ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: అధికార టీఆర్ఎస్​ పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్లకే దళిత బంధు ఇస్తున్నారని తిమ్మాపూర్ గ్రామ దళితులు ఫైర్​అయ్యారు. శుక్రవారం నిర్మల్–​-భైంసా నేషనల్​హైవేపై సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. అనర్హులకు దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఎమ్మెల్యేతో మహిళలు వాగ్వాదానికి దిగారు. స్పందించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అర్హులకే ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందళన విరమించారు. 

వరద బాధితులకు రూ.3800 ఇవ్వడం సిగ్గుచేటు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వరద బాధితులకు రాష్ర్ట ప్రభుత్వం రూ.3800 మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. వరదలు వచ్చిన మిగతా జిల్లాల్లో రూ.10 వేలు ఇచ్చి మంచిర్యాల జిల్లా ప్రజలకు ఇవ్వకపోవడం ఎమ్మెల్యేల చేతగానితనానికి నిదర్శనమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దగ్గరికి వెళ్లి వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని అడిగే దమ్ము ధైర్యం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుకు లేవన్నారు. వెంటనే ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున అందించాలని డిమాండ్​ చేశారు.  

వన్యప్రాణుల కోసమే గిరిజనులకు పునరావాసం

కడెం,వెలుగు: వన్యప్రాణుల సంరక్షించడం కోసమే ప్రభుత్వం గిరిజనులకు పునరావాసం కల్పిస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన మండలంలోని రాంపూర్ మైసంపేట గ్రామస్తులకు పునరావాసం కింద ఏర్పాటు చేసిన ఇండ్ల స్థలాలకు పట్టాలు, చెక్కులు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదన్నారు. రాంపూర్, మైసంపేట గ్రామాలకు సంబంధించి142 కుటుంబాలకు పునరావాసం కల్పించడం జరుగుతుందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డబ్బులు వద్దనుకున్న వారికి వ్యవసాయ భూమి ఇస్తున్నట్లు తెలిపారు. పురావాసం కోసం స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్, అటవీశాఖ అధికారులు ఎంతో కృషిచేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, జడ్పీ  చైర్ పర్సన్ విజయలక్ష్మి, రాంకిషన్ రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్​ జైస్వాల్,  సీసీఎఫ్ శర్వనన్, జిల్లా అటవీ అధికారి హీరామత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రెస్​క్లబ్​ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, జడ్పీ కోఆప్షన్​సభ్యుడు రఫిఖ్​అహ్మద్, జర్నలిస్టులు తోకల రాజశేఖర్, తక్కల రవీందర్, అల్లాడి రంజిత్, పాకనాటి రాజేందర్, రాచకొండ రవీందర్, దశిగౌడ్, రాపర్తి వెంకటేశ్, గుబ్బలి రాకేశ్, కాకెర రమేశ్​, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

షర్మిల యాత్రను సక్సెస్​ చేయండి

భైంసా,వెలుగు: ముథోల్ ​నియోజకవర్గంలో శనివారం వైఎస్సార్​టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను సక్సెస్​చేయాలని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్​ కోరారు. శుక్రవారం స్థానిక ఐబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా మండలం బడ్ గాం నుంచి యాత్ర ప్రారంభమై ఆటో నగర్, కుభీర్ చౌరస్తా, గాంధీ గంజ్, మాటేగాం, వానల్ పాడ్, కల్లూర్, తురాటి మీదుగా నిర్మల్​కు  చేరుకుంటుందన్నారు. శనివారం సాయంత్రం భైంసా బస్టాండ్​ వద్ద బహిరంగ సభ ఉంటుందన్నారు. ఆదివారం వానల్​పాడ్​లో సభ ఉంటుందని వివరించారు. సమావేశంలో పార్టీ ముథోల్​ నియోజకవర్గ కో ఆర్డినేటర్  బెజ్జంకి ముత్యంరెడ్డి తదితరులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించడంలో సర్కార్​ విఫలం

కాగజ్ నగర్,వెలుగు: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్​సర్కార్​ విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. దహెగాం మండలం లగ్గామ పెద్దవాగు వంతెన అప్రోచ్ రోడ్డు, అందవెల్లి వంతెన కోసం శనివారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం కాగజ్​నగర్​లోని పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులపాటు యాత్ర కొనసాగుతుందన్నారు. ముగింపు సభకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు హాజరవుతారన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలెం వెంకటేశ్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్, ఉపాధ్యక్షుడు సుధాకర్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి డొంగ్రి అరుణ్, ఉపాధ్యక్షుడు కుమ్మరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు దళిత బంధు ఇవ్వకుంటే ఉద్యమమే

భైంసా,వెలుగు: అర్హులకు దళిత బంధు ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​తెలిపారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే దళిత బంధు ఇవ్వడం సరికాదన్నారు. ప్రతీ ఊళ్లో కూలినాలి చేసి పూటగడవని గడవని దళిత కుటుంబాలు చాలా ఉన్నాయన్నారు. మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్​రెడ్డి స్పందించి పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు.

పత్తి పంటలో మెలకువలు పాటించాలి

భైంసా,వెలుగు: రైతులు పత్తి సాగులో మెలకువలు పాటించాలని నవయుగ సీడ్స్ ఆర్ఎం సత్యనారాయణ సూచించారు. శుక్రవారం భైంసా మండలంలోని లింగా గ్రామంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంటను ఎప్పటికప్పుడు ఆజమాయిషీ చేయడంతో పాటు కలుపుతీత, పిచ్చి మొక్కలు తొలగిస్తే మంచి దిగుబడి వస్తుందన్నారు. అప్సర రకం సీడ్​తో 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. మాజీ సర్పంచ్ గంగాధర్​ పటేల్, సిబ్బంది గంగయ్య, శివకుమార్, దత్తు పాల్గొన్నారు.