కుర్చీలో కూర్చొని సిబ్బందితో మాట్లాడుతూ గుండెపోటుతో టీచర్ మృతి

కుర్చీలో కూర్చొని సిబ్బందితో మాట్లాడుతూ గుండెపోటుతో టీచర్ మృతి

పెద్దపల్లి జిల్లా : మంథని పట్టణంలోని ఓ స్కూల్లో గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతిచెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మంథనిలోని ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు తన్నీరు సునీత (37) పాఠశాలలోనే గుండెపోటుతో మృతిచెందారు. సునీత ప్రతిరోజూ మంచిర్యాల నుండి వచ్చి మంథనిలో విధులు నిర్వహిస్తున్నారు. కుర్చీలో కూర్చొని తోటి ఉపాధ్యాయులతో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి మృతిచెందారు.

మృతురాలు సునీతకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 370 జీవో ప్రకారం గత ఏడాది జులై నెలలో పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీపై వచ్చారు. అంతకుముందు అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో విధులు నిర్వహించారు. సునీత భర్త వేణుగోపాల్ SGTగా అంతర్గాం మండలంలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు తన్నీరు సునీత మృతిని తట్టుకోలేక తోటి సిబ్బంది ఇంకా షాక్​ లోనే ఉన్నారు. ఆమెతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఇటు విద్యార్థులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.