దానిమ్మ రసంలో గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు మేలు చేసే యాంటీ-ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగడానికి ఒక ప్రత్యేకమైన సమయం అంటూ ఎం లేనప్పటికీ, కొన్ని పద్ధతుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి పూర్తి ప్రయోజనాలు అందుతాయి.
దానిమ్మ రసం తాగడానికి బెస్ట్ టైం ఏది?
గుండె ఆరోగ్యం కోసం దానిమ్మ రసాన్ని కచ్చితంగా ఫలానా సమయంలోనే తాగాలని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, ఈ సమయాల్లో తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి:
*దానిమ్మ రసంలో సహజంగానే చక్కెర ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ తాగే కంటే.. ప్రొటీన్లు, ఫైబర్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారంతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ నిదానంగా సాగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.
*వాకింగ్ లేదా వ్యాయామం చేయడానికి 30 నిమిషాల ముందు దానిమ్మ రసం తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఇది వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది.
*దానిమ్మ రసాన్ని రోజు తప్పకుండా లేదా వారానికి కొన్ని సార్లు తాగడం వల్ల గుండెకు ఎక్కువ మేలు జరుగుతుంది.
గుండెకు ఎలా సహాయపడుతుంది?
*దీనిలోని ‘పాలీఫెనాల్స్’ అనే సమ్మేళనాలు శరీరంలో వాపులను తగ్గించి, గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
*ఇది శరీరంలో ‘నైట్రిక్ ఆక్సైడ్’ శాతాన్ని పెంచుతుంది. ఇది రక్త నాళాలను ఫ్రీగా మార్చి, రక్తం సజావుగా ప్రవహించేలా చేస్తుంది.
* ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, చెడు కొవ్వులను (ట్రైగ్లిజరైడ్స్) తగ్గించడానికి సహాయపడుతుంది.
*దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అంటే బిపిని అదుపులో ఉంచుతుంది.
రోజుకు 120 నుండి 240 మిల్లీలీటర్లు అంటే సుమారు ఒక చిన్న గ్లాసు 100% స్వచ్ఛమైన దానిమ్మ రసం తాగడం మంచిది. వారానికి కొన్ని సార్లు కేవలం 100ml తాగినా కూడా గుండెకు మంచిదే. రసం కంటే నేరుగా దానిమ్మ గింజలను తినడం ఇంకా మంచిది, ఎందుకంటే గింజల ద్వారా శరీరానికి పీచుపదార్థం (ఫైబర్) అందుతుంది.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
* మీరు బిపి టాబ్లెట్స్, రక్తాన్ని పల్చబరిచే మందులు లేదా కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్ మందులు వాడుతుంటే, దానిమ్మ రసం తాగే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
*మధుమేహం ఉన్నవారు మార్కెట్లో దొరికే చక్కెర కలిపిన జ్యూస్‌లను అస్సలు తాగకూడదు. ఇంట్లో చేసిన 100% స్వచ్ఛమైన జ్యూస్‌ను కూడా తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి.
* బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనంతో పాటు ఒక చిన్న గ్లాసు జ్యూస్ తాగండి.
*సోడా నీటిలో కొద్దిగా దానిమ్మ రసం కలిపి హెల్తీ మాక్‌టైల్‌లా తీసుకోవచ్చు.
*స్మూతీలు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా దానిమ్మ రసం కలపండి.
*బజార్లో దొరికే ఆర్టిఫిషియల్ షుగర్ కలిపిన ప్యాకెట్ జ్యూస్‌లకు దూరంగా ఉండండి.
