కుప్టి పూర్తయితేనే ..కడెం ప్రాజెక్టు సేఫ్

కుప్టి పూర్తయితేనే ..కడెం ప్రాజెక్టు సేఫ్
  • ప్రతిపాదనలు పంపిన పట్టించుకోని సర్కారు
  • కుఫ్టితో విద్యుత్ ఉత్పత్తి,లిఫ్ట్ ఇరిగేషన్ 
  • పెరిగిన అంచనా వ్యయం రూ.1260 కోట్లు 
  • కడెంకు తగ్గనున్న వరద ముప్పు 

ఆదిలాబాద్‍, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి పై ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. 2015లో కుప్టి  ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటి వరకు కనీసం భూసేకరణ కూడా చేయలేదు.  ప్రాజెక్టు నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా రూ. 1260 కోట్లకు పెరిగింది.  5. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో, ఏడు గేట్లతో ప్రాజెక్టు నిర్మించాలని అధికారులు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా మూడు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో  హైడల్ పవర్​ ప్రాజెక్టు కూడా నిర్మించాలని ప్రతిపాదించారు.   

నిర్మాణం పూర్తయితే 40 వేల ఎకరాలకు సాగునీరు..

కుఫ్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే  బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్​హత్నూర్ మండలాలతో పాటు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాలకు దాదాపు 40 వేల ఎకరాలకు సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీని నిర్మాణంతో   కుమారి, కుఫ్టి, గాంధారి, గాజిలి, రాయధారి, మల్కలపాడు గ్రామాల్లోని  దాదాపు 2500 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. 

 2015లో బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం  ప్రకటించింది.   దీని నిర్మాణం ద్వారా నిరంతరం కడెం ప్రాజెక్టుకు సాగునీటిని అందించొచ్చు.  స్వయంగా కేసీఆర్ ఇరిగేషన్​ అధికారులతో  మాట్లాడుతూ.. కుఫ్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇచ్చారు.  కానీ అవి మాటలకే పరిమితమయ్యాయి.  2018  ఎన్నికల ప్రచారంలో కూడా  కేసీఆర్​ కుఫ్టి ప్రాజెక్టు గురించి మాట్లాడారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సైతం ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రాజెక్టుకు తొందరగా నిధులు విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు

నేరడిగొండ మండలం కుప్టి గ్రామం వద్ద కడెం నదిపై రెండు కొండల మధ్య ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. గతేడాది అనుభవాల దృష్ట్యా  ప్రాజెక్టు ఎంత త్వరగా నిర్మిస్తే  కడెం ప్రాజెక్టు అంత సేఫ్‌గా ఉంటుంది.  గతేడాది వర్షాలు, వరదలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఏర్పడింది.  కడెం ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యం ఉండగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తడంతో  అధికారులు చేతులెత్తేశారు.  దేవుడిపైనే భారం వేసి వెళ్లిపోయారు. అదే కుఫ్టి ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఇంతటి ముప్పు వచ్చేది కాదని ఇరిగేషన్​నిపుణులు అంటున్నారు.  ప్రాజెక్టు పూర్తయితే రెండు కాలాలకు నీటిని అందించవచ్చని   కుంటాల జలపాతానికి సైతం ఏడాది పాటు నీటిని ఇవ్వొచ్చని అధికారులు అంటున్నారు.  

ప్రతిపాదనలు పంపించాం 

కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.  సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1260 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతేనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. 
రాథోడ్ విఠల్, ఈఈ ఇరిగేషన్