
న్యూఢిల్లీ, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోసం ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం రెండు రోజులపాటు ఆయన పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆదివారం ఆయన తమిళనాడుకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే, మిత్రపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులను కలవనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని వారిని కోరనున్నారు.
అలాగే సోమవారం సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి యూపీలో పర్యటిస్తారు. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు, ఇతర ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. అక్కడి రాజకీయ నేతలను, పార్లమెంటు సభ్యులను కలిసి విస్తృత ప్రచారం చేసి, మద్దతు కూడగట్టుకోనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ముందు ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఇండియా కూటమి ఐక్యతను చాటిచెప్పడంలో ఈ పర్యటనలు దోహదపడనున్నాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెంట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల గ్రూప్ కన్వీనర్ డాక్టర్ మల్లు రవి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్ కూడా పర్యటించనున్నారు.