
ఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల విడుదలపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దోషుల విడుదలపై కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలతో ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల విడుదల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులు రవిచంద్రన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయ కుమార్ లను విడుదల చేయాలని సుప్రీంకోర్టు నవంబర్ 11వ తేదీన తీర్పు వెలువరించింది. జైలులో దోషుల ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నందున శిక్ష తగ్గించాలని నిర్ణయించింది. దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
రాజీవ్ హత్య కేసులో దోషుల విడుదలపై గాంధీ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రానప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా ఖండించింది. ప్రధాని హత్యకు పాల్పడిన దోషులకు శిక్ష తగ్గించి విముక్తి కల్పించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. తీర్పును సమీక్షించాలని కోరుతూ.. గతవారం కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసింది.