మబ్బులు తొలుగుతున్నయ్​

మబ్బులు తొలుగుతున్నయ్​

పాదయాత్రలకు అంత పవరుంటుందా? సగటు మెదళ్లను తొలిచే ప్రశ్న. కాంగ్రెస్‌‌‌‌ ముఖ్య నేత రాహుల్‌‌ గాంధీ చేసిన ‘భారత్‌‌ జోడో’ పాదయాత్ర తర్వాత దేశంలో ఇలా ప్రశ్నించడం ఎక్కువైంది. ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పినా, ‘నిజమే పాదయాత్రల ప్రభావం ఉంటుంది’ అనే ‘ప్రజాభిప్రాయం’ మాత్రం దేశ వ్యాప్తంగా జరిగిన ఓ సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌‌ ఓటు షేర్‌‌ రమారమి10 శాతం పెరిగి 29కి చేరుకుంటోంది. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న రాహుల్‌‌, ఇపుడు నిప్పుకణికై రాటుదేలుతున్న క్రమానికి ఈ సర్వే గణాంకాలు అద్దం పట్టాయి. ప్రధాని మోడీకి బలమైన ప్రత్యామ్నాయం దేశంలో రాహుల్‌‌ గాంధీయే అనేది బలపడుతోంది. ఎన్డీటీవీ- సీఎస్​డీఎస్‌‌ -లోక్‌‌నీతి సంస్థలు జరిపిన ఈ సర్వే... నాలుగైదు కీలకాంశాలను భారత రాజకీయ యవనికపైకి తెచ్చి, చర్చకు పెడుతోంది.

దే శమంతా ఆసక్తిగా నిరీక్షించిన కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ఫలితం గట్టి రాజకీయ సంకేతాన్నే ఇచ్చింది. ఆ పోలింగ్‌‌-ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా జరిపిన తాజా సర్వే ఇదే విషయాన్ని నిర్దారించింది. కర్నాటకలో గెలుపే కాకుండా దేశమంతటా కాంగ్రెస్‌‌ పార్టీ నైతిక స్థైర్యం పెంచి, ప్రజల్లోనూ పార్టీకి ఆదరణ పెరగటానికి రాహుల్‌‌ పాదయాత్ర కారణమైనట్టు ధ్రువపడింది. కిందటి ఎన్నికల మీద, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌‌10 శాతం ఓటు షేర్‌‌ పెంచుకుంటుందని తాజా సర్వేలో వెల్లడైంది. అంటే, 2019 నాటి 19 శాతం నుంచి 29 శాతంకు ఎగబాకటం! బీజేపీ-, కాంగ్రెసేతర విపక్ష కూటమి అవకాశాలు సన్నగిల్లిన సంకేతాలు స్పష్టంగా వెలువడ్డాయి. అలాంటి కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్​కాలికి బలపం కట్టుకు తిరిగినా, కేంద్రంలోని బీజేపీ నేతృత్వపు ఎన్డీయే ప్రభుత్వానికి, కాంగ్రెస్‌‌ కేంద్రకంగా సమైక్యమయ్యే కూటమే ప్రత్యామ్నాయంగా బలపడే అవకాశాలు మెరుగవుతున్నాయి. దేశంలో రాహుల్‌‌ బలమైన విపక్షనేతగా, ప్రధాని మోడీకి నిలకడైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. సర్వే ద్వారా లభించిన డేటాను శాస్త్రీయంగా అన్వయించి, హేతుబద్ధంగా విశ్లేషిస్తే.. ఆసక్తికర సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ పరిస్థితి కాస్త ఆశాజనకంగానూ, కొంచెం తగ్గినా బీజేపీ హవా నిలకడగా, ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానూ ఉంటుందని స్పష్టమౌతోంది.

మార్చేది 10 శాతమే

బహుముఖ పోటీలు బలోపేతమైనపుడు ఎన్నికల్లో ఒక‌‌ట్రెండు శాతం ఓటు తేడాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటిది, కాంగ్రెస్‌‌కు పది శాతం ఓటు షేర్‌‌ పెరగనుండటం విశేషమే! బీజేపీ ప్రచారం చేస్తున్న ‘కాంగ్రెస్‌‌ ముక్త్‌‌ భారత్‌‌’ తీవ్రమైన ఒక దశలో కాంగ్రెస్‌‌ రెండు రాష్ట్రాల్లో (రాజస్తాన్‌‌, చత్తీస్‌‌గఢ్) మాత్రమే అధికారానికి పరిమితమైంది. హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఉత్కంఠ పోరులోనూ కర్నాటకలో స్పష్టమైన ఆధిక్యతతో గెలవటం.. అదే వరుసలో ఇప్పుడు సానుకూల సర్వే ఫలితాల క్రమం, రానున్న అయిదారు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు గట్టి టానిక్‌‌! 2018లో ఆ పార్టీకి19.49 శాతం ఓట్లు(52 సీట్లు) మాత్రమే దక్కాయి. కాంగ్రెస్‌‌ ఓటమి పరంపర మొదలైన, అంతకు ముందరి 2014 ఎన్నికల్లోనూ లభించింది19.21 శాతం ఓట్లు (44 సీట్లు) మాత్రమే! 2004లో కాంగ్రెస్‌‌ 26.4 శాతం ఓటు షేర్‌‌తో 145 లోక్‌‌సభ స్థానాలు గెలిచి, యూపీఎ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. నాటి యూపీఎ–1 అందించిన పాలన వల్ల దేశ ప్రజలు తిరిగి పట్టం కట్టారు. అందుకే, 2009లో 28.55 శాతం ఓటు షేర్‌‌తో 206 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌‌ యూపీఎ-–2 ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. దాదాపు అంతే (29 శాతం) ఓటు షేర్‌‌ రానున్నట్టు తాజా సర్వే చెప్పింది. ఎన్నికలకు ఇంకో ఏడాది కాలముంది. ఈ లోపు ఏం జరగనుందో? బీజేపీ ఓటు షేర్‌‌ పెద్దగా తగ్గటం లేదు. లోక్‌‌సభ ఎన్నికలు కాబట్టి, కాంగ్రెస్‌‌ పుంజుకునే క్రమంలోనే ఇతరేతర పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల బలం తగ్గొచ్చు. ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా పోటీ బీజేపీ, -కాంగ్రెస్‌‌ల మధ్యే ఉండనుంది. ప్రాంతీయ పార్టీ బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలో ఉన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్‌‌, బీజేపీలు నువ్వా, నేనా అన్నట్టు పాలకపక్షంతో పోటీ పడుతున్నాయి. 

తప్పుడు అంచనాలు...

పాదయాత్రలన్నీ విజయవంతమవుతాయా? అంటే సమాధానం చెప్పలేమేమో కానీ, కొన్ని కచ్చితమైన ఫలితాలిస్తాయని రుజువౌతోంది. ‘మా కోసం శరీరాన్ని, మనసునీ కష్టపెట్టుకొని నడుస్తున్నారే..’ అని ఆయా పాదయాత్రల్ని ప్రజలు మనసుమీద తీసుకుంటే, వాటి ప్రభావం గణనీయంగానే ఉంటుందని చరిత్ర చెప్పింది. అయోధ్య రాజాంతఃపురాలు వీడి అడవులకు నడిచిన రాముడి నుంచి, బుద్ధుడు, శంకరాచార్యుడు, ఏనుగుల వీరాస్వామి, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌‌, కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి, వైఎస్సార్‌‌.. ఇలా ఎందరెందరో వేర్వేరు యాత్రలతో చరిత్ర సృష్టించారు. విపక్షంలోని వారి పాదయాత్రల్ని ఉద్దేశించి ‘సరే, చేయనీయండి, తిన్నది అరుగుతుంది’ ‘కొంచెం ఒళ్లైనా తగ్గుతుందిలే!’ ‘ఆరోగ్యం కోసం బానే ఉంటుంది’.. ఇలా ప్రత్యర్థులుగా పాలకపక్షం వారు చేసే ఎకసక్యాలే అర్థం లేనివి! 2003లో వైఎస్సార్​ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించాక.. ఓ పెద్ద పత్రికాధిపతి చేసిన వ్యాఖ్యలే ఇలాంటి తప్పుడు అంచనాలకు నిదర్శనం. ఎడిటోరియల్‌‌ ముఖ్యుల భేటీలో, క్షేత్ర సమాచారమిస్తూ, ‘... పాదయాత్ర ప్రభావం చాలా ఉంది’ అని ఓ సీనియర్‌‌ అన్నపుడు, ‘ఆ ఏముంటుందయా? చూస్తూ ఉండండి.. ఇప్పుడు హడావుడిగానే ఉంటుంది, తర్వాత జనం అంతా మరిచిపోతారు. దాని ప్రభావం సున్నా, ఏమీ ఉండదు’ అన్నారా పెద్దమనిషి. కానీ, జరిగిందేమిటి? పాదయాత్రతో వైఎస్‌‌ ప్రతిష్ట అసామాన్యంగా పెరిగింది. ప్రజలతో మమేకమై, ప్రజాక్షేత్రమే ప్రయోగశాలగా అక్కడ తెలుసుకున్న సమాచారం, ఎదురైన అనుభవాలనే ఎన్నికల హామీలుగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటినే విధానాలుగా మలిచి అయిదేళ్లు పాలించారు. పలువురు విమర్శించిన చంద్రబాబునాయుడి పాదయాత్ర కూడా ఆయనకు అధికారాన్నిచ్చింది. ఆయన తనయుడు లోకేశ్‌‌ ఇప్పుడు చేస్తున్న పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తెలంగాణలో బండి సంజయ్‌‌(బీజేపీ), రేవంత్‌‌రెడ్డి, భట్టి విక్రమార్క(కాంగ్రెస్‌‌), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), ఆర్‌‌.ఎస్‌‌.ప్రవీణ్‌‌ కుమార్‌‌ (బీఎస్పీ) వంటి వారూ పాదయాత్రలు చేసి ప్రజలకు చేరువయ్యారు. పార్టీ పెట్టిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో, లోగడ ఏపీలో పాదయాత్ర చేసి అనుభవం గ‌‌డించారు.

5 శాతం తేడాను కొట్టేదెవరు?

దేశంలో రాజకీయ పునరేకీకరణల పర్వం ఊపందుకుంటోంది. కాంగ్రెస్‌‌ కేంద్రంగా బీహార్‌‌ సీఎం నితీశ్‌‌ కుమార్‌‌, మరాఠా యోధుడు శరద్‌‌ పవార్‌‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌‌ వంటి వారు పావులు కదుపుతున్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్‌‌ కూడా ఇటీవల క్రియాశీలంగా ఇలాంటి భేటీల్లో పాల్గొంటున్నారు. బెంగాల్‌‌ సీఎం మమతా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ వంటి వారు ఇదివరకంత కాంగ్రెస్‌‌ వ్యతిరేకతతో లేరిపుడు. ప్రధానిగా ఎవరివైపు మొగ్గుతారంటే జనాభిప్రాయం అప్రతిహతంగా మోడీకే (45శాతం) లభించినట్టు సర్వే చెప్పింది. కానీ, రాహుల్‌‌ 24 నుంచి 27కి పెరిగారు. మూడో స్థానంలో 4 శాతం జనమద్దతుతో మమత, కేజ్రీవాల్‌‌లున్నారు. అఖిలేష్‌‌(3శాతం), నితీశ్‌‌(1శాతం) పోటీలో లేనట్టే! ఇంకో ఆసక్తికరమైన అంశం.. మోడీ నేతృత్వపు ప్రభుత్వం మళ్లీ రావాలా? అన్న సూటి ప్రశ్నకు రావాలని 43 శాతం, రావద్దని 38 శాతం మంది స్పందించారు. అంటే, తేడా 5 శాతమే! ఏ కారణంగానో ఓ18 శాతం మంది ఈ ప్రశ్నకు పలుకలేదు. 19 రాష్ట్రాలు, 71 నియోజకవర్గాలు, 7200 మంది శాంపిల్స్​తో జరిపిన ఈ సర్వేలో.... ప్రధాని మోడీని ఎవరు సమర్థంగా ఎదుర్కోగలరన్నపుడు వరుసగా రాహుల్‌‌ గాంధీ(34 శాతం), కేజ్రీవాల్‌‌ (11 శాతం), అఖిలేష్‌‌(5 శాతం), మమత(4శాతం) ల పేర్లు వచ్చాయి. రెండు, మూడు స్థానాల మధ్య చాలా తేడా ఉంది. ఒకటి రెండు స్థానాల మధ్య తేడా తగ్గుతోంది. ఏడాదిలో ఇంకా తగ్గొచ్చేమో? ఎందుకంటే, దేశంలో 27 శాతం మంది రాహుల్‌‌ని అభిమానిస్తుంటే..15 శాతం మంది అభిమానం, ‘భారత్‌‌ జోడో’ తర్వాతే మొదలైంది. ఎన్నికల్లోపు ఇంకా ‘యాత్ర’లున్నాయని రాహుల్‌‌ చెబుతున్నారు. ఇదీ విషయం!

-  దిలీప్‌‌‌‌ రెడ్డి.. పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌, పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ,