బడ్జెట్ పై బల్దియా సైలెన్స్​

బడ్జెట్ పై బల్దియా సైలెన్స్​
  • ప్రతిపాదనలు పంపినా సమావేశం కాని స్టాండింగ్​ కమిటీ
  • షెడ్యూల్​ ప్రకారం ఈ నెల10న ఆమోదించాలి
  • ఫిబ్రవరి10 వరకు ప్రస్తుత పాలకమండలి గడువు
  • కొత్త పాలకమండలికి అవకాశం కల్పిస్తారా అనేది సస్పెన్స్​

హైదరాబాద్, వెలుగువచ్చే ఏడాది బల్దియా బ‌డ్జెట్ (2021––22)పై  ప్రస్తుత పాలకమండలి సైలెంట్​గా ఉంటుంది.  గత నవంబర్12న స్టాండింగ్​కమిటీ మీటింగ్​లో రూ.5,600 కోట్లతో జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను ప్రతిపాదించి స్టాండింగ్ ​కమిటీకి అందజేసింది. రూల్స్​ ప్రకారం ఈనెల10న కమిటీ ఆమోదించి15 లోపు కౌన్సిల్‌ ముందుంచాలి. దీనిపై వచ్చే జనవరి10లోగా జనరల్ ​బాడీలో సమీక్షించి, ఫిబ్రవరి20 లోపు బల్దియా ఆమోదం తెలపాలి. అది మార్చి7 న ఆమోదం కోసం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. కాగా బడ్జెట్ ​ప్రతిపాదించినా, ఆ తర్వాత కొనసాగాల్సిన  ప్రక్రియ ముందుకు సాగడంలేదు. పాలక మండలికి ఇదే ఆఖరు బడ్జెట్.​  ఇది ముందుగానే అనుకున్నా ఆ బడ్జెట్​ని ప్రవేశపెడతారా? లేక కొత్త పాలకమండలికి అవకాశం కల్పిస్తారా? అనేది  ప్రస్తుతం చర్చగా మారింది. గ్రేటర్​ఎన్నికల తర్వాత స్టాండింగ్​కమిటీ మీటింగ్​నిర్వహించలేదు. ఎన్నికల కోడ్​ ముగిసిన తర్వాతైనా ఏర్పాటుచేస్తారని అనుకుంటే , కోడ్​ముగిసి వారం రోజులైనా బడ్జెట్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనబడడం లేదు. బడ్జెట్‌ ప్రతిపాదనలు మార్చి వరకు ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. ఆ లోపు స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌లో ఆమోదించినా సరిపోతుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తారా..? లేదా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతోనే..

జీహెచ్​ఎంసీ ఎన్నికల పూర్తయి10 రోజులైంది. అయితే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు 2021 ఫిబ్రవరి 10వరకు వెయిట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పాలక మండలి గడువు అప్పటివరకు ఉండడంతో ఇదే పాలక మండలి కొనసాగే అవకాశం ఉంది. అధికార పార్టీకి అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో కొత్త పాలకమండలి ఏర్పాటును పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.  ఒకవేళ వందకుపైగా కార్పొరేటర్​సీట్లు వచ్చుంటే ఈ పాటికి కొత్త పాలకమండలి కొలువు దీరేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గడువు వరకు అన్ని అధికారాలు

ప్రస్తుత పాలకమండలితో స్టాండింగ్‌ కమిటీ, కౌన్సిల్‌ సమావేశాలు యథాతథంగా కొనసాగించే వెసులుబాటు జీహెచ్​ఎంసీ యాక్ట్​లో ఉందని అధికారులు చెబుతున్నారు. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ని ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు ఉండడంతో పాటు గడువు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా అధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రస్తుత కార్పొరేటర్లే పాల్గొనాలని అంటున్నారు. ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన వారు కూడా గడువు వరకు కార్పొరేటర్​గానే ఉంటారన్నారు. ఫిబ్రవరి 10వరకు అధికారిక కార్యక్రమాల్లో ఇప్పుడున్న కార్పొరేటర్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజులు కార్పొరేటర్ గా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఓడిపోవడంతో ఆ బాధలో ఉండగా, సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడంలేదని తెలుస్తుంది.