రాజద్రోహం చట్టంపై కేంద్రం యూటర్న్

రాజద్రోహం చట్టంపై కేంద్రం యూటర్న్
  • సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు

రాజద్రోహ చట్టంలోని నిబంధనల(సెక్షన్ 124ఏ)ను పున:పరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇందులో మార్పులకు అవకాశం ఉందని వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని కోరింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.

యూటర్న్ తీసుకున్న కేంద్రం 
ఈ చట్టం విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు ఈ నెల 10వ తేదీ(మే 10న) నుంచి విచారించనుంది. దీంతో కేంద్రం ముందురోజే కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్పుల కసరత్తును పూర్తి చేసేంతవరకు వేచి ఉండాలని విజ్ఞప్తి చేసింది.

3 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించడంతోపాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్న వేళ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మూలనపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించింది. 

సెక్ష‌న్ 124 ఏ ఏం చెబుతోంది..?

మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, మరే విధంగానైనా భారతదేశంలో చట్టబద్ధంగా నియమితమైన ప్రభుత్వం పట్ల అవిధేయతను, విద్వేషాన్ని, శత్రుభావనలను ప్రేరేపించినా, లేదా ప్రేరేపించటానికి ప్రయత్నించినా వారు శిక్షకు అర్హులు. వీరికి జైలు శిక్ష లేదా జరిమానా లేదా కొన్ని సందర్భాల్లో శిక్షతో పాటు జరిమానా విధించి శిక్షించవచ్చు అని ఐపీసీ సెక్షన్ 124 (ఏ) చెబుతోంది. ఇది నాన్‌బెయిల‌బుల్ సెక్ష‌న్‌. 

గతంలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కింద అరెస్టయిన దాఖలాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ అరెస్టయింది ఈ చట్టం కిందనే. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్​ 2019 మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది.

మరిన్ని వార్తల కోసం.. 

ముంబైలో దావూద్ అనుచరుల ఆఫీసులపై NIA దాడులు

పార్టీ రుణం తీర్చుకోండి..