- నియోజకవర్గాల పునర్విభజనతో 179కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు
- 33 శాతం రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 స్థానాలు
- అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ
- శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు
హైదరాబాద్, వెలుగు: 2029 అసెంబ్లీ ఎన్నికలు.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతోపాటు 33 శాతం మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏ ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసినా పెరగబోయే స్థానాలు, మహిళా రిజర్వేషన్ కింద దక్కబోయే సీట్లపైనే చర్చించుకుంటున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు 179కి పెరగనున్నాయి. 33 శాతం విమెన్ రిజర్వేషన్ అమలైతే తెలంగాణలో వారికి ఏకంగా 59 సీట్లు దక్కనున్నాయి. మహిళలకు ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు రిజర్వుకానుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు తమ కుటుంబాల్లోని మహిళలకు రెండో సీటుపై ఇప్పటి నుంచే కన్నేస్తున్నారు. ఆ దిశగా భార్య, కూతు రు, కోడలుతో రాజకీయ పరిచయ కార్యక్రమం చేయిస్తున్నారు. పండుగలు, పబ్బాలు, ఇతర శుభ కార్యాలను పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు శుభాకాంక్షలు చెపుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీటిపై జనాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఆశావహుల లిస్టులో చాలా మంది..
రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న వారి జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, మంత్రులు కొండా సురేఖ కూతురు సుష్మిత, దామోదర రాజనర్సింహ కూతురు త్రిష, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బిడ్డ విజయ లక్ష్మి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోడలు చరిష్మా రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య భార్య అనిత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు. భట్టి భార్య నందిని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటును ఆశించారు. కానీ, కొన్ని సమీకరణాల వల్ల టికెట్దక్కలేదు.
భట్టి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజీగా ఉండడంతో.. ప్రస్తుతం మధిర నియోజకవర్గం బాధ్యతలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి ఇప్పటికే రాజ కీయాల్లో భర్తకు తోడుగా ఉంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఆమె భర్త తరఫున స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్న ఆమె.. వారి బాగోగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గతంలోనే ఆమె జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్సీ కావడం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇక ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య భార్య అనిత.. బీర్ల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భార్య నాగమణి.. అద్దంకి వెంట రాజకీయాల్లో చాలా కాలంగా నేరుగా పాల్గొంటున్నారు. ఈమె ఎస్టీ కావడంతో ఎస్టీ మహిళా కోటాలో ఎమ్మెల్యే అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కొండా సుష్మిత పేరుతో కటౌట్లు..
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఇప్పటికే తల్లితో పాటు తండ్రి మురళీ వెంట పరకాల నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమె పేరు మీద స్థానికంగా భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు వెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మిత పోటీ ఖాయమని ఆమె తండ్రి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ఇప్పటికే ప్రకటించారు. దామోదర రాజనర్సింహ కూతురు త్రిష కూడా తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన ఆంధోల్లో రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఇప్పటికే ‘‘అలయ్.. బలయ్’’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు, దసరా సంస్కృతి, సంప్రదాయాలు, రుచులను జనాలకు అందిస్తున్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటు న్నారు. మల్లారెడ్డి కొడుకులను మించి ఆమె ఎలివేట్ అవుతున్నారు. బీజేపీ నుంచి ఆమె ఎంట్రీ ఖాయమనే ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. తన కోడలు చరిష్మా రెడ్డిని తన వారసురాలుగా వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెనే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి క్షణంలో పౌరసత్వ సమస్య కారణంగా తన కోడలిని రంగంలోకి దింపి.. అన్నీ తానై గెలిపించుకున్నారు. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి ఈ మహిళా రిజర్వేషన్లను తన రాజకీయ ఎదుగుదలకు మంచి అవకాశంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
