కేంద్రం కొత్త స్కీం...మత్స్యకారులకు 5 లక్షల ప్రమాద బీమా

 కేంద్రం కొత్త స్కీం...మత్స్యకారులకు 5 లక్షల ప్రమాద బీమా
  • సహకార సంఘాల్లో మెంబరై ఉంటే చాలు
  • వృత్తితోపాటు ఇతర కారణాలతో చనిపోయినా సాయం 
  • అందేలా ఇన్సూరెన్స్ స్కీం

మెదక్/నిజాంపేట, వెలుగు: చేపలు వేటను నమ్ముకుని జీవిస్తున్నవారికి ప్రమాద బీమా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త స్కీమ్ అమలులోకి తెచ్చింది. వృత్తిలో భాగంగా నీట మునిగి కానీ, ఇతర ప్రమాదాల్లో గానీ చనిపోయినా, అంగవైకల్యం పొందినా బీమా పైసలు అందేలా రూపొందించింది. నేషనల్ ఫిషరీస్​డెవలప్ మెంట్ బోర్డు పీఎంఎంఎస్ వై(ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన) కింద తీసుకొచ్చిన ‘గ్రూప్​యాక్సిడెంట్​ఇన్సూరెన్స్​ స్కీమ్’​ పొందాలంటే మత్స్యకారుడు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మత్స్య సహకార సంఘాల్లో సభ్యులై ఉంటే చాలు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో మత్స్యకారుడి కోసం రూ.68.40 ప్రీమియం మొత్తాన్ని ఇన్సూరెన్స్​కంపెనీకి జమచేశాయి. గుర్తింపు సంఘాల్లో రిజిస్టర్​అయిన 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతిఒక్కరూ జిల్లా ఫిషరీస్​ఆఫీసుల్లో వివరాలు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబానికి రూ.5లక్షలు, శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.2.50 లక్షల ఆర్థిక సాయం లభిస్తుందని చెబుతున్నారు.

33 జిల్లాల్లో 5,200 సంఘాలు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జనరల్ మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సంఘాలు కలిపి మొత్తం 5,200 ఉన్నాయి. వీటిలో దాదాపు 3లక్షల8వేల మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. రిజిస్టర్ సంఘంలో మెంబర్​షిప్​ఉంటే గ్రూప్​యాక్సిడెంట్​ఇన్సూరెన్స్​ స్కీమ్​కు అర్హులు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, ఇతర నీటి వనరుల్లో చేపల వేటకు వెళ్లి చనిపోవడం, కరెంట్​షాక్ తగిలి, అగ్నిప్రమాదం సంభవించి, ఏదైనా మిషనరీతో పని చేస్తున్నప్పుడు, ఎత్తు నుంచి పడిపోయి, పాముకాటు, తేలు కాటుకు గురై చనిపోయినా, రేబిస్, ఏదైనా జంతువుల వల్ల మృతిచెందినా, శాశ్వత అంగ వైకల్యం పొందినా ఈ స్కీమ్ వర్తిస్తుంది. నామినీకి బీమా పైసలు అందుతాయి. శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.2.50 లక్షలు వస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్ లో చేరితే రూ.25 వేలు ఆర్థిక సహాయం అందుతుంది.

180 రోజుల్లో పరిహారం

స్కీమ్​ గైడ్​లైన్స్ ప్రకారం అర్హులైన మత్స్యకారులు ఫిషరీస్ ఆఫీసర్లు ఇచ్చే ఫారంలో మెంబర్, నామినీ వివరాలు రాసి డిస్ట్రిక్ ఫిషరీస్ ఆఫీస్ లో అందజేయాలి. ఆన్​లైన్ లో ఎంటర్ చేసి స్టేట్ ఆఫీసుకు ఫార్వర్డ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కలిగిన సభ్యుడు మృతి చెందినా, వైకల్యం పొందినా ఇన్సూరెన్స్ క్లెయిమ్​కోసం వారం రోజుల్లో డిస్ట్రిక్ ఫిషరీస్ ఆఫీసులో సంప్రదించాలి. సంబంధిత డాక్యుమెంట్లు అందిస్తే 180 రోజుల్లో బీమా మొత్తం అకౌంట్ లో జమ అవుతుంది. అర్హులు ఇన్సూరెన్స్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి.
– రజిని, మెదక్ జిల్లా ఫిషరీస్​ఆఫీసర్