పీఎంశ్రీ కింద మండలానికి రెండు స్కూళ్లు

పీఎంశ్రీ కింద మండలానికి రెండు స్కూళ్లు

పీఎంశ్రీ కింద మండలానికి రెండు స్కూళ్లు
రాష్ట్రంలో 5,793 బడులు ఈ స్కీమ్​కు అర్హత

హైదరాబాద్, వెలుగు : సర్కారు బడులను డెవలప్​ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పేరుతో మరో స్కీమ్  తీసుకొచ్చింది. ప్రతి మండలానికి రెండు స్కూళ్లను ఎంపిక చేసి, వాటిని అభివృద్ధి చేయనున్నది. మన రాష్ట్రంలో ఈ స్కీమ్​కు ఎలిజిబులిటీ ఉన్న స్కూళ్ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లను ‘మన ఊరు మన బడి’ స్కీమ్​ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం  మూడు విడతల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎంశ్రీ పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త స్కీమ్​ తీసుకురానున్నది. రాష్ట్రాలు పంపే యూడైస్ (2021–22) లెక్కల ద్వారా పది బెంచ్ మార్కుల ఆధారంగా కేంద్రం స్కూళ్లను ఎంపిక చేసింది. దీంట్లోనూ వివిధ అంశాలను పరిశీలించి దేశవ్యాప్తంగా14,500 బడులను పీఎంశ్రీ స్కీమ్ కింద సెలెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సెలెక్షన్​ ప్రాసెస్ కొనసాగుతోంది. తెలంగాణలో పీఎంశ్రీ స్కీమ్​కు  5,793 బడులు అర్హత  సాధించాయని కేంద్రం ప్రకటించింది. వాటిలోంచి మండలానికి రెండు స్కూళ్లను ఈ స్కీమ్​కు  కేంద్రం ఎంపిక చేయనున్నది. ఈనెల 31వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇప్పటికే 4 వేలకు పైగా స్కూళ్లు దరఖాస్తు చేశాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. 

ఒక్కో స్కూల్​కు రూ.2 కోట్లు 

పీఎంశ్రీ స్కీమ్ కింద మండలంలో 2 స్కూళ్లను ఎంపిక చేస్తారు. దీంట్లో ఒకటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, మరొకటి సెకండరీ స్కూల్ ఉంటాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 1,204 బడులు ఎంపిక  కానున్నాయి. స్కీమ్ 2022–23 నుంచి 2026–27 వరకు ఉంటుందని, 2023–24 నుంచి పథకం అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఎంపికైన ఒక్కో స్కూల్​కు స్కీమ్​ పీరియడ్​లో రూ.2 కోట్లు ఖర్చు చేస్తారు. ఆ నిధుల్లో 60 శాతం కేంద్రం వాటా కాగా, మిగిలిన 40 శాతం రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా క్వాలిఫై అయిన స్కూళ్లలోంచి 1,204 బడులను ఎంపిక చేయనున్నారు. ఆయా స్కూళ్లను డీఈఓలు వెరిఫై చేసి, ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. 

అర్హతకు బెంచ్ మార్కులివే

* సొంత భవనం, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండాలి.
* స్టూడెంట్ ఎన్​రోల్​మెంట్ ఎక్కువ ఉండాలి.
* బాలురు, బాలికలకు వేర్వేరు టాయ్​లెట్లు ఉండాలి.
* తాగునీటి సౌకర్యం, హ్యాండ్ వాష్  ఫెసిలిటీ ఉండాలి.
* కరెంట్ కనెక్షన్, లైబ్రరీ, స్పోర్ట్స్ మెటీరియల్ ఉండాలి. 
* టీచర్లకు ఐడీ కార్డులు ఉండాలి.