2024 ఎన్నికలే టార్గెట్‌‌గా మోడీ ఇంట్లో అగ్ర నేతల భేటీ

2024 ఎన్నికలే టార్గెట్‌‌గా మోడీ ఇంట్లో అగ్ర నేతల భేటీ
  • 2024 ఎన్నికలే టార్గెట్‌‌గా మోదీ ఇంట్లో..అగ్ర నేతల భేటీ
  • అమిత్ షా, నడ్డా, బీఎల్‌‌ సంతోష్‌‌, ఇతరులతో ప్రధాని చర్చలు 

న్యూఢిల్లీ : వచ్చే 2024 లోక్‌‌సభ ఎన్నికలే టార్గెట్‌‌గా బీజేపీ కీలక నేతలు బుధవారం రాత్రి ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌‌ సంతోష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్‌‌ మీటింగ్‌‌లో కేంద్ర కేబినెట్‌‌ పునర్వ్యవస్థీకరణ, పార్టీలో మార్పుల గురించి చర్చ జరగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ భేటీపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది.   

నియోజకవర్గాల్లో పర్యటించండి 

అటు కేంద్ర మంత్రివర్గంలోనూ, ఇటు పార్టీ సంస్థాగత విభాగాల్లోనూ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ ఈ మీటింగ్ జరిగింది. భేటీలో పాల్గొన్న మంత్రులకు ప్రధాని పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. సమాజంలో పేద, వెనుకబడిన వర్గాల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తుండాలని చెప్పారు. సమాజంలోని వెనుకబడిన, బలహీన వర్గాల ప్రతినిధులతో నియోజకవర్గాల్లో చిన్న స్థాయి సమావేశాలు, సెమినార్లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్లాన్లు సిద్ధం చేయాలని కూడా చెప్పినట్లు తెలిసింది. 

రీజియన్లవారీగా మీటింగ్స్ ఇలా.. 

జులై 6 : గువాహటిలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర నార్త్ఈస్ట్ రాష్ట్రాల నేతలతో సమావేశం.

జులై7 : ఢిల్లీలో జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, గుజరాత్, డామన్& డయ్యూ, మధ్యప్రదేశ్, చత్తీస్‌‌గఢ్,  ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా నేతలతో సమావేశం జరగనుంది. కాగా, హైదరాబాద్‌‌లో కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నేతలతో దక్షిణాది రాష్ట్రాల నేతలతో మీటింగ్ నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. 

నార్త్, సౌత్, ఈస్ట్‌‌.. రీజియన్లవారీగా ప్లాన్ లు  

లోక్‌‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా సీట్లు, రీజియన్లలో మైక్రో మేనేజ్‌‌మెంట్‌‌ కోసం బ్లూప్రింట్‌‌ తయారు చేయాలని పార్టీ నేతలకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. 543 లోక్‌‌సభ సీట్లను నార్త్, సౌత్, ఈస్ట్‌‌ అనే మూడు భాగాలుగా విభజించుకోవాలని సూచించారు. మరోవైపు పార్టీ ప్రెసిడెంట్‌‌ జేపీ నడ్డా.. జులై 6 నుంచి 8 దాకా ఆయా రీజియన్లలో టాప్‌‌ లీడర్లతో సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలతో మూడు రోజులు వరుస భేటీలు జరుపుతారు. వీటిలో రాష్ట్రాల ఇన్‌‌చార్జ్‌‌లు, ప్రెసిడెంట్లు, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్ట్రాటజీతో ముందుకు పోవాలని మంత్రులకు సూచించారు. తమ శాఖల్లో ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్‌‌ విధానాన్ని అనుసరించాలని, క్రియేటివిటీతో ఇంపాక్ట్ చూపించే ఐడియాలను రూపొందించాలని చెప్పారు. 

జులై 3న కేంద్ర కేబినెట్‌‌ భేటీ 

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌‌ జులై 3న సమావేశం కానుంది. కేబినెట్‌‌లో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌‌లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో ఈ మీటింగ్‌‌ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జులై మూడో వారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ఆ సమావేశాలకు ముందు కేబినెట్ లో మార్పులు చేర్పులు చేపట్టనున్నారని పేర్కొంటున్నాయి.