బైక్ ను కారుతో ఢీకొట్టి పరార్.. బౌన్సర్ మృతి

బైక్ ను కారుతో ఢీకొట్టి పరార్.. బౌన్సర్ మృతి

 

 

  • మరొకరికి గాయాలు
  • జూబ్లీహిల్స్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు
  • కారు నడిపిన  వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: బైక్ ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోగా.. మరొకరు గాయపడ్డారు. ఈ హిట్ అండ్ రన్ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పరిధిలోని సిక్ విలేజ్ కు చెందిన లింగాల తారక్ రామ్(30) మాదాపూర్ లోని నోవాటెల్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు డ్యూటీ ముగించుకున్న తారక్ రామ్ తోటి బౌన్సర్ రాజుతో కలిసి బైక్ పై సికింద్రాబాద్ కు బయలుదేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 వద్ద పెద్దమ్మగుడి కమాన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు అతడి బైక్ ను ఢీకొట్టి వెళ్లింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు సైతం తీవ్రంగా గాయపడగా.. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ప్రమాదంలో చనిపోయిన తారక్​రామ్ కు భార్య, 7 నెలల బాబు ఉన్నాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పట్టుకుని శిక్షించాలంటూ బుధవారం ఉదయం తారక్ రామ్ కుటుంబసభ్యులు, బంధువులు జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. హిట్ అండ్ రన్ కేసు గురించి లుసుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్  జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చి ప్రమాదంపై ఆరా తీశారు. కారును గుర్తించేందుకు చుట్టుపక్కలున్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను ఆయన పరిశీలించారు.  వాటి ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

వేర్వేరు ప్రమాదాల్లో మరో ఇద్దరు..

దుండిగల్: కంటెయినర్ ఢీకొని మహిళ చనిపోయిన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన మాలతి(38) బుధవారం  గండిమైసమ్మ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆటో దిగి ఇంటికి వెళ్తోంది. మధ్యలో రోడ్డు దాటుతుండగా.. గాగిల్లాపూర్ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్ ఆమెను ఢీకొట్టింది. కంటెయినర్ డ్రైవర్ వెహికల్ ను వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాలతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా అన్నారానికి చెందిన శ్రీకాంత్(32) అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం దుండిగల్ తండాకు వెళ్తుండగా.. ఓ వెహికల్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.