ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు:  వనపర్తికి కొత్తగా మంజూరైన సబ్ రిజిస్ట్రార్‌‌ కార్యాలయాన్ని పట్టణంలో ఏర్పాటు చేయాలని  కౌన్సిలర్లు  డిమాండ్ చేశారు.  బుధవారం 13 మంది కౌన్సిలర్లు  మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మంత్రి నిరంజన్‌ రెడ్డి పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో నాగవరం శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్ పక్కన ఉన్న గుట్టలో వనపర్తి సబ్ రిజిస్ట్రార్‌‌ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సరికాదన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చి వెంచర్ అభివృద్ధి కోసమే అక్కడ శంకుస్థాపన చేయించుకున్నారని ఆరోపించారు.  వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని  కమిషనర్‌‌ను కోరారు.  అయితే నాలుగేళ్ల పదవీకాలం నిండిన తర్వాతే ఆ అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో మున్సిపల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని, అక్కడ ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ప్రస్తుతం  అద్దె భవనంలో నడుస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీస్‌ను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలలోకి మార్చాలని  డిమాండ్ చేశారు. 

రూ. 4,158 కోట్లతో రుణ ప్రణాళిక

గద్వాల, వెలుగు:  గద్వాల జిల్లా 2023 -–24 వార్షిక రుణ ప్రణాళికను రూ. 4,158.87 కోట్లుగా నిర్ణయించారు.  గురువారం కలెక్టర్‌‌ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో జడ్పీ చైర్‌‌ పర్సన్‌ సరిత, కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎమ్మెల్యే అబ్రహం రుణ ప్రణాళికను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ  రూ. 2,647.80 కోట్లు క్రాప్ లోన్లు , రూ. 429,96 కోట్లు లాంగ్ టర్మ్ లోన్లు , రూ. 474,47 కోట్లు ఎమ్ఎస్ఎంఈ, రూ. అగ్రికల్చర్‌‌కు రూ. 96.06 కోట్లు ఇవ్వాలని నిర్దేశించామన్నారు.  బ్యాంకర్లు టార్గెట్ మేరకు లోన్లు ఇవ్వాలని ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఎల్డీఎం అయ్యప్ప రెడ్డి, ఆర్‌‌బీఐ ఆఫీసర్ తేజ్ దీప్, నాబార్డ్ ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఫోర్‌‌ వీలర్ ఉంటే ఇల్లు ఇవ్వొద్దు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల లిస్టును రెండు వారాల్లో రెడీ చేయాలని, ఫోర్ వీలర్ ఉంటే లిస్టు నుంచి పేరు తొలగించాలని  కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం   లబ్ధిదారుల ఎంపికపై  నిర్వహించిన మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ  గోను పాడు, క్యాతూరు, గద్వాలలో 560 పూర్తయ్యాయని, 716 ఇండ్లు పురోగతి ఉన్నాయని. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లు పది టీములుగా ఏర్పడి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.  భూమి, ఫోర్ వీలర్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఇల్లు ఇవ్వొద్దన్నారు.  అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, ఆర్డీవో రాములు, పీఆర్‌‌ ఈఈ శివశంకర్, డీఈ రవీందర్  పాల్గొన్నారు.


విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చండి మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నాయకుల వినతి

వనపర్తి, వెలుగు:  వనపర్తి మున్సిపాలిటీలోని విలీన గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.  బుధవారం మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డుతో పాటు అనేక వార్డుల్లో తాగునీటి సమస్య ఉన్నా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయారు.  కొత్తగా విలీనమైన నర్సింగాయపల్లిలో సమస్య మరింత ఎక్కువగా ఉందన్నారు.   వనపర్తి రోడ్ల విస్తరణకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకోకుండా మున్సిపాలిటీ నిధులను వాడుతూ..  వార్డుల అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు.   బీజేపీ నాయకులు పద్మ పరశురాం, రామ్మోహన్, కొమ్ము సామేలు,  కుమార్, రాము,  రాయన్న సాగర్  పాల్గొన్నారు.

పామ్ ఆయిల్ ట్యాంకర్‌‌ను ఢీకొన్న కంటైనర్ 
మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధం

కొత్తకోట,వెలుగు : రోడ్డు పక్కన ఆగి ఉన్న  పామ్ ఆయిల్ ట్యాంకర్‌‌ను కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి.   ఎస్సై నాగ శేఖర్ రెడ్డి  వివరాల ప్రకారం...  హైదరాబాద్‌కు చెందిన ట్యాంకర్ యజమాని మహమ్మద్ మెయిన్ మంగళవారం రాత్రి  షాద్‌నగర్‌‌ నుంచి పామ్ ఆయిల్‌ను  లోడ్ చేసుకొని కర్నూల్‌ వెళ్తున్నాడు. కొత్తకోట పట్టణంలోని దర్గా సమీపంలో  టైర్ పంక్చర్‌‌ కావడంతో పక్కన నిలిపాడు. అర్ధరాత్రి 12:30 గంటలకు అదే రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన కంటైనర్‌‌ వెనక నుంచి ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు దూరంగా పరుగులు తీశారు.  ఫామ్ ఆయిల్ ట్యాంకర్‌‌ యజమాని మహమ్మద్ మెయిన్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


కిష్టారెడ్డిపేటలో ఎండోమెంట్ ల్యాండ్ స్వాధీనం

పెబ్బేరు, వెలుగు: కబ్జాకు గురైన వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని  ఎండోమెంట్​ భూమిని అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.  ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం పేరిట సర్వే నంబర్​ 354లో 5.33 ఎకరాలు, 337లో 2.26 ఎకరాల భూమి ఉంది.  పక్కనే పట్టా పొలం ఉన్న పెబ్బేరుకు చెందిన ఓ రియల్​ఎస్టేట్​వ్యాపారి సర్వే నంబర్​337లోని భూమిని ప్లాట్లు చేసి అమ్మేశాడు.  స్థానికుల ఫిర్యాదు మేరకు గత నెల 18న వనపర్తి ఆలయాల గ్రూపు మేనేజర్లు వినయ్​రెడ్డి, మధుసూదన్​రెడ్డి, ఈవో  శేఖర్​గౌడ్ జిల్లా సర్వే అధికారులతో కలిసి సర్వే చేసి కబ్జా అయినట్లు గుర్తించారు. అయితే  కొందరు వ్యక్తులు నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఈ నెల  7న సర్వే చేస్తామని చెప్పి.. నోటీసులు ఇచ్చారు.  ఇందులోభాగంగానే బుధవారం పోలీసుల సహకారంతో సర్వే  చేసి హద్దు రాళ్లను పాతారు. ఈ  కార్యక్రమంలో వనపర్తి ఎండోమెంట్‌ ఆఫీస్​ సూపరింటెండెంట్​ రఘునాథ్​,  సర్వేయర్లు భాస్కర్​, పెన్నయ్యలు, టీపీఎస్​ మనూజ పాల్గొన్నారు.