దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ మిషన్ సక్సెస్
మూడు శాటిలైట్లను నింగికి చేర్చిన రాకెట్
ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలకు నాంది పలికిన
హైదరాబాదీ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్
శ్రీహరికోట (ఏపీ) : దేశంలోనే తొలి ప్రైవేట్ సెక్టార్ రాకెట్ విజయవంతంగా నింగికి దూసుకెళ్లింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం చేపట్టిన విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రయోగంతో హైదరాబాదీ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సరి కొత్త చరిత్ర సృష్టించింది. షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన రాకెట్ లాంచర్ నుంచి ఉదయం11.30 గంటలకు విక్రమ్–ఎస్ నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసింది. అనుకున్న ప్రకారమే.. రాకెట్ ప్రయోగించిన 2.3 నిమిషాలకు 81.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. అక్కడ ‘లో ఇన్ క్లినేషన్ ఆర్బిట్’లోకి మొత్తం 83 కిలోల బరువున్న మూడు శాటిలైట్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 4.84 నిమిషాలకు శ్రీహరికోటకు115 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కూలిపోయింది. షార్‌లోని మిషన్ కంట్రోల్ రూం నుంచి విక్రమ్-–ఎస్ ప్రయోగాన్ని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా, సైంటిస్టులు వీక్షించారు. ఈ మిషన్ కు స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ చందన డైరెక్టర్ గా వ్యవహరించారు. మిషన్ అన్ని రకాలుగా సక్సెస్ అయిందని ఆయన ప్రకటించారు. టెలిమెట్రీ, ట్రాకింగ్, జీపీఎస్, ఆన్ బోర్డ్ కెమెరా, డేటా అక్విజిషన్, పవర్ సిస్టంలు అన్నీ బాగా పని చేశాయని వెల్లడించారు. కాగా, విక్రమ్-–ఎస్ అనేది సౌండింగ్ (రీసెర్చ్) రాకెట్. స్కైరూట్ సంస్థ ఫ్యూచర్ మిషన్లకు అవసరమయ్యే టెక్నాలజీల్లో 80% టెక్నాలజీలను ఈ మిషన్ లో విజయవంతంగా టెస్ట్ చేశారు. రాకెట్ స్పిన్ స్థిరత్వం కోసం 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేసిన సాలిడ్ థ్రస్టర్లను ఉపయోగించారు. కోర్ స్టేజీని మొత్తం కార్బన్ ఫైబర్ తోనే తయారు చేశారు.
ప్రైవేట్ రాకెట్లకు రెండేండ్ల కింద బీజం
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ సెక్టార్ ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం 2020లో చర్యలు చేపట్టింది. ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలకు అనుమతులు, నిర్వహణ కోసం నోడల్ ఏజెన్సీగా ఇన్ స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు దాదాపు 100 వరకూ స్టార్టప్ ల నుంచి అప్లికేషన్లు రాగా.. ఇప్పటివరకూ అన్ని రకాలుగా అర్హతలు సాధించిన ఐదు స్టార్టప్ లు ఫైనలైజ్ అయ్యాయి. వీటిలో అన్నింటికంటే ముందుగా స్కైరూట్ కంపెనీ మొదటి ప్రయోగం చేపట్టింది.
ఇది చరిత్రాత్మక రోజు : ప్రధాని మోడీ
విక్రమ్-–ఎస్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం దేశ అంతరిక్ష కార్యక్రమాల్లో చరిత్రాత్మకమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్పేస్ సెక్టార్ లో 2020లో కేంద్రం ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ ను అందిపుచ్చుకున్న యువత అద్భుత టాలెంట్ ను ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో, ఇన్ స్పేస్, స్కైరూట్ సంస్థలను అభినందిస్తూ ఆయన ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు.
ప్రత్యేకతలు ఇవే..
పొడవు: 6 మీటర్లు
వెడల్పు: 0.375 మీటర్లు
మొత్తం బరువు: 545 కిలోలు
గరిష్ట వేగం: హైపర్ సోనిక్ – మ్యాక్ 5 (ధ్వని కంటే 5 రెట్ల స్పీడ్)
పేలోడ్ కెపాసిటీ: 83 కిలోలు
(100 కి.మీ. ఎత్తుకు చేర్చగలదు)
ప్రస్తుత మిషన్‌లో పంపిన పేలోడ్లు:3 వీటిలో 2.5 కిలోల ఫన్ శాట్‌ను చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ స్టార్టప్ ఆధ్వర్యంలో ఇండియా, సింగపూర్, సీషెల్స్, యూఎస్, ఇండోనేషియా స్కూల్ స్టూడెంట్లు తయారు చేశారు. మిగతా వాటిలో ఏపీకి చెందిన ఎన్–స్పేస్ టెక్ స్టార్టప్, ఆర్మేనియాకు చెందిన బజూమ్ క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్ శాటిలైట్లు ఉన్నాయి.
