శిథిలాల కింద నలిగిన బతుకులు

శిథిలాల కింద నలిగిన బతుకులు

టర్కీలో 8,754 మంది, 
సిరియాలో 2,470 మంది మృతి

చిట్టి తమ్ముడితో 17 గంటల పాటు భవన శిథిలాల కిందే ఉండిపోయిన అక్క.. శిథిలాల కింద ఊపిరి వదిలిన అమ్మ పక్కన ఏడుస్తూ ఉండిపోయిన పసికందు.. 
అప్పటిదాకా ఆనందంగా నివసించిన భవనం కిందే నలిగిపోయిన తమ వాళ్లను కడసారి చూసుకునేందుకు శిథిలాల వద్ద నిలబడి ఎదురుచూస్తున్న బంధువులు.. 
ఇలాంటి మరెన్నో హృదయవిదారక దృశ్యాలు  టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.

గాజియన్​టెప్(టర్కీ) : టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 11,224కు చేరింది. టర్కీలో 8,754 మంది, సిరియాలో 2,470 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 20వేలు దాటొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) అంచనా వేస్తోంది. ఈ భూకంపం వల్ల మొత్తం 8.5 కోట్ల టర్కీ జనాభాలో 1.3 కోట్ల మంది ప్రభావితులయ్యారని అధ్యక్షుడు ఎర్డోగన్​ వెల్లడించారు. ఇప్పటికే 4 భూకంపాలను ఎదుర్కొని అల్లాడుతున్న టర్కీలో బుధవారం ఉదయం గాజియన్​టెప్​ ప్రావిన్స్​లో మరో ఎర్త్​ క్వేక్​ సంభవించింది.

భూకంప పన్ను డబ్బు  ఏమైపోయింది? 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టర్కీలో భూకంప పన్ను (క్వేక్​ ట్యాక్స్​) కూడా ఉంది. దీన్ని ‘స్పెషల్​ కమ్యూనికేషన్​ ట్యాక్స్’ అని  పిలుస్తారు. భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న భూభాగంలో ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా  ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నారు. 1999లో టర్కీలో భారీ భూకంపం సంభవించి దాదాపు 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం దాదాపు రూ.38వేల కోట్లు ఖర్చు చేశారు. మరోమారు భూకంపం తర్వాత మరో రూ.43వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్​ ప్రకటించారు. భూకంపాలు వచ్చినప్పుడల్లా ఇంత భారీ సహాయక ప్యాకేజీలు ప్రకటించడం కష్టమవుతుందని భావించిన టర్కీ ప్రభుత్వం 1999 ఎర్త్​క్వేక్​ తర్వాతి నుంచి క్వేక్​ ట్యాక్స్​ను అమల్లోకి తెచ్చింది. 1999 నుంచి 2003 మధ్యకాలంలోనే దాదాపు రూ.9,900 కోట్లను క్వేక్ ట్యాక్స్​ రూపంలో కలెక్ట్​ చేశారు. ఈ లెక్కన ప్రస్తుతం టర్కీ ప్రభుత్వ ఖజానాలో కనీసం రూ.38 వేల కోట్ల క్వేక్​ ట్యాక్స్​ డబ్బులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. టర్కీలోని  పలు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో వేగం నెమ్మదించింది. దీంతో భూకంప సహాయక చర్యల కోసం ఖర్చు చేయాల్సిన ఆ డబ్బంతా ఎటుపోయింది ? అని  టర్కీ ప్రజలు అధ్యక్షుడు ఎర్డోగన్​ను  ప్రశ్నిస్తున్నారు. ఆ నిధులు దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై అధ్యక్షుడు ఎర్డోగన్​ స్పందించారు. భూకంపం సంభవించిన మొదటిరోజు సహాయక చర్యలు కొంత నెమ్మదిగా జరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఇప్పుడు 60వేల మందితో కూడిన రెస్క్యూ టీమ్స్​సహాయక చర్యలను వేగవంతం చేశాయన్నారు.

ఒక భారతీయుడు గల్లంతు..

టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మరో 10 మంది భారతీయులు చిక్కుకుపోయారని, అయితే వారంతా సేఫ్​గానే ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది.  అదానా నగరంలో భారతీయుల కోసంకంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశామని తెలిపింది.  ఇండియా నుంచి మూడో ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ బుధవారం టర్కీకి బయలుదేరి వెళ్లింది.