కాల్వలిట్ల.. పారకం ఎట్ల? నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు కెనాల్స్ పరిస్థితి అధ్వానం

కాల్వలిట్ల.. పారకం ఎట్ల? నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు కెనాల్స్ పరిస్థితి అధ్వానం
  • కాగితాలకే  పరిమితమవుతున్న అంచనాలు
  •  లక్షా 30 వేల ఎకరాల సాగుపై అయోమయం

నిర్మల్, వెలుగు:  నిర్మల్​ జిల్లాలో దాదాపు లక్షా 30 వేల ఎకరాలకు సాగు నీరందించే కడెం, సరస్వతీ, స్వర్ణ, గడ్డెన్న వాగు, సదర్మాట్ కాల్వలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏటా వేసవిలో రిపేర్లకు సంబంధించి అంచనాలు తయారు చేసి  ప్రభుత్వానికి పంపుతున్నా నిధులు మాత్రం విడుదల చేయడంలేదని ఇరిగేషన్​అధికారులు ఆరోపిస్తున్నారు. 

ఈసారి కాల్వలకు రిపేర్లు చేపట్టకపోతే నీటి ప్రవాహం ముందుకు సాగడం కష్టమే అంటున్నారు. చాలా చోట్ల కాల్వల్లో పూడిక పేరుకుపోయి, లైనింగ్ దెబ్బతింది. కట్టలు బలహీనపడి, గండ్లు పడ్డాయి. కాల్వల మధ్యలో పిచ్చి మొక్కలు మొలిచి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి. 

  • ఆందోళనలో ఆయకట్టు రైతులు..

కాల్వలకు రిపేర్లు చేపట్టకపోవడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళనకు గురవుతోంది. సరస్వతీ కాల్వ కింద 38 వేల ఎకరాలు, కడెం కాల్వ కింద 63 వేలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 10 వేలు, సదర్ మాట్ కాల్వ కింద 6 వేలు, గడ్డన్న వాగు కింద 14 వేల ఎకరాలు సాగు లక్ష్యంగా నిర్ధారించారు. 2010 నుంచి కాల్వల రిపేర్లపై ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయి. అప్పటి నుంచి అడపదడపా నిధులు మంజూరయ్యాయే తప్ప పూర్తిస్థాయిలో  జరగలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాల్వలను పూర్తిగా వదిలేశారు. 

  • అన్ని కాల్వల దుస్థితి ఇదే..

సరస్వతీ కాల్వ ఒకటో నంబర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి 26వ నంబర్ వరకు మొత్తం 21 వేల 874 ఎకరాల ఆయకట్టు, కడెం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 27, 28 డిస్ట్రిబ్యూటరీలు కింది ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. కడెం ప్రాజెక్టు కాల్వలో పూడిక పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు మొలవడంతో లైనింగ్ చెడిపోయింది. 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే స్వర్ణ ప్రాజెక్టు కాల్వ పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల కాల్వ రూపురేఖలు మారిపోయాయి. ఏళ్ల కింద నిర్మించిన గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాల్వల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. 

  •  ఎండాకాలంలోనే పనులు పూర్తిచేయాలి..

ఎండాకాలంలోనే కాల్వల రిపేర్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు పడితే కాల్వలను రిపేర్​ చేయడం సాధ్యంకాదని చెబుతున్నారు. ఈసారి రిపేర్లు జరిగితే రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లకు పూర్తి స్థాయి నీరు అందించే అవకాశం ఏర్పడుతుందంటున్నారు. అధికారులు వెంటనే ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాలని, ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి రిపేర్​పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని రైతులు డిమాండ్​చేస్తున్నారు. 

  • సాగునీరు అందడం లేదు..

సరస్వతీ కాల్వకు ఏటా రిపేర్లు చేపట్టడం లేదు. దీంతో రెండో పంటకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు10 ఏళ్ల నుంచి రిపేర్లు చేయడం లేదు. తామంతా రబీ సీజన్ లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన రిపేర్లు చేయించాలి.  - బొడ్డు సాయన్న, రైతు, లక్ష్మణచాంద