కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

కర్నాటక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ‘ఓటు ఫ్రమ్‌ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ‘ఓటు ఫ్రమ్ హోం’ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

కర్ణాటక శాసనసభ గడువు మే 25వ తేదీతో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2023, ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్ 113 గాఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 80, జెడిఎస్ 37 స్థానాలలో గెలుపొందింది. మధ్యలో జరిగిన ఉప ఎన్నికలతో బీజేపీ బలం 119 స్థానాలకు పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ కు 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నాటక రాష్ట్రంలో 36  ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి. 

ఈసీ వెల్లడించిన వివరాలు.. 

  • మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు
  • మే 10వ తేదీన పోలింగ్‌, మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు 
  • నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్‌ 
  • మొత్తం 5. 21 కోట్ల మంది ఓటర్లు
  • మొత్తం 58, 282 పోలింగ్ కేంద్రాలు
  • 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు 
  • ఓటు హక్కు పొందిన 41,312 మంది ట్రాన్స్ జెండర్లు
  • తొలిసారి ఓటర్లు 9.17 లక్షలు
  • 80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే చాన్స్
  • దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
  • మహిళల కోసం ప్రత్యేకంగా 13 వందలకు పైగా పోలింగ్ స్టేషన్లు
  • ఎన్నికల్లో ధన ప్రలోభాలను నివారించేందుకు స్పెషల్ టీమ్ లు
  • గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు