LasyaNanditha: ఏడాదిగా సాయన్న కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యుఘంటికలు

LasyaNanditha: ఏడాదిగా సాయన్న కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యుఘంటికలు

కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబాన్ని గత ఏడాది కాలంగా మృత్యుఘంటికలు వెంటాడుతున్నాయి. కాలం కక్ష్య కట్టిందన్నట్టుగా ఒకే ఏడాదిలో తండ్రి, కూతుళ్లు ఇద్దరూ చనిపోయారు. సాయన్న కుటుంబానికి అడుగడుగున ప్రమాదాలతో అన్నీ అడ్డంకులే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  జీ.సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. ఐదు సార్లు MLAగా కంటోన్మెంట్ నుంచి గెలిచారు. 2023 ఫిబ్రవరి 16న ఆయన కిడ్నీ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో యశోద హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 19న మృతి చెందారు. గతేడాది సరిగ్గా ఇదే నెలలో  తండ్రి మృతి చెందగా.. ఈ రోజు (ఫిబ్రవరి 23)న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కూతురు లాస్య నందిత చినిపోయింది. 

సాయన్న, గీతా దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఆయన మరణాంతరం తన కూతురు లాస్య నందిత రాజకీయ వారసత్వాన్ని కొనసాగించింది. సాయన్న చనిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కొంత గడువు మాత్రమే ఉందని కంటోన్మెంట్ నియోజరవర్గానికి ఉపఎన్నికలు నిర్వహించలేదు. 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్య నందితను బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబెట్టగా.. ఆమె విజయం సాధించారు. కొద్ది రోజుల నుంచి ఆమెకు అడుగడుగున ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మొదటగా ఓ ఫంక్షన్ కు వెళ్లిన లాస్య లిఫ్ట్ లో చిక్కుకుంది. తర్వాత ఫిబ్రవరి 13న కేసీఆర్ నల్గొండ సభకు వెళ్లొస్తున్న క్రమంలో ఆమె  కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ రోడ్డు ప్రమాదంలో హోం గార్డ్ మృతి చెందగా.. ఎమ్మెల్యే  లాస్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. మూడో సారి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె బయట పడలేకపోయింది. ఈ రోజు ఆమె ప్రమాణిస్తున్న కారు అదుపు తప్పి పటాన్ చెరు దగ్గర ఓఆర్ఆర్ పై డీవైడర్ ను ఢీకొంది. కారులో  ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ ఉన్నారు. ఈ యాక్సిడెంట్ లో అక్కడికక్కడే లాస్య నందిత మృతి చెందగా డ్రైవర్, పీఏ లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మియాపూర్ లోని శ్రీకర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.