ఐటీ రంగానికి పీఎల్​ఐ స్కీమ్

ఐటీ రంగానికి పీఎల్​ఐ స్కీమ్
  •     సెమీకండక్టర్​ మిషన్​ 10 బిలియన్​ డాలర్లు
  •     వెల్లడించిన కేంద్రమంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​

హైదరాబాద్​, వెలుగు: ఇన్నోవేషన్లను మరింత పెంచడానికి, టెక్నాలజీ ఎకోసిస్టమ్​ను​ఇంకా విస్తరించడానికి  మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ,  స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ & ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ శాఖల సహాయ మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్  అన్నారు. ఇందులో భాగంగా హార్డ్‌‌‌‌వేర్,  సర్వర్‌‌‌‌ల కోసం ఐటీ రంగానికి పీఎల్‌‌‌‌ఐ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం తయారీదారులకు,  ఒరిజినల్ ఎక్విప్‌‌‌‌మెంట్ తయారీదారులకు (ఓఈఎంలు) అదనపు ప్రోత్సాహకాలను అందజేస్తుందని చెప్పారు. ఇండియా సెమీకండక్టర్​ మిషన్​ కోసం కేంద్ర ప్రభుత్వం 10 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయనుందని చెప్పారు. దీనివల్ల మనదేశంలో సెమీకండక్టర్​ ఇన్నోవేషన్​ ఎకోసిస్టమ్​ మరింత పెరుగుతుందని అన్నారు. అప్లికేషన్ల కోసం కో–డిజైన్​ఐపీ, టూల్స్ తయారు చేసే స్టార్టప్​లకు 200 మిలియన్​ డాలర్లు ఇస్తామని వెల్లడించారు. ​ వీఎల్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌లో జరిగిన 22వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన వర్చువల్​గా మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.  

సెమీకండక్టర్ ​పరిశ్రమకు ఎన్నో అవకాశాలు..

వీఎల్​ఎస్​ఐ డిజైన్  ఎంబెడెడ్ సిస్టమ్స్ రంగాలలో అవకాశాల గురించి మంత్రి మాట్లాడుతూ, “2014 కి ముందు, భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కొన్ని కంపెనీలు నిర్వహించే టెక్ సేవల పరిశ్రమకు మాత్రమే పరిమితమైంది. అయితే 2022లో డిజిటల్ టెక్నికల్​ ఎకోసిస్టమ్​ సిస్టమ్​ గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల రంగానికి మనదేశంలో అద్భుత అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటలైజేషన్‌‌‌‌తో ఉత్పత్తులకు డిమాండ్‌‌‌‌ పెరిగింది. ట్యాలెంట్​కు గిరాకీ పెరిగింది. సెమీకండక్టర్ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్  ప్యాకేజింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌లో గ్లోబల్ స్టాండర్డ్స్​ను అభివృద్ధి చేయడానికి భారతదేశం తీవ్రంగా కృషి చేస్తోంది. సెమికాన్ ఇండియా ఫ్యూచర్ డిజైన్ ప్రోగ్రాం కింద 2024 నాటికి దేశీయ స్టార్టప్‌‌‌‌లు గ్లోబల్ మేజర్‌‌‌‌లతో కలిసి పనిచేస్తాయి”అని మంత్రి వివరించారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ సెమీకండక్టర్ల సెక్టార్​సామర్థ్యాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం సెమీకండక్టర్  అడ్వాన్స్‌‌‌‌డ్ కంప్యూటింగ్ రంగాలపై దృష్టి సారించి ఐటీ శాఖలో ప్రత్యేక విభాగాలను సృష్టించిందని అన్నారు.  కార్యక్రమానికి దాదాపు 2,000 మందికి పైగా ఇంజనీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు, ప్రతినిధులు, విద్యాసంస్థలు, పరిశోధకులు, అధికారులు వచ్చారు. అంతర్జాతీయ వీఎల్​ఎస్​ఐ డిజైన్ & ఎంబెడెడ్ సిస్టమ్స్ కాన్ఫరెన్స్ వీఎల్​ఎస్​ఐ  ఎంబెడెడ్ సిస్టమ్స్‌‌‌‌లోని తాజా పోకడలపై దృష్టి సారిస్తుంది.