పక్షులకు కేరాఫ్ ఈ ఇల్లు

పక్షులకు కేరాఫ్ ఈ ఇల్లు

జోసెఫ్​ శేఖర్.. చిలుక పలుకులు తెలిసినోడు ​. వాటి ఆకలి బాధల్ని క్షణంలో పసిగడతాడు. పరుగు పరుగున వెళ్లి వాటి ఆకలి తీరుస్తాడు. నీళ్లు తాగిస్తూ ప్రేమగా వాటి తల నిమురుతాడు.  ఒకటో రెండో కాదు ఏకంగా 8 వేల చిలుకల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అందుకే ‘బర్డ్ మ్యాన్​ ఆఫ్​ చెన్నై’ గా పేరు తెచ్చుకున్నాడు. ఇంత చేస్తున్నాడంటే పెద్ద ధనవంతుడే అనుకుంటే పొరపాటే.  ఆస్తిపాస్తుల కంటే ఎక్కువ  మంచి మనసున్నోడు జోసఫ్​. అందుకే తనకొచ్చే  కొద్ది సంపాదనలోనే చిలకల కోసం ఖర్చు చేస్తున్నాడు. తన సంపాదనలో 40 శాతాన్ని వాటి ఆకలి తీర్చడానికి వాడుతున్నాడు.

జోసెఫ్​​  శేఖర్​ ఉద్యోగం  కోసం  చాలా యేళ్ల క్రితం చెన్నైకి వలస వచ్చాడు. మొదట్లో చిన్నా చితకా పనులు చేశాడు.  తర్వాత  ఎలక్ట్రీషియన్​గా మారాడు. కెమెరాలు కూడా రిపేర్​ చేస్తుంటాడు. జోసెఫ్​​ ఫ్యామిలీ చిన్నప్పట్నించీ పక్షుల కోసం మేడ మీద కొన్ని గింజలు, నీళ్లు పెడుతుండేది. దాన్ని ఒక ట్రెడిషన్​గా ఫాలో అయ్యేవాళ్లు. ఆ ట్రెడిషన్​ని జోసెఫ్​​   కంటిన్యూ చేశాడు. చెన్నైలో తన ఇంటి మేడ మీద రెగ్యులర్​గా  నీళ్లు, కొంచెం అన్నం పెట్టడం మొదలుపెట్టాడు. అలా మొదలైన బర్డ్స్​ ఫీడింగ్ 15 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.

ఆలోచన మొదలైంది..

మొదట 2004 డిసెంబర్​ 27 న  ఐదారు చిలుకలు  తనుపెట్టిన ఫుడ్​ తినడం గమనించాడు జోసెఫ్​​. రానురాను వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వారం పదిరోజుల్లోనే చిలుకల సంఖ్య వెయ్యికి చేరింది. అవి హాయిగా కడుపు నింపుకుంటుంటే జోసెఫ్​​ మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్​. కోట్లు సంపాదించినా రాని సంతృప్తి వాటి ఆకలి తీర్చేటప్పుడు వచ్చింది. దాంతో బర్డ్​ ఫీడింగ్​ని కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం ఎనిమిది వేల చిలుకలు, వందలకొద్దీ  పావురాలు  ప్రతిరోజూ జోసెఫ్​​ మేడమీద కడుపారా తింటున్నాయి.

పొద్దుపొద్దునే

ప్రతిరోజూ ఉదయం నాలుగింటికి లేస్తాడు జోసెఫ్. అతిధుల కోసం ముందుగా బియ్యం నానబెట్టి మేడపైకి వెళ్తాడు. మేడని క్లీన్​ చేసి వరుసగా  వుడెన్​ ప్లాంక్స్​ పేర్చి వంటగదిలోకి వెళ్తాడు. అన్నం వండి, రకరకాల గింజల్ని చిలుకల కోసం రెడీ చేస్తాడు. ఆలోపు  వుడ్​  ప్లాంక్​లపై వరుసగా కూర్చుని  జోసెఫ్​​ని రమ్మని పిలుస్తుంటాయి పక్షులు. వాటి చప్పుడు చెవిన పడగానే వెళ్లి అన్నం, వాటికి నచ్చిన గింజల్ని  ప్లాంక్స్​ మధ్యలో పెడతాడు. అవి పక్కన ఉన్న  పక్షుల్ని  ఏమాత్రం డిస్టర్బ్​ చేయకుండా బుద్ధిగా కడుపునిండా తిని, నీళ్లు తాగుతాయి. అక్కడ్నించి జోసెఫ్​​ తన పనిలో పడతాడు. మధ్యమధ్యలో  పక్షుల్ని పలకరిస్తాడు.  మళ్లీ సాయంత్రానికి మరో బ్యాచ్​కి ఫుడ్​ ప్రిపేర్​  చేస్తాడు.

సాయం తీసుకోడు

పక్షుల కోసం రోజుకి 75 కిలోలు  రైస్​ వండుతున్నాడు జోసెఫ్​​. అలాగే తనింటికొచ్చే పక్షుల టేస్ట్​ని బట్టి వాటికి నచ్చిన గింజల్ని పెడుతున్నాడు. బర్డ్స్​ ఫీడింగ్ కోసం ఎవరిదగ్గరా డొనేషన్స్​ కానీ, హెల్ప్​ కానీ తీసుకోడు​. ఒకవేళ ఎవరైనా ఇవ్వాలనుకున్నా.. ‘‘పక్షులు నా పిల్లలు.. పిల్లల కడుపునింపడానికి ఒకరి దగ్గర చెయ్యి చాచలేను కదా’’ అని నవ్వుతూ రిజెక్ట్​ చేస్తాడు జోసెఫ్​.

విజిటింగ్ స్పాట్​

రంగురంగుల రామచిలుకలు, పావురాలు, పిచుకల్ని చూడ్డానికి జోసెఫ్​​ ఇంటికి క్యూ కడుతున్నారు చాలామంది. ఇతర దేశాలనుంచి వచ్చిన టూరిస్ట్​లు కూడా ఆ పక్షులని పలకరించిపోతుంటారు. దాంతో  చెన్నైలో మోస్ట్ విజిటింగ్​ ప్లేస్​లలో  ఒకటిగా నిలిచింది జోసెఫ్​​  ఇల్లు.  ఈ చెన్నై బర్డ్​మ్యాన్​ని  ఆదర్శంగా తీసుకుని ఈ వేసవిలో   ప్రతి ఇంట్లో  పక్షుల కోసం  కొన్ని నీళ్లు, ఇన్ని గింజలు పెడితే పక్షుల  ఆకలి కొంతైనా తీర్చిన వాళ్లమవుతాం.

ఇవి కూడా చదవండి 

పన్నెండేళ్ల  పిలగాడు.. చిరుతతో ఫైటింగ్

సైనికులకు ఇక సూపర్ పవర్

సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు

గిరిసీమలో సేంద్రియ విప్లవం