​లా  మారింది.

నేతలతో విభేదాలు

మొదటి నుంచి రేవంత్ రెడ్డితో విభేదిస్తున్న మహేశ్వర్ రెడ్డి పీసీసీ మాజీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆయన టీం మెంబర్ గా కొనసాగుతున్నారు. మహేశ్వర్ రెడ్డికి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పదవి దక్కడం వెనుక ఉత్తమ్​కుమార్ రెడ్డి పాత్ర ఉందని చెబుతున్నారు. మొదట రేవంత్ రెడ్డికి ప్రాధాన్యతనిచ్చిన మహేశ్వర్ రెడ్డి ఆయన దూకుడు స్వభావాన్ని జీర్ణించుకోలేక విభేదిస్తూ వచ్చారంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు వర్గంతో కూడా ఆయనకు విభేదాలున్నాయి. ప్రేమ్ సాగర్ రావుకు రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తుండడం ఏడా ఏలేటి అసంతృప్తికి కారణమని భావిస్తున్నారు.