
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐసీటీ ఈ శిక్ష విధించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. గతేడాది గోబిందగంజ్ ఉప జిల్లా మాజీ చైర్మన్, నిషేధిత బంగ్లాదేశ్ ఛత్ర లీగ్(బీసీఎల్) నేత షకీల్ అకాండ్ బుల్బుల్‌తో షేక్ హసీనా ఫోన్లో మాట్లాడుతూ.. "నాపై 227 కేసులు నమోదయ్యాయి.. కాబట్టి నాకు 227 మందిని చంపడానికి లైసెన్స్ లభించింది" అని అన్నారు.
ఈ సంభాషణ లీకై సోషల్మీడియాలో వైరల్అయింది. ఇది ఐసీటీ కోర్టుకు చేరగా.. ఆ వ్యాఖ్యలు ధిక్కారపూరితంగా, కోర్టును బెదిరించేలా ఉన్నాయని ట్రిబ్యునల్ పరిగణించింది. ఈ మేరకు జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మోజుందర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్-1 (ఐసీటీ)లోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ హసీనాకు ఆరు నెలలు, బుల్బుల్ కు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.
వారిని అరెస్టు చేసిన రోజు లేదా లొంగిపోయిన రోజు నుంచి శిక్ష అమలులోకి వస్తుందని ట్రిబ్యునల్ పేర్కొంది. గత సంవత్సరం ఆగస్టు 5న బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి ఆ దేశ ప్రధాని హసీనా దేశం విడిచి భారత్కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే.