
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తోందని, అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వ్యక్తిని గెలిపించుకొని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేతలంతా కలిసి రావాలని ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. ఇందులో ఎన్డీయే ఎంపీలు సైతం భాగస్వాములై జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారనే నమ్మకం ఉందన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ ప్రజాస్వామ్య విలువలను నీరుగార్చుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వాయిదాలతో సభలను ముగించారని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు పట్టుబడితే.. సమాధానాలు చెప్పకుండా వారం రోజుల పాటు ఆయన సభకు రాలేదని ఎద్దేవా చేశారు. బిహార్ ఓటర్ల జాబితాపై చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రజల తరుఫున ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోకపోతే మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు. చత్తీస్‌గఢ్‌లో ట్రైబల్స్ మధ్య వివాదాల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు.
ఆయన తీర్పు ఇవ్వడం అంటే.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వడమనే విషయం కూడా అమిత్ షాకు తెలియదా అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తి పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ‘ఓడిపోయే వ్యక్తిని ఎలా నిలబెడతారు’అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు.