విద్యార్థి జీవితంపై కోచింగ్ బరువు.. ఏడు వేల కోట్ల దందా !

విద్యార్థి జీవితంపై కోచింగ్ బరువు.. ఏడు వేల కోట్ల దందా !

భారతదేశ విద్యావ్యవస్థలో ఒక ఆందోళనకరమైన పరిణామం కోచింగ్ వ్యాపారం. ఇన్ఫీనియా సర్వే ప్రకారం, ఈ పరిశ్రమ విలువ 7 వేల కోట్ల రూపాయలు దాటింది. ఈ సంఖ్య కేవలం వ్యాపార విజయానికి నిదర్శనం కాదు.  అది లక్షలాది మంది విద్యార్థుల బాల్యం, మానసిక ఆరోగ్యం, ఉన్నత ఆశయాల ఆశలపై పడుతున్న అసహనీయమైన భారానికి ప్రతిబింబం. విద్య జ్ఞానానికి బంగారు బాట కావాలి, కానీ, అది క్రమంగా ర్యాంకుల వేట, మార్కుల మాఫియా, అధిక లాభాల కోసం నిర్మితమైన వ్యాపార యంత్రంగా మారిపోయింది.

భారతదేశంలో పోటీ పరీక్షల సంప్రదాయం పురాతనమైనదే అయినా,  ఆధునిక కోచింగ్ కేంద్రాల వ్యాప్తి  1980వ దశకంలో మొదలైంది. ఐఐటీ-జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్షలు (నీట్) వంటి పరీక్షల ప్రాధాన్యం పెరిగి, వాటి ద్వారా మెరుగైన, ఉన్నతమైన జీవితం సాధ్యమని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేక శిక్షణకు మళ్లించారు.  రాజస్థాన్​లోని కోట ఈ కాలంలోనే ‘కోచింగ్ రాజధాని’గా నిలిచింది.

ఈ విస్తరణ వెనుక ప్రధాన కారణం ప్రభుత్వ విద్యా వ్యవస్థలోని వ్యవస్థాగత  వైఫల్యం. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, పరీక్షా విధానంలో అనిశ్చితి..  ఇవన్నీ కోచింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయంలేని స్థితిని కల్పించాయి. ఆర్టికల్ 21ఎ ప్రకారం విద్య  పౌరుల హక్కు అయినప్పటికీ, ఆ బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా నిర్వర్తించలేకపోవడంతో ప్రైవేట్ రంగం లాభదాయకమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 2000వ దశకంలో గ్లోబలైజేషన్, మధ్యతరగతి ఆకాంక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ రంగం పట్ల పెరిగిన ఆకర్షణ - ఇవన్నీ కోచింగ్ ఫీజులను సామాన్యులు అందుకోలేని విధంగా విపరీతంగా పెంచాయి.

కొవిడ్ ప్రభావం.. డిజిటల్ విస్తరణ
కొవిడ్-19 మహమ్మారి (2020-–22) విద్యా రంగాన్ని పూర్తిగా మార్చేసింది.  క్లాసులు ఆగిపోయినా, కోచింగ్ వ్యాపారం మాత్రం ఆన్​లైన్​ రూపంలో విస్తరించింది.  ఎడ్​టెక్​ సంస్థలు భారీ పెట్టుబడులతో రంగప్రవేశంచేసి, కోచింగ్ సెంటర్లతో కలసి డిజిటల్ క్లాసులను విస్తరించాయి.  దీంతో గ్రామీణ విద్యార్థులకు కొత్త అవకాశాలు లభించినప్పటికీ, డిజిటల్ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. నిరంతర స్క్రీన్ సమయం, వ్యక్తిగత పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులను  మానసికంగా  ఏకాకులను చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మరింత వెనుకబడ్డాయి.  

నిబంధనలు ఉన్నా..
ప్రభుత్వం ఇటీవల కోచింగ్ కేంద్రాల నిబంధనలు 2024ను విడుదల చేసింది. వీటిలో 16 ఏళ్ల లోపు విద్యార్థులను కోచింగ్​సెంటర్లలో  చేర్చరాదు, ప్రతి సంస్థలో కౌన్సిలర్ తప్పనిసరి, తప్పుడు ర్యాంకు హామీల నిషేధం వంటి నిబంధనలు ఉన్నాయి. కానీ ఇవి కేవలం సూచనలుగానే నిలిచాయి. కోచింగ్ వ్యాపారంపై పటిష్టమైన చట్టం (యాక్ట్) లేకపోవడం, రాజకీయ సంకల్పం కొరవడటం సమస్యను మరింత క్లిష్టం చేస్తోంది. రాజస్తాన్​లో కోచింగ్​ సెంటర్లకు పేరు పొందిన కోటలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు న్యాయస్థానాల జోక్యానికి దారితీసి, మానసిక ఆరోగ్య సంరక్షణను తప్పనిసరి చేశాయి. అయినప్పటికీ, సమగ్ర నియంత్రణ ఇంకా అమలులోకి రాలేదు.

ఏడు వేల కోట్ల దందా!
విద్య అనేది జ్ఞానాన్ని విముక్తి సాధనంగా నిలవాలి.  కానీ, ఇది క్రమంగా డబ్బు, ర్యాంకు, హోదాకు బానిసత్వంగా మారింది. ఏడు వేల కోట్ల విద్యా దందా వెనుక విద్యార్థుల కన్నీళ్లు, అమాయకత్వం, ఆశల అస్తమయం దాగి ఉన్నాయి. ప్రభుత్వం, తల్లిదండ్రులు, విద్యావేత్తలు కలిసి విద్యార్థులకు ‘బతుకు బాటను’ చూపించాలి, కేవలం  ‘ర్యాంకు రూటు’ కాదు.  పటిష్టమైన చట్టాలు, మానవీయమైన పాలన, జ్ఞానాన్ని గౌరవించే సంస్కృతి ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు.  లేకపోతే రాబోయే తరాలు ఒత్తిడితో,  నిరాశతో నిండిన శూన్యంలోకి నెట్టబడే ప్రమాదం తప్పదు. భారతదేశ భవిష్యత్తు కోసం విద్యలో మానవీయత పునరుద్ధరణ అనివార్యం అవుతుంది.

శాస్త్రీయ దృక్కోణం
ఇన్ఫీనియా సర్వే అంచనా ప్రకారం 2028 నాటికి ఈ ఒత్తిడి మరింత పెరగనుంది. దీర్ఘకాలిక ఒత్తిడి విద్యార్థుల ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరును దెబ్బతీస్తుంది. ఈ భాగమే నిర్ణయాలు, భావోద్వేగ నియంత్రణకుబాధ్యత వహిస్తుంది.  తల్లిదండ్రుల ఆశలు, సహచరుల పోటీ, విఫలమైతే సామాజిక పరాభవం అన్న భయం ఇవన్నీ కార్టిసోల్ హార్మోన్ స్థాయిని పెంచి, ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యా ధోరణుల వరకు దారితీస్తాయి. 

ర్యాంకు అనే ఏకైక ప్రమాణం విద్యార్థుల సహజ ఉత్సుకత, సృజనాత్మకతను నశింపజేస్తోంది. నేటి కోచింగ్ కేంద్రాలు విద్యార్థులకు గురుకులాలు కావు. అవి లక్ష్యాల కారాగారాలు. అక్కడ విద్యార్థుల చిరునవ్వులు, బాల్యం కోల్పోతూ, కేవలం మార్కుల కోసం బట్టీ పద్ధతిలో కూరుకుపోతున్నారు. 

డా. రావుల కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్సీయూ