హార్మూజ్ జలసంధి చుట్టూ జరుగుతున్న యుద్ధం ఎల్ఎన్జీ, పెట్రోలియం రవాణాను దెబ్బతీసింది. ముఖ్యంగా భారతదేశానికి ఎల్ఎన్జీ కొరత తక్షణ వ్యవసాయ సమస్యగా మారింది. యూరియా ఉత్పత్తి ఎల్ఎన్జీపై ఆధారపడి ఉంటుంది. డిఎపి 60 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. పొటాష్ 100 శాతం దిగుమతి అవుతుంది. భారతదేశం 2022లో ఎరువుల దిగుమతులపై 7 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేసింది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో యూరియా ధర టన్నుకు సుమారు 600 డాలర్లకు, డిఎపి 750–770 డాలర్లకు పెరిగింది. ఈ పెరుగుదలలోని ప్రతి రూపాయి భారం మొదట్లో ఖజానాపైన తరువాత రైతుల మీద పడుతుంది. దేశ బడ్జెట్‌లో రైతులకు ఇచ్చే రెండు సబ్సిడీ పథకాలు ఇంకా భారం కానున్నాయి. రసాయన ఎరువుల మీద నేరుగా అందించే నగదు సబ్సిడీలు, రసాయన ఎరువుల కొరత తీవ్రం కానున్నది. ఇరాన్ యుద్ధం వలన భారత వ్యవసాయం మీద, రైతుల మీద పెనుభారం పడబోతున్నది. వచ్చే ఖరీఫ్ కాలానికి అవసరమైన రసాయన ఎరువులందే అవకాశం లేదు.
రసాయన ఎరువుల కొరత కనీసం 50 శాతం ఉండే అవకాశం ఉన్నది. ఈ యుద్ధం వలన ఎరువుల సరఫరా, డీజిల్ ధరలు, వంట నూనె రవాణా ఛార్జీలు, వ్యవసాయ దిగుమతులకు అంతరాయం రూపంలో నాలుగు సంక్షోభాలు ఒకేసారి వచ్చిపడ్డాయి. రానున్న ఎరువుల కొరత వల్ల వ్యవసాయ ఉత్పత్తి సంక్షోభంలో పడే అవకాశం ఉన్నది. దేశీయ యూరియా ఉత్పత్తి కేవలం 65 శాతం అని ప్రభుత్వం చెబుతున్నది. మిగిలిన 35 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఈదిగుమతులు ఇప్పుడు రాకపోవచ్చు. అదనంగా 65 శాతం దేశీయ రసాయన ఎరువుల ఉత్పత్తి కూడా పూర్తిగా దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ లేదా నాఫ్తాపైనే ఆధారపడి ఉంది. గ్యాస్ సంక్షోభం ఇప్పటికే చూస్తున్నాం. యుద్ధం కొనసాగితే ఇది ఇంకా తీవ్రం అవుతుంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా కృత్రిమ రసాయన ఎరువుల ఉత్పత్తి సాధారణ స్థితికి చేరడానికి కనీసం ఒక సంవత్సరం పట్టవచ్చు. ఈ రకంగా చూస్తే 50 శాతానికి పైగా యూరియా కొరత ముప్పును కచ్చితంగా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పూర్తిగా కృత్రిమ రసాయన ఎరువుల దిగుమతుల మీద ఆధారపడిన ఆధునిక వ్యవసాయం ఈ సంక్షోభంలోంచి బయటకు రావాలంటే సహజ, జీవ ఎరువులను వాడకతప్పదు.
శ్రీలంక అనుభవం ఒక హెచ్చరిక
కరోనా మహమ్మారి తదనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో ఎగుమతుల మీద ఆధారపడిన చిన్న చిన్న దేశాలు సంక్షోభంలో పడ్డాయి. మన దేశంలోలాగ శ్రీలంక కూడా కృత్రిమ రసాయన ఎరువుల మీద ఆధారపడింది. అవి లేకుంటే వ్యవసాయం చేయలేని పరిస్థితికి చేరుకుంది. 2021లో ఆదాయం లేక దివాలా తీసే పరిస్థితిలో ఉన్న విదేశీ మారక నగదు కాపాడుకోవడానికి కృత్రిమ ఎరువుల దిగుమతిని నిషేధించింది. అయితే ఈ విషయం నేరుగా చెప్పకుండా.. సేంద్రియ వ్యవసాయంవైపు మరలుతున్నట్లు ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఎలాంటి ప్రణాళికగానీ, ప్రత్యామ్నాయాలుగానీ లేకుండా రాత్రికి రాత్రే కృత్రిమ ఎరువులను నిషేధించింది. రైతులకు ఇది అశనిపాతంగా మారింది. రైతులు కృత్రిమ ఎరువులు అవసరమైన పంటల వైపు తమ దృష్టి తగ్గించారు. నేలలకు కృత్రిమ సారం లేక ఫలితంగా దిగుబడులు కుప్పకూలాయి. క్రమంగా ఇది ఆహార సంక్షోభంగా మారింది. శ్రీలంక సమాజాన్ని ఒక కుడుపు కుదిపింది. ఈ విపత్తుకు సేంద్రియ వ్యవసాయం కారణం కాదు.. కేవలం సరైన సన్నాహాలు, వ్యూహాలు లేకపోవడం వల్లే ఇది సంభవించింది. ఇప్పుడు భారతదేశం కూడా ఇలాంటి కృత్రిమ రసాయన ఎరువుల సరఫరా ఒత్తిడినే ఎదుర్కొంటోంది. మన ప్రభుత్వం దగ్గర విదేశీ మారక నగదు ఉన్నా సరఫరా చేసేవారు లేరు. రాబోతున్న సంక్షోభ నివారణకు మన ప్రభుత్వం ముందుగానే సన్నాహక చర్యలు తీసుకోవాలి. ఆ సన్నాహాలు సంక్షోభం ముదిరిన తర్వాత కాకుండా ముందే ప్రారంభం కావాలి.
మిషన్ కంపోస్ట్ ఇండియా నిర్మించాలి
భారతదేశం రసాయన ఎరువుల రాయితీలకు ఏటా రూ.1.68 లక్షల కోట్లు , సేంద్రియ ఎరువుల ప్రోత్సాహానికి రూ.150 కోట్లు కేటాయిస్తుంది. ఇది వంద శాతంలో పదోవంతు కన్నా తక్కువ. రెండింటి మధ్య తేడా ద్వారా ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించింది. కృత్రిమ ఎరువులకు పూర్తి ఆర్థిక, విధాన సహకారం. సహజ, జీవ ఎరువులను గాలికి వదిలేసింది. ఈ సంక్షోభ స్థితిలో ఇది మారాలి. సహజ, జీవ ఎరువులకు ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం, వ్యవసాయ సంస్థాగత వ్యవస్థ దన్ను అవసరం ఇప్పుడు ఏర్పడింది. శ్రీలంక ముందుగా ఆలోచించలేదు. మన దేశం అలోచించి, తగిన వ్యూహాలు రచించడానికి, పథకాలు ప్రవేశపెట్టడానికి వానాకాలం లోపల ఒక 2 నుంచి 3 నెలల అవకాశం ఉన్నది. సహజ, జీవ ఎరువుల లభ్యత, ఉత్పత్తి, విస్తృతంగా చేస్తే ఎండాకాలం సంక్షోభాన్ని కూడా నివారించవచ్చు. కృత్రిమ రసాయన ఎరువుల దిగుమతుల మీద ఆధారపడిన పరిస్థితి నుంచి క్రమబద్ధంగా బయటకు రావచ్చు. సేంద్రియ ఎరువులతో కూడిన ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశం.
సహజ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి
మనకు అందుబాటులో ఉన్నా వినియోగించని వనరుల పట్ల, వాటి లభ్యత గురించి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం ఆక్షేపణీయం. భారతదేశంలోని పాడి పశువుల వల్ల ఏటా 160 కోట్ల టన్నులకు పైగా పేడ వస్తుంది. అందులో కనీసం 57 కోట్ల టన్నులను పునర్వినియోగించవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 62 కోట్ల టన్నుల మునిసిపల్ ఘన వ్యర్థాలను పారవేస్తాం. అందులో దాదాపు సగం సేంద్రీయమైనది.
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం ఇది ఏటా 54 లక్షల టన్నుల సిటీ కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు కేవలం 2 లక్షల టన్నులు వాడుతున్నాం. 189 లక్షల టన్నుల స్థాపిత సామర్థ్యంతో పనిచేస్తున్న 700 కంపోస్ట్ ప్లాంట్లు వినియోగ స్థాయి కంటే చాలా తక్కువగా నడుస్తున్నాయి. కొన్ని పద్ధతులను ఉపయోగించి నాలుగు నుంచి ఎనిమిది వారాలలో కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అంటే, మొత్తం 62 కోట్ల టన్నుల వ్యర్ధాలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. ముడి పదార్థాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ, కావాల్సింది ప్రభుత్వ సంకల్పం, నిధులు కేటాయింపు. సహజ ఎరువుల వైపు మళ్లడానికి ఇప్పటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ఒక పటిష్టమైన జాతీయ కంపోస్ట్ మిషన్ ద్వారా ఇప్పటికే ఉన్న ప్లాంట్‌లకు వినియోగ లక్ష్యాలను నిర్దేశించాలి. ఆవు పేడ ఎగుమతిని నిషేధించాలి. కంపోస్ట్‌ను రాయితీ ఇన్‌పుట్‌గా స్థాపించాలి. కృత్రిమ ఎరువుల సబ్సిడీ దిశను మార్చాలి. తద్వారా రైతులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాలి. రాబోయే ఖరీఫ్ కాలం కంటే ముందే దీనిని కచ్చితంగా ప్రారంభించాలి. అత్యవసరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాలి.
ఇప్పుడు ఏం జరగాలి
సరఫరా ఒత్తిడి, ప్రత్యామ్నాయాల గురించి రైతులకు కేవీకేలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా తక్షణమే నిజాయితీతో కూడిన సమాచారం అందించాలి. రైతులు తమ ఎరువులను తామే తయారు చేసుకునే పద్దతుల మీద దృష్టి పెట్టాలి. పచ్చిరొట్ట ఎరువులు, నత్రజనిని స్థిరీకరించే పంటలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర ద్వారా పంటల వైవిధ్యీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విస్తరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా జాతీయ కంపోస్ట్ మిషన్‌ను తక్షణమే నామమాత్ర స్థాయి నుంచి కీలకస్థాయికి పెంచాలి. ఈ మిషన్ విజయవంతం కావాలంటే కేవలం ప్రభుత్వ చొరవ సరిపోదు. రైతు సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, గ్రామ పంచాయతీలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.
డా. దొంతి నరసింహారెడ్డి
పాలసీ అనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
