భారత్​కు పెరుగుతున్న శరణార్థుల సమస్య : మల్లంపల్లి ధూర్జటి

భారత్​కు పెరుగుతున్న శరణార్థుల సమస్య : మల్లంపల్లి ధూర్జటి

పాకిస్తాన్ లోని ప్రస్తుత కల్లోల పరిస్థితులు భారతీయులనూ కలవరపెడుతున్నాయి. సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తదనంతర పరిణామాలతో ఆ దేశం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది. నిత్యావసర వస్తువులకే కాదు, కొన్నిచోట్ల మంచినీటికి కూడా కటకట ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇస్తానన్న రుణంలో తదుపరి భాగాన్ని పొందేందుకు పాకిస్తాన్ ఇప్పటికీ నానాతంటాలు పడుతోంది. రుణ మంజూరుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతులను పాకిస్తాన్ పాటించకపోవడమే దానికి కారణం. ఈ పరిస్థితుల్లో తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, వివిధ పార్టీలు సృష్టిస్తున్న హింసాయుత ఘటనలు, సైన్యం అణచివేత చర్యలు తట్టుకోలేక పాకిస్తాన్ పౌరులు లాహోర్ నుంచి అమృత్ సర్ వైపు శరణార్థులుగా చొచ్చుకురావచ్చు. ఇతర మార్గాల గుండా కూడా మన దేశంలోకి ప్రవేశించవచ్చు.

పెరుగుతున్న తాకిడి 

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజలు తమ భూభాగాలను భారతదేశంలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని అక్కడ నుంచి వస్తున్న వార్తలు వెల్లడిస్తున్నాయి. శరణార్థులు లక్షల్లో కాకపోయినా వేలాదిగా వచ్చినా తట్టుకోగల స్థితి భారతదేశానికి లేదు. ఒకపక్క జనాభాలో మనం చైనాను మించిపోయాం. కొత్తగా వచ్చిపడే కాందిశీకులకు కనీస వసతులు కల్పించగల స్థితిలో మనం ఉన్నామా? ఎందుకంటే, ఇప్పటికే మనం రకరకాల శరణార్థుల రాకతో సతమతమవుతున్నాం. మయన్మార్ లో సైనిక చర్యలతో సరిహద్దుకు ఆవలివైపు నుంచి జనం తండోపతండాలుగా మిజోరంలోకి వచ్చిపడుతున్నారు. మిజోరంలో తలదాచుకుంటున్న శరణార్థుల సంఖ్య సుమారుగా నలభై వేలకు పైగానే ఉంటుంది. వారు మయన్మార్ లోని చిన్ వర్గానికి చెందినవారు. మిజోలకి, వాళ్ళకి జాతిపరమైన బంధుత్వం ఉంది. మిజోరం ప్రభుత్వం శరణార్థుల పట్ల ఇంతవరకు ఎంతో సహనంతో వ్యవహరించడానికి అదీ ఒక కారణమే. కమ్యూనిస్టు చైనా పీడిస్తుందనే భయంతో టిబెటన్ శరణార్థులు చాలా కాలం నుంచి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో 1971లో లక్షలాది మంది కాందిశీకులు బెంగాల్ లో రక్షణ పొందారు. శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా ఆమధ్య శ్రీలంక తమిళులు తమిళనాడులోని రామేశ్వరం తదితరచోట్లకు వచ్చి రోజులు గడుపుకొన్న స్థితిని చూశాం. బంగ్లాదేశ్ లో భద్రతా బలగాల చర్యలతో కుకీ-చిన్ శరణార్థులు ఇంచుమించు ఒక ఏడాది కాలంగా ఈశాన్య ప్రాంతంలోకి వచ్చిపడుతున్నారు. తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థులు ఇక్కడి కొన్ని పార్టీలకు ఓటు బ్యాంకులుగా మారి తలనొప్పిగా పరిణమిస్తున్నారు. వారు శాశ్వతంగా తిష్టవేసే కుట్రలకు పాల్పడుతున్నారు. ఉన్న అరకొర వనరులకు పోటీ పెరుగుతోంది. శరణార్థుల పట్ల స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబకడానికి ఇది కారణమవుతోంది. 

స్థిరమైన శరణార్థి విధానం అవసరం

మనది ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం.అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాలని అభిలషిస్తున్నాం. భారతదేశం 1951 నాటి ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంప్రదాయ పత్రంపై సంతకం చేయలేదు. అది ఐరోపా నుంచి వచ్చే శరణార్థులకు సంబంధించినది. దాన్ని సవరిస్తూ అన్ని దేశాల శరణార్థులకూ వర్తించే విధంగా 1967లో రూపొందిన నిర్వహణ నియమాల పత్రంపై కూడా భారత్ సంతకం చేయలేదు. ప్రస్తుత పద్ధతితో మానవతా దృక్ఫథంతో రకరకాల శరణార్థులకు తగినంత రక్షణా కల్పించలేకపోతున్నాం. వారిని మూడవ దేశానికి పంపడం లాంటి మరో మార్గమూ చూపించలేకపోతున్నాం. పొరుగు దేశాలలో ప్రజాస్వామ్యం కొరవడడం కూడా ఆయా దేశాల పౌరులు శరణార్థులుగా మారడానికి కారణమవుతోంది. ఆయా దేశాల్లో సైనిక పాలన మానవ హక్కులను మంటగలుపుతోంది. చిన్నాభిన్నమవుతున్న ఆర్థిక వ్యవస్థలు జనానికి బతుకు బాటలు చూపించలేకపోతున్నాయి. 

కేంద్రం సమగ్రంగా సమీక్షించుకోవాలి

జాతి, మతం, జాతీయత, ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి లేదా ఒక రాజకీయఅభిప్రాయానికి అనుబంధంగా ఉండడం వల్ల ఒక దేశంలో వేధింపులకు గురవుతున్నవారు పరాయి దేశాలకు వెళ్ళి కొన్ని హక్కులు పొందడానికి నిర్వహణ నియమాల పత్రం వీలు కల్పిస్తోంది. 1948 నాటి అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 14వ అధికరణాన్ని అనుసరించి ఆ పత్రం విదేశాల్లో హక్కులు పొందే వీలు కల్పిస్తున్నది.  ఐక్యరాజ్య సమితి ఏటా జూన్ 20వ తేదీని ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా పాటిస్తోంది. భారతదేశంలో శరణార్థులుగా నమోదు చేసుకున్నవారు 2022 జూన్ నాటికే 46 వేలకు పైగా ఉన్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల హైకమిషన్ (ఇండియా) తెలుపుతోంది. వాస్తవానికి, వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. గత ఏడాది (2022)చివరి నాటికి భారతదేశంలో సుమారు 4,05,000 మంది శరణార్థులున్నారని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న రైట్స్ అండ్ రిస్క్ ఎనాలసిస్ గ్రూప్ వెల్లడిస్తోంది. శరణార్థులలో పురుషులు, మహిళలతోపాటు అన్ని వయసులవారూ ఉన్నారు. మొత్తానికి, శరణార్థుల నిర్వహణ యంత్రాంగాన్ని కేంద్రం సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 

సమస్యలు, సవాళ్లు

ఈశాన్య ప్రాంతంలో ప్రాంతీయ తెగల సంఖ్యలో హెచ్చు తగ్గులు ఏర్పడి పరస్పర విద్వేషాలు పుట్టుకొస్తున్నాయి. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడుతూ పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరిస్తూ వస్తోంది. కానీ, ఒక స్థిరమైన శరణార్థి విధానాన్ని రూపొందించుకోలేదు. విదేశీయుల చట్టం కింద తామెక్కడ ప్రాసిక్యూషన్ కు గురవుతామోనని శరణార్థులు భయాందోళనలకు లోనవుతున్నారు. అదే సమయంలో, జీవనోపాధి మార్గాలు లేక, వారు అడ్డదారులు తొక్కుతున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దిగుతున్నారు. మయన్మార్ శరణార్థులు స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా, ఇతర నేరపూరిత కలాపాలు సాగిస్తున్న సంఘటనలు పెచ్చుమీరుతున్నట్లుగా మిజోరం నుంచి వస్తున్న వార్తలు సూచిస్తున్నాయి. అది ఏ క్షణంలోనైనా విస్ఫోటం చెందగల అగ్ని పర్వతంలా ఉంది. రోహింగ్యాలు ఎంత బెడదగా పరిణమించారో మన అనుభవం చెబుతోంది. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగాక తాలిబాన్ క్షణాల్లో అధికారాన్ని  కైవసం చేసుకుంది. అక్కడి మాజీ ప్రభుత్వంలో పనిచేసినవారికి, న్యూఢిల్లీతో స్నేహపూర్వకంగా మెలిగినవారికి మనం తగినంత సంఖ్యలో ఆశ్రయం కల్పించలేకపోయాం. అఫ్ఘానిస్తాన్ లో భారతదేశం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసిన వారిని ఆదుకోలేకపోయాం. భారతదేశంలోని శిబిరాల్లో ఆశ్రయం పొందినవారిలో అఫ్ఘాన్లు అసలు లేరని కాదు. అలాగే, పాకిస్తాన్ లో వేధింపులు తట్టుకోలేక రాజస్థాన్ కు వచ్చి తలదాచుకుంటున్న హిందువులూ ఉన్నారు.

-  మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్