
మన దేశానికి అంతర్జాతీయస్థాయి సాంకేతిక నిపుణులను అందించడానికి స్థాపించిన నేటి ఈ ఐఐటీలు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860–61 కింద ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ సొసైటీలుగా నిర్మితమయ్యాయి. వీటిని మొదటగా ఖరగ్‌పూర్‌లో ఆగస్టు 18, 1951న ప్రారంభించిన తరువాత ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఢిల్లీ మొదలైనవి స్థాపించడమైంది.
ఆ తదనంతరం సాంకేతిక విద్యాలయాల చట్టం 2011కి లోబడి, కేంద్ర, ఉన్నత విద్యాశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖ ద్వారా భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 ఐఐటీలలో సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలో( ఐఐటీ హైదరాబాద్) ఒకటి. దాదాపు 60, 70 సంవత్సరాలుగా ఐఐటీలు మౌలిక సదుపాయాల ఆధారంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధనల ద్వారా డైనమిక్‌గా స్థిరమైన ప్రపంచస్థాయి విద్యావేదికలయ్యాయి.
సెంట్రల్ యునివర్సిటీలు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయ చట్టం 1915 చట్టం ద్వారా జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు జరిగింది. ఇప్పుడవి ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్కటిగా లేదా వివిధరకాలవి స్థాపితమయ్యాయి. ఇందులో దేశభవిష్యత్ మరింత అభివృద్ధి అవసరం అవుతున్నప్పుడు మరిన్ని వివిధ రకాల జాతీయ విద్యాసంస్థలు, ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అవసరం.
స్థానిక రిజర్వేషన్
ఈ జాతీయ విద్యాసంస్థలలో 50 శాతం కోటా స్థానిక రాష్ట్ర కోటా ఉంటుంది. వీటివలన రాష్ట్రంలో ఏ వర్గాలైనప్పటికి, కులం, మతం, వర్గభేదం లేనివారికి, కిందికులాలవారికి రాష్ట్రస్థానిక కోటాతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రత్యేక మహిళా కోటా రిజర్వేషన్లతో కూడిన అడ్మిషన్లు ఉంటాయి. దీంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక, ఇతర ఆధునిక రంగాలలో మన దేశ అభివృద్ధిలో బడుగువర్గాల భాగస్వామ్యం పెరుగుతుంది .
ఈ విషయం గ్రహించిన ఇండియన్ విద్యార్థి సంఘం, కుల నిర్మూలన వేదికల తరఫున రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. నిజానికి జాతీయ స్థాయిలో 10 లక్షల నుంచి14 లక్షలవరకు దరఖాస్తు చేస్తుంటారు. మనరాష్ట్రంలో దాదాపు లక్షా యాభై నుంచి రెండు లక్షల మంది విద్యార్థులు జేఇఇ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 75 శాతం నుంచి 100 శాతం పర్సంటైల్స్ (దాదాపు 90వేల మంది వరకు) అర్హత పొందుతారు.
ఇందులో అడ్వాన్స్‌కు అనగా, ఐఐటీలలో అడ్మిషన్ కోరువారు జాతీయస్థాయిలో 30వేల నుంచి 50 వేల వరకు ఉత్తీర్ణులవుతారు. అయినా మన రాష్ట్రం విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర సాంకేతిక సంస్థలలో సీట్లు రావు. కారణం వీటిల్లో సీట్లు పరిమితంగానే ఉంటాయి. ఒకవేళ జోసా, సీస్యాట్ ద్వారా కౌన్సెలింగ్ జరపగా సీట్లు మిగిలితే వాటిని అలాగే మిగిలించి ఉంచుతున్నారేగానీ దగ్గర ర్యాంక్ వరకు వచ్చిన అభ్యర్థితో నింపడం లేదు.
తెలంగాణకు అన్యాయం
గత 5 సంవత్సరాలలో దళిత, బహుజన, ఆదివాసీ, గిరిజన, మహిళల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల కాంక్ష బలంగా పెరిగింది. కానీ, కేంద్రం ఎందుకోగానీ వారిని దృష్టిలో ఉంచుకొని మిగిలిన సీట్లను కేటాయించడంలేదు. అంతేకాదు, ఓబీసీల కోటాల అమలులో కూడా 22 నుంచి 23 శాతం వరకే అడ్మిషన్‌లలో అవకాశం ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కోటాలో అతితక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి. కింది కులాలవారికి ఒపెన్ కోటాలో సీట్లు వచ్చినా వారికి రిజర్వేషన్ కోటాలలో సీట్లను భర్తీ చేస్తున్నారు.
అసలు రిజర్వేషన్ కోటా విద్యార్థులే కాదు, నాన్ రిజర్వేషన్ కోటా విద్యార్థులనూ తెలంగాణ ప్రాంతంవారిపట్ల పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్నారు. ఆ స్థానంలో నార్త్ సైడ్‌లోని ప్రాముఖ్యత లేని విద్యాసంస్థలలో అవకాశాలు కల్పిస్తారు. మరొక వైపు ఉత్తర భారత విద్యార్థులకు దక్షిణ భారత ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో సీట్లు కేటాయించడం జరుగుతోంది.
అందుకే మన రాష్ట్రంలో ఉత్తర భారత యాజమాన్యాల చేత ఐఐటీ కోచింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేసి అందులో ఆ ప్రాంతం వారితో కోచింగ్ ఇచ్చి సీట్లు వచ్చేలా చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఆంధ్ర, ఉత్తర భారత ప్రాంత ఉన్నత, మధ్యతరగతి వర్గాలవారు కేవలం ఈ చదువుల కోసమే హైదరాబాద్‌లో టెన్త్, ఇంటర్, సీబీఎస్‌ఇ, ఐసీఎస్‌ఇ తదితర కోర్సులతో స్థానికులవుతున్నారు.
జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి
పార్లమెంటులో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం తదితర వాటికోసం మన రాష్ట్ర ఎంపీలు అడగగా కేంద్ర విద్యాశాఖమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇచ్చేది లేదని చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న కేంద్రాన్ని అడగాల్సినది ఉంది. అదేమంటే, మన రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రజలు అడగకపోయినా ఎలా ఇచ్చారు? అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఎలా ఇచ్చారు?
ప్రజల అవసరాల నిమిత్తం డిమాండ్ అండ్ సప్లయ్ ప్రకారం బనారస్ విశ్వవిద్యాలయం కోసం, ఐఐటీ ఖరగ్‌పూర్ కోసం ఎలా అయితే ప్రత్యేక చట్టంచేసి ఐఐటీలు, సెంట్రల్ యునివర్శిటీలను ఏర్పాటు చేశారో అదేవిధంగా తెలంగాణలో మరిన్ని జాతీయస్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ప్రభుత్వం అలా చేయని స్థితి వస్తే క్యాంపస్‌లనైనా ఏర్పాటు చేయడం అవసరం అనేది పాలకులు గుర్తెరగాలి.
- పాపని నాగరాజు