
హైదరాబాద్: సీపీఐ అగ్ర నేత, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పేదలు, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని మగ్దుం భవన్ లో ఆదివారం (ఆగస్టు24) సురవరంసుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి రాజకీయాలనుంచి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వరకు రాజీపడని సిద్దాంతం కొరకు పనిచేసిన నేత సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారవు,శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు సురవరం భౌతిక కాయానికి నివాళుర్పించారు.
మరోవైపు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం సీపీఎం కార్యాలయం మగ్దుంభవన్ లో ఉంచారు.
పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న సురవరం అభిమానులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత సురవరం అంతిమ యాత్ర నిర్వహించనున్నారు.