హైకమాండ్ దృష్టికి కోమటిరెడ్డి కామెంట్స్ 

 హైకమాండ్ దృష్టికి కోమటిరెడ్డి కామెంట్స్ 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై ఆరా తీస్తోంది పార్టీ హైకమాండ్. రెండేళ్లుగా పార్టీతో అంటీముంటనట్టుగా ఉంటున్న ఆయన ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీని డ్యామేజ్ చేసేలా మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలని హస్తిన పెద్దలను పీసీసీ కోరినట్టు సమాచారం. తాజా పరిణామాలపై రిపోర్ట్ తెప్పించుకుంటున్న హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి ఓటేయడంపై సీరియస్

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన విషయంపై రాష్ట్ర నేతలు వేచి చూసే ధోరణిలో వ్యవహరించారు. పీసీసీ చీఫ్ రేవంత్ పాటు, పార్టీ స్టేట్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పై కూడా విమర్శలు చేయడంతో ఆయన పార్టీకి దూరమైనట్లేనన్న ప్రచారం జరిగింది. అనుకున్నట్లే పార్టీ కార్యక్రమాలకు, గాంధీ భవన్ కు రావడమే మానేశారు కోమటిరెడ్డి.

గత అసెంబ్లీ సమావేశాల టైం లో అధికార పార్టీ నేతలు విమర్శించినా... సొంత పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని మరింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆయనపై చర్యలు తీసుకునే విషయాన్ని పట్టించుకోని హైకమాండ్.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టైమ్ లో పార్టీ ఎమ్మెల్యేలతో కాకుండా ఒక్కరే వచ్చి ఓటేయడంపై సీరియస్ అయింది. 
నిప్పు రాజేసేలా టీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని, బీజేపీతోనే సాధ్యమని కామెంట్స్ చేయడంతో పార్టీ నేతలు హైకమాండ్ కు చేరవేశారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలిసిన విషయాన్ని తెలియజేస్తూ.. ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోందని వివరించారు. అయితే ఆయన మాత్రం మునుగోడు, భువనగిరి ప్రజల అభీష్టంతోనే పార్టీ మారే విషయం ప్రకటిస్తానన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పై ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.
పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శల సంగతి అటుంచితే  సోనియా, రాహుల్ గాంధీ ల ఈడీ విచారణ పై కూడా కామెంట్ చేయడం పార్టీలో రచ్చకు దారీతీసింది. పార్టీ అధినేత్రి విషయంలో ఖండించకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడంపై హస్తం నేతలు సీరియస్ గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి పై మౌనంగా ఉన్న పీసీసీ.. ఇప్పుడు హస్తిన పెద్దలకు సీరియస్ గా కంప్లైంట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లతో పాటు గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన అంశాలను రిపోర్ట్ రూపంలో ఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ స్పందించి రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ ను రిపోర్ట్ కోరినట్లు సమాచారం. 

హైకమాండ్ స్పందనపై పార్టీలో చర్చ
గత కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న పార్టీ నేతలు.. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ప్రభుత్వ బలం అప్రజాస్వామికం ఐనప్పుడు ప్రజాబలం ముందు ఓడిపోక తప్పదని హెచ్చరించారు మాజీ ఎంపీ మల్లు రవి. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నరు హస్తిన పెద్దలు. సరైన టైమ్ లో ఆయనపై చర్యలకు సంబంధించి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని ముఖ్య నేతలు చెబుతున్నారు. హైకమాంద్ స్పందిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.