మళ్లీ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి

మళ్లీ కోరలు చాస్తున్న  కరోనా మహమ్మారి

ప్రపంచాన్ని అతలాకుతలం చేసి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. అగ్రదేశాలు సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయడమే గాకుండా.. లక్షల కుటుంబాలను కడు పేదరికంలోకి నెట్టిన ఈ భూతం వ్యాప్తి మళ్లీ మొదలైందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ వైరస్​వ్యాప్తి చెందుతున్నది? ఇండియాలో వస్తున్న పాజిటివ్​ కేసుల్లో బయటపడుతున్న వైరస్ ​ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దాంతో ప్రమాదం ఎంత? అనే సందేహాలు అనేకం వ్యక్తమవుతున్నాయి. 

ప్రస్తుతం చైనాలో కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ​వేరియంట్​ అయిన బీఎఫ్ 7 వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. డబ్ల్యూహెచ్​వో ప్రకారం.. ఓమిక్రాన్ వేరియంట్లలో 540 రకాలు ఉన్నాయి. అయితే అందులో కేవలం 5 రకాల వేరియంట్లే ప్రమాదకరమైనవి. అవి బీఏ 2.75, బీక్యూ 1, ఎక్స్​బీబీ, బీఏ 2.30.2, బీఏ 5. ఈ కేటగిరీలో బీఎఫ్​7 లేదు. ప్రస్తుతం ఎక్కువ వ్యాప్తిలో ఉన్న కొవిడ్​వేరియంట్లను విశ్లేషిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న 80 శాతం కేసులకు బీఏ 5, బీఏ 2 వర్గానికి చెందిన ఒమిక్రాన్​కేసులే కారణం. చైనాలో డిసెంబర్ లో సేకరించిన నమూనాల పరంగా చూస్తే 99 శాతం  కేసులకు ఒమిక్రాన్ వేరియంటే కారణం. అందులో బీఎఫ్​7, బీఏ 5.2 సబ్​వేరియంట్లకు చెందిన కేసులు 70 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఇండియాలో వస్తున్న కేసులను విశ్లేషిస్తే.. 80 శాతం కేసుల్లో బీఏ 2.75, బీక్యూ 1, ఎక్స్​బీబీ సబ్​వేరియంట్లే కారణం. వీటి వ్యాప్తి చైనాలో 30శాతం లోపే కావడం గమనార్హం. 

వ్యాక్సినేషన్ ప్రక్రియ

కరోనా వ్యాప్తి, దాని తీవ్రత వ్యాక్సినేషన్ ​ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను గమనిస్తే సగటున 60 శాతంపైనే పూర్తయింది. దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్​ను ప్రారంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాలు వ్యాక్సినేషన్​ ప్రాథమిక దశలో ఉంటే, 59 దేశాలు బూస్టర్​ డోసులు వేస్తున్నాయి. 80 దేశాలు సెకండ్​బూస్టర్​ డోసులు వేస్తున్నాయి. 29 దేశాల్లో వ్యాక్సినేషన్​స్థిరంగా ఉంటే, 38 దేశాలు మందగమనంలో సాగుతున్నాయి. మారిషస్​ దేశం వ్యాక్సినేషన్ ​రేటు సగటున రోజుకు 0.55 శాతం జనాభాతో ప్రథమ స్థానంలో ఉన్నది. మన దేశంలో మాత్రం18 ఏండ్లు పైబడిన వారు 90 శాతానికిపైగా రెండు డోసులు తీసుకుంటే, కేవలం 25 శాతం మాత్రమే మూడు డోసులు తీసుకున్నారు. ఇంకా బూస్టర్ డోసు తీసుకోని వారు70 కోట్ల పైనే ఉన్నారు. వ్యాక్సినేషన్ లో 56 శాతం దేశాలు రెండు డోసుల విధానాన్ని అమలు చేస్తే, చైనా 3 డోసుల విధానం అమలు చేస్తున్నది. ఇప్పటికీ ఆ దేశంలో 80 ఏండ్లు పైబడిన75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. పైగా ఎక్కువగా పాక్షికంగా డైల్యూట్​ చేసిన వైరస్ ​ఆధారిత వ్యాక్సిన్లు వాడుతున్నారు. ఇతర దేశాల వ్యాక్సిన్లు తీసుకోలేదు. వారి వ్యాక్సినేషన్​ రేట్​ కూడా నెమ్మదిగా ఉంది. ఇటీవల వ్యాక్సినేషన్ 6 రెట్లు పెంచినా ఇప్పటికీ రోజు వారి రేటు కోటి దాటకపోవడం గమనార్హం. వ్యాక్సినేషన్​లో చైనా ప్రపంచ సగటు కంటే వెనకబడి ఉండగా, చైనా సగటు వ్యాక్సినేషన్ ధర మన దేశం కంటే10 రెట్లు ఎక్కువ. అందుకే అక్కడ వ్యాప్తి ఎక్కువగా ఉన్నది.

మనదేశంపై ప్రభావం

మన దేశంపై కరోనా ప్రభావం మళ్లీ ఎలా ఉండబోతోందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అయితే ఈ విషయంలో మనం భయాందోళన చెందకుండా, సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇదే చెబుతున్నది. డెల్టా వేవ్​తర్వాత మన దగ్గర రెండు వ్యాక్సిన్​డోసుల పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్​వేవ్​లో బూస్టర్​డోస్ ​అందుబాటులోకి వచ్చింది. వీటితో భారతీయులకు విలక్షణమైన హైబ్రిడ్​ఇమ్యూనిటీ ఏర్పడింది. అందులోనూ చైనాలో ప్రబలుతున్న ఒమిక్రాన్​వేరియంట్​ను ఇప్పటికే మన చూశాం. పైగా దేశంలో 90 శాతం మందికి యాంటీ బాడీలు ఏర్పడ్డాయి. కాబట్టి మన మీద కరోనా ప్రభావం చాలా తక్కువే అని చెప్పొచ్చు. కాగా కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందేమో! అక్కడ జీరో కొవిడ్​ పాలసీ అమలు, డిసెంబర్​7 తర్వాత 
నిబంధనలు అన్నీ ఒకేసారి సడలించడం, అందరికీ వ్యాక్సిన్లు వెయ్యలేకపోవడం, ఆ దేశ వ్యాక్సిన్​ పనితీరుపై ఉన్న సందేహాలు చైనాలో వైరస్​ మరింత ప్రబలే అవకాశాన్ని బలపరుస్తున్నాయి. బీజింగ్ సంస్థ లెక్కల ప్రకారం జనవరిలో ఒక్క బీజింగ్ లోనే 23 లక్షల కేసులు,2 లక్షల మంది ఆసుపత్రుల్లో, 25, వేల మంది ఐసీయూ వార్డుల్లో చేరొచ్చని అంచనా. బీజింగ్ ఐసీయూ బెడ్ల సామర్థ్యం కంటే ఇది 18 రెట్లు ఎక్కువ. మన వద్ద కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అట్లని జాగ్రత్తలు మరువొద్దు. పౌరుడి నుంచి ప్రభుత్వం వరకు ప్రతి ఒక్కరు ముందస్తు జాగరూకతతో వ్యవహరిస్తేనే.. కరోనా ముప్పు నుంచి నష్టం లేకుండా భయటపడతాం.

రోగ నిరోధక శక్తి..

సీరో సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సగటున 70 శాతం మంది యాంటీబాడీస్​ ఉంటే, మన దేశంలో 90 శాతం పైగా ఉన్నాయి. అదే చైనాలో వ్యాక్సిన్లు మినహాయిస్తే అది 20 శాతం లోపే. ప్రస్తుత వ్యాక్సిన్ల పనితీరును విశ్లేషిస్తే.. వాటి సగటు రక్షణ 6 నెలలుగా ఉంది. బూస్టర్ డోసుతో 6 నెలలు పెరుగుతుంది. ఇది జబ్బు తీవ్రను ఎదుర్కొనే శక్తి మాత్రమే. కండరాల ద్వారా ఇచ్చేవి ఇన్​ఫెక్షన్​ను ఆపలేవు. ముక్కు ద్వారా ఇచ్చేవి మాత్రమే ఇన్​ఫెక్షన్​ను ఆపగలవు. ఇప్పుడున్న వ్యాక్సిన్లన్నీ వూహాన్ ​మాతృకతో తయారు చేసినవే. ఫైజర్, మొడర్నా వ్యాక్సిన్లు  మాత్రమే  ఒమిక్రాన్​ఆధారితంగా తయారు చేయబడి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు క్లినికల్ ​పరీక్షల దశలో ఉండి ఒమిక్రాన్​మీద తయారు చేసేవి పది మాత్రమే ఉన్నాయి. మన దేశంలో భారత్ బయోటెక్ తయారు చేసింది ప్రీ క్లినికల్​దశలో ఉన్నది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దాన్ని మూడో డోసుగా వాడాలని భారత ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. 

వేరియంట్ల లక్షణాలు, పరీక్షలు

ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్​ వేరియంట్లన్నీ చాలా వరకు బీఏ 2, బీఏ 5కు చెందినవే. బీఏ 2 కు చెందిన ఎక్స్​బీబీ, బీఏ 2.75 వేరియంట్లలో S-gene drop out ఉండదు కాబట్టి ఆర్టీపీసీఆర్​పరీక్ష స్థాయిలో దాన్ని కనుక్కోలేం. బీఏ 5 కు చెందిన బీఎఫ్​7, బీక్యూ1లలో S-gene drop out ఉంటుంది. దాన్ని ఆర్టీపీసీఆర్​స్థాయిలో గుర్తించవచ్చు. ఒమిక్రాన్​ వేరియంట్​లో అన్ని రకాల తీవ్రతలు ఉన్నప్పటికీ.. తీవ్రమైన జబ్బు కలిగించే డెల్టా, బీటాల కంటే తక్కువే. లక్షణాల పరంగా చూస్తే, వాసనలేకపోవడం క్రమంగా తగ్గుతూ వచ్చి..  ఫ్లూ లక్షణాలు క్రమంగా పెరుగుతూ ఉంటున్నాయి. గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు, తలనొప్పి లాంటివి ఒమిక్రాన్ లక్షణాలు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అన్ని వేరియంట్లు ఒమిక్రాన్​కు చెందినవే కావడంతో లక్షణాలు కూడా దాదాపు అవే ఉంటాయి.
- డా. కిరణ్​ మాదల,రాష్ట్ర సహాధ్యక్షుడు, మెడికల్​ & హెల్త్ టీఎస్​సీపీఎస్​ ఉద్యోగుల సంఘం