ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం.. ఈసీ నోటిఫికేషన్‌ జారీ

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం.. ఈసీ నోటిఫికేషన్‌ జారీ

భారతదేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 7వ తేదీ నుంచి నవంబర్‌ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధిస్తూ.. తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్‌ 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయకూడదని ఎన్నికల సంఘం తెలిపింది. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని చెప్పింది.

ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. నవంబర్‌ 7న తొలిదశ పోలింగ్‌; నవంబర్‌ 17న రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిజోరంలో నవంబర్‌ 7, మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17, రాజస్థాన్‌లో నవంబర్‌ 25, తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది.

నోటిఫికేషన్‌ గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకోసం ఈసీ బృందం బుధవారం (నవంబర్ 1న) రాష్ట్రానికి రానుంది. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీశ్‌ వ్యాస్‌, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, అధికారులతో సమావేశం కానున్న ఈసీ బృందం.. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానున్న ఈసీ బృందం.. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్షించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు, తనిఖీలపై చర్చించనన్నారు.