బడ్జెట్​ ఇంకా భయపెడుతోంది

బడ్జెట్​ ఇంకా భయపెడుతోంది

ముంబైకేంద్ర ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి దలాల్‌‌‌‌స్ట్రీట్‌‌‌‌ దిగాలుగానే ఉంది. ఆనాటి నుంచి శుక్రవారం వరకు సూచీలు రెండుశాతం నష్టపోయాయి. కేవలం ఐదు ట్రేడింగ్‌‌‌‌ సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.మూడు లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయారు. బాంబే స్టాక్‌‌‌‌ ఎక్సేంజ్‌‌‌‌ (బీఎస్ఈ)లో నమోదైన లిస్టెడ్‌‌‌‌ కంపెనీల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌ విలువ ఈ నెల ఐదో తేదీ వరకు రూ.151.35 లక్షల కోట్లు కాగా, 12వ తేదీన ఇది రూ.148.08 లక్షలకు తగ్గింది. అంటే తేడా రూ.3.27 లక్షల కోట్లు! మరో ఐదేళ్లలో ఇండియాను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈసారి బడ్జెట్‌‌‌‌ను తయారు చేసినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌ ప్రకటించారు.

ఇదంతా బాగానే ఉన్నా, ఆర్థిక వ్యవస్థ వికాసానికి స్వల్పకాలిక చర్యలు ప్రకటించకపోవడం, అత్యంత సంపన్నులపై పన్నుభారాన్ని ఇంకా పెంచడం, బైబ్యాక్‌‌‌‌లపై సర్‌‌‌‌చార్జ్‌‌‌‌ విధించడం వంటివి ఇన్వెస్టర్లకు నిరాశకలిగించాయి. విదేశీ ఇన్వెస్టర్లు అత్యంత సంపన్నుల (హై నెట్‌‌‌‌వర్త్‌‌‌‌) విభాగంలోకి వస్తారు కాబట్టి వారి సంపద భారీగా తగ్గుతుంది. గత వారం వరకు దూసుకెళ్లిన సూచీలు, బడ్జెట్‌‌‌‌ ప్రకటనలతో ఒక్కసారిగా ఆగిపోయాయి. లార్జ్‌‌‌‌క్యాప్స్‌‌‌‌లో భారీ నష్టాలతో దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. టీసీఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, నెస్ట్లే ఇండియా, మారుతీ సుజుకీ, ఎల్‌‌‌‌ అండ్ ​టీ, టైటాన్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ, ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, విప్రో, టాటా మోటార్స్‌‌‌‌ వంటి ఇండెక్స్ స్టాక్స్‌‌‌‌ భారీగా పతనమయ్యాయి.

నిపుణుల మాట…

‘‘ఈవారం మార్కెట్లు నిరాశజనకంగానే మొదలయ్యాయి. నిఫ్టీ అయితే విపరీతంగా పతనమయింది. ఇందుకు ప్రధాన కారణం బడ్జెట్‌‌‌‌ అని ఎనలిస్టులు చెబుతున్నా, అధిక వాల్యుయేషన్లు కూడా మరో ప్రధాన కారణం. అందుకే సూచీలు నేలచూపులు చూస్తున్నాయి’’ అని శామ్‌‌‌‌కో సెక్యూరిటీస్‌‌‌‌ అండ్‌‌‌‌ స్టాక్‌‌‌‌నోట్‌‌‌‌ వ్యవస్థాపకుడు జిమీత్‌‌‌‌ మోడీ అన్నారు.  బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌ 1.97 శాతం, ‘నిఫ్టీ–50’ 2.1 శాతం నష్టపోయాయి. బీఎస్‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌క్యాప్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 2.58 శాతం, మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 1.17 శాతం పతనమయ్యాయి. ‘బీఎస్‌‌‌‌ఈ 500 ఇండెక్స్‌‌‌‌’లోని 370 స్టాక్స్‌‌‌‌ ఈవారం నష్టాలతోనే ముగిశాయి. వీటిలో 18 కంపెనీలు 20 శాతం వరకు నష్టపోయాయి. వీటిలో జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌‌‌, సద్భావ్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌, మైండ్‌‌‌‌ట్రీ, ఆర్‌‌‌‌ఈసీ, దిలీప్‌‌‌‌ బిల్డ్‌‌‌‌కాన్‌‌‌‌, జైప్రకాశ్‌‌‌‌ ఎస్టేట్స్‌‌‌‌, ఇండియాబుల్స్‌‌‌‌ వెంచర్స్‌‌‌‌, హెచ్‌‌‌‌ఈజీ, టైటాన్‌‌‌‌ వంటి కంపెనీలు ఉన్నాయి.

ఈవారం పరిస్థితి ?

కంపెనీల క్యూ1 ఫలితాలు, స్థూల ఆర్థిక పరిస్థితులు ఈవారం మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. గత వారం మాదిరే ఈసారి కూడా ఇండెక్స్​లు తక్కువ స్థాయి హెచ్చుతగ్గులలో ఉంటాయని చెబుతున్నారు. దిగువస్థాయిల్లో 11,460 స్థాయిల వద్ద మద్దతు కనిపిస్తోంది. వీటితోపాటు ఈ నెల 15న విడుదలైన వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు కూడా సూచీలకు కీలకంగా మారనున్నాయి. అయితే గత నెలలో చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టంలో 3.18 శాతానికి చేరింది. పారిశ్రామిక ఉత్పత్తి మేలో 3.1 శాతం నమోదయింది. టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు. దాదాపు 70 కంపెనీలు మరికొన్ని రోజుల్లో క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. వీటిలో మైండ్‌‌‌‌ట్రీ, విప్రో, ఏసీసీ, కోల్గేట్‌‌‌‌ పామోలివ్‌‌‌‌ వంటివి ఉన్నాయి.